Faced many tides and reached a great level………………………..
ఈ ఫొటోలో కనిపించే స్వామి పేరు రామభద్రాచార్య. ఈయనకు రెండేళ్ల వయసులో అంధత్వం ప్రాప్తించింది. అయినా నిరాశ పడలేదు. ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొని గొప్ప స్థాయికి చేరుకున్నారు. కనులు లేకపోయినా ఎన్నో మంచి పనులు చేయవచ్చని రుజువు చేశారు.
ప్రపంచాన్ని తనకళ్లతో చూసే అవకాశం లేకపోయినా ఆయన ప్రపంచానికి సేవచేస్తూ మన్ననలు పొందుతున్నారు. ఈ స్వామి ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాకుండా మానవతావాది కూడా. 2015 లో ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ ను ఇచ్చి సత్కరించింది. తాజాగా జ్ఞానపీఠ అవార్డును ప్రకటించింది. నాలుగు ఇతిహాసాలతో సహా 240 కి పైగా పుస్తకాలను ఆయన రచించారు
వికలాంగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఈ స్వామి అసలు పేరు గిరిధర్ మిశ్రా. రామభద్రాచార్య 1950 లో యూపీ లోని జాన్పూర్ జిల్లా సాధిక్రుద్ గ్రామంలో పుట్టారు. రెండేళ్ల వయసులో ట్రకోమా వ్యాధి వలన చూపు కోల్పోయారు. విద్య పట్ల అమితాశక్తి గల రామభద్రాచార్య 5 ఏళ్ళ వయసులో భగవద్గీతను ,8 ఏళ్ళ వయసులో రామచరిత మానస్ ను కంఠస్థం చేశారు .
17 ఏళ్ళ ప్రాయంలో సన్యాసం స్వీకరించారు. తదనంతర కాలంలో స్వామి రామభద్రాచార్య చిత్రకూట్ లో తులసీ పీఠాన్ని స్థాపించారు. ఇక్కడ మతపరమైన కార్యక్రమాలు కాకుండా పలు సామాజిక సేవలు కూడా నిర్వహిస్తున్నారు. తొలుత అక్కడే అంధుల కోసం పాఠశాల పెట్టారు.
తర్వాత రామభద్రాచార్య తన రామగానం ద్వారా 38 కోట్ల విరాళాలను సేకరించారు. ఆ సొమ్ముతో దివ్యాంగుల కోసం హ్యాండీక్యాప్డ్ యూనివర్సిటీని స్థాపించారు. ఆయన సంకల్పం ఎంత గొప్పదో ఈ వర్శిటీ స్థాపన ద్వారా విశదమౌతోంది. 2001 లో ఈ వర్సిటీని స్థాపించారు.
ఈ వర్శిటీ ద్వారా దివ్యాంగులకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నారు. రామభద్రాచార్యనే జీవితకాల వైస్ ఛాన్సలర్ గా యూపీ ప్రభుత్వం నియమించింది. ఈ వర్సిటీలో చిత్రలేఖనం , ఫోటోగ్రఫి ,కంప్యూటర్ , సంగీతం,ఇతర వృత్తి విద్యా కోర్సులు వంటివి ఎన్నో ఉన్నాయి . ఇప్పటివరకు ఈ వర్శిటీ నుంచి 3000 మంది విద్యార్థులు వివిధ కోర్సులు నేర్చుకుని ఉత్తీర్ణులై బయటకొచ్చారు.
వీరిలో కొందరు అక్కడే పనిచేస్తున్నారు … మరి కొందరు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ సొంతంగా జీవిస్తున్నారు. దివ్యాంగులు ఇతరులపై ఆధాపడకుండా ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే రామభద్రాచార్య ఆశయం. 22 భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఈ స్వామికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది.
విశ్వహిందూ పరిషత్ నేతగా కూడా స్వామికి గుర్తింపు ఉంది. రామజన్మ భూమి వివాదంలో కోర్టుకి హాజరై రాముడు అయోధ్యలోని జన్మించాడనే రామ భక్తుల వాదనకు ఆధారాలు ఇచ్చారు. వేదాల్లో ఆధారాలున్నాయని వాదిస్తూ వాటినన్నింటిని న్యాయస్థానం ముందు ఉంచారు.
కళ్ళు లేవని కలత పడితే స్వామి ఈ స్థాయికి చేరుకునేవారు కాదు .వైకల్యం ఎలాంటిదైనా సంకల్పం ముందు తలవంచాల్సిందే అని స్వామి నిరూపించారు. దివ్యాంగులకు నిజంగా ఆయన ఒక స్ఫూర్తి దాత అని చెప్పుకోవాల్సిందే.
———-KNM