జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ తొలి చిత్రం !

Sharing is Caring...

going back in time?……………………………

13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిది..
అంతరిక్షానికి సంబంధించి ఇప్పటి వరకూ మానవాళి చూడని అతి సుదూరమైన దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది.

అంతరిక్ష ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న… ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ తీసిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వైట్ హౌస్లో ఆవిష్కరించారు. విశ్వానికి సంబంధించి అత్యద్భుతమైన ఈ చిత్రంలో వేలాది గేలాక్సీలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలం, నారింజ, తెలుపు రంగుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిదేనని నాసా కూడా ప్రకటించింది.

1380 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహా విస్ఫోటనం  ద్వారా విశ్వం ఏర్పడింది. ఆ వెంటనే జరిగిన పరిణామాలపై ఖగోళ శాస్త్రవేత్తల్లో అమితాసక్తి నెలకొంది. సరిగ్గా ఈ అవసరం కోసం జేడబ్ల్యూఎస్‌టీని నాసా రూపొందించింది.

విశ్వంలోనే అతిభారీ టెలిస్కోప్ గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రికార్డు సృష్టించింది. ‘ఈ టెలిస్కోప్ సైన్స్ కార్యకలాపాల అధికారిక ప్రారంభాన్ని తొలి చిత్రం సూచిస్తోంది. ఇది దాని మిషన్లో భాగంగా కీలకమైన అన్వేషణలను కొనసాగిస్తోంది. జేమ్స్ వెబ్ సాధించాల్సిన తొలి ఐదు లక్ష్యాలను నాసా వెల్లడించింది.

విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు'(జేడబ్ల్యూఎస్ సీ)ను రూపొందించాయి. 2021 డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ ఎరియాన్-5 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది.

ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేడబ్ల్యూఎసీని ప్రవేశపెట్టారు. ఈ అధునాతన సాధనంతో శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలను ఛేదించనున్నారు. భారీ వ్యయప్రయాసాల కోర్చి ఈ టెలిస్కోప్ ప్రయోగాన్ని చేపట్టారు. వాస్తవానికి దీని కార్యకలాపాలు 10 సంవత్సరాలపాటు కొనసాగుతాయని భావించినప్పటికీ.. ఇందులో 20 ఏళ్లు నిరంతరంగా పని చేయడానికి తగినంత ఇంధన సామర్థ్యం ఉందని నాసా అంటోంది.

విశ్వంలో కెమెరా కళ్లకు చిక్కిన అత్యంత పురాతన కాంతి ఇదే. ఆ వెలుగు రేఖల వయసు 1300 కోట్ల ఏళ్లు. ఆ గెలాక్సీల నుంచి కాంతి మనల్ని చేరడానికి వందల కోట్ల ఏళ్లు పట్టింది. దీన్నిబట్టి మనం కాలంలో వెనక్కి వెళ్లి చూస్తున్నట్లే.

ఆ సమయంలో విశ్వం వయసు 100 కోట్ల ఏళ్ల కన్నా తక్కువే. విశ్వం విస్తరిస్తున్నందువల్ల అక్కడి నుంచి వస్తున్న కాంతి.. మనల్ని చేరే సరికి సాగిపోతుంది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపును ఈ కాంతిని పసిగట్టేలా రూపొందించారు. విశ్వంలోని ధూళిని కూడా చీల్చుకుంటూ విశ్వాన్ని పరిశీలించడానికి ఇది వీలు కల్పిస్తుంది. చూద్దాం ఇది ఎంత సమాచారాన్ని అందిస్తోందో ?

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!