ఒంగోలు రాజపానగల్ రోడ్ లో ఉండే ఈ సినిమా హాల్ ఇప్పటిది కాదు. ఈ థియేటర్ కి 80 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఒంగోలులో తొలి సినిమా హాల్ ఇదే. ఈ థియేటర్ మొదలైన తర్వాత నిర్మితమైన సినిమా హాళ్ల లో చాలావరకు మూత బడ్డాయి.
థియేటర్స్ కి జనాలు రావడం తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ థియేటర్ ఇంకా మనుగడలో ఉండటం గొప్ప విషయం.ఒంగోలు చరిత్రలో ఒక భాగంగా .. ఒక మాన్యుమెంట్ గా ఈ థియేటర్ నిలబడింది.
బ్రిటిష్ కాలం నాటి కాంట్రాక్టర్ జయరామిరెడ్డి ఈ థియేటర్ ను నిర్మించారు. 1938 సంవత్సరం నుంచి ఇక్కడ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి . 1990 లో థియేటర్ కి అవసరమైన ఆధునిక హంగులను యాజమాన్యం అమర్చుకుంది.థియేటర్ లుక్ కూడా కొంచెం మారింది. సౌండ్ సిస్టమ్ మారింది.
గతంలో ఈ థియేటర్ లో సినిమాలు చూడటానికి దూర ప్రాంతాలనుంచి బళ్ళు కట్టుకుని వచ్చేవారట. లవకుశ … పాండవవనవాసం, కీలుగుఱ్ఱం, సువర్ణసుందరి వంటి సినిమాలు చూసేందుకు జనం ఎగబడేవారట.1957 లో “సువర్ణ సుందరి” సినిమా ఈ థియేటర్ లో వందరోజులు ఆడింది.
ఆ సందర్భం గా అప్పటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావు , హీరోయిన్ అంజలీ దేవి, ఇతర సాంకేతిక నిపుణులు ఈ థియేటర్ ను సందర్శించారట. అక్కినేని అభిమానులు ఆయనను పెద్ద ఎత్తున సన్మానించారట.1958 లో ఈ థియేటర్ ను వక్కా వెంకటస్వామి రెడ్డి , బీ. పెరుమాళ్ల రెడ్డి భాగస్వాములుగా కొనుగోలు చేశారు.
అప్పటికే థియేటర్ పేరు పాపులర్ కావడం తో ఆ పేరు మార్చకుండా అలాగే నడిపారు. తర్వాత మధ్యలో కొంత కాలం లీజ్ కిచ్చారు. అనంతరం థియేటర్ కి మార్పులు చేర్పులు చేసి యాజమాన్యమే నడిపిస్తోంది.పెరుమాళ్ళ రెడ్డి తదనంతరం ఆయన కుమారుడు వెంకటేశ్వర రెడ్డి యాజమాన్య బాధ్యతలు నిర్వహించారు.
ఇంతకూ ఆరెడ్డి గారు ఎవరో కాదు ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే … ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తండ్రి గారే. 1978 లో బాలినేని వెంకటేశ్వర రెడ్డి శాసనసభకు జనతా పార్టీ తరపున పోటీ చేశారు . కేవలం 5080 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తండ్రి సాధించలేని విజయాన్ని ఆయన కుమారుడు బాలినేని శ్రీనివాస రెడ్డి సాధించారు.
వైఎస్ ఉండగా యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షునిగా శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు.2004, 2009 లలో వరుస విజయాలతో హ్యాట్రిక్ రికార్డు సాధించారు.
రెండోసారి వైఎస్సార్ ప్రభుత్వంలో గనులశాఖ, చేనేత జౌళి, స్పిన్నింగ్, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచారు.
————— K.N.MURTHY