Can’t imagine anyone else in that role……………..
నటుడు కొంగర జగ్గయ్య సైకో (విపరీత మనసత్త్వం) పాత్రలో అద్భుతంగా నటించిన చిత్రం ఆత్మబలం.. అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అనుమానం,అసహనం, హింసాత్మక ధోరణి,అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలున్న పాత్రలో జగ్గయ్య ఒదిగిపోయారు. తనదైన శైలిలో నటించి మెప్పించారు.
కుమార్ తనకు కావాల్సింది దక్కకపోతే చంపనైనా చంపుతాడు, చావనైనా చస్తాడు.పెద్దయ్యే కొద్దీ మరింత కఠినంగా తయారవుతాడు.ఎలాంటి స్థితిలోనైనా తనకు నచ్చింది కావాల్సిందే.. తగ్గేదేలే అన్నతీరు అతగాడిది. కుమార్ (జగ్గయ్య) చిన్నప్పుడే తండ్రి ఆత్మహత్యను చూసి మానసికంగా దెబ్బతింటాడు.
మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. తండ్రి జీన్స్ ప్రభావం కూడా అతనిపై ఉంటుంది. ఈ ‘ఆత్మబలం’ సినిమాకు బెంగాలీ చిత్రం ‘అగ్నిసంస్కార’ మాతృక. కుమార్ ఆస్తిపరుడు. వాళ్ల ఫ్యాక్టరీలో ఆనంద్ (ANR ) ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. కుమార్ తల్లి (కన్నాంబ) చేరదీసిన జయ (సరోజాదేవి), ఆనంద్ ప్రేమించుకుంటారు.
మానసిక చికిత్సాలయం నుంచి తప్పించుకున్న కుమార్‌ను పట్టుకొని, బుజ్జగించి ఇంటికి తీసుకొస్తాడు ఆనంద్. అక్కడ జయను చూసిన కుమార్.. ఆమెను పెండ్లి చేసుకుంటానని తల్లికి చెబుతాడు.
జయ కాదంటే కుమార్ఎక్కడ ప్రాణాలు తీసుకుంటాడో అని అతని తల్లి భయపడుతుంది.
తన కొడుకును పెళ్లి చేసుకోవాల్సిందిగా జయను కోరుతుంది. తమను ఆదరించిన యజమానురాలి సంతోషం కోసం ఆనంద్, జయ తమ ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడతారు. అయితే జయ తనను కాకుండా ఆనంద్‌ను ప్రేమిస్తున్నదని తెలుసుకుంటాడు కుమార్.
తనకు దక్కని జయ ఆనంద్ కి దక్క కూడదని నిర్ణయించుకుంటాడు. తనను ఆనందే చంపినట్లుగా ఆధారాలు సృష్టించి ఆత్మహత్యకు పూనుకుంటాడు.ఆనంద్ ను అరెస్ట్ చేస్తారు. కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది.. జయ ఆనంద్ ను ఎలా రక్షిస్తుంది అనేది ముగింపు.
దర్శకుడు వి.మధుసూధనరావు కథను చాలా జాగ్రత్తగా తెర కెక్కించారు. స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకున్నారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు.. కథలో కలిసిపోయే రేలంగి ,రమణారెడ్డి పాత్రలతో కామెడీ ట్రాక్ పెట్టారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ పాట లో జగ్గయ్య నటన,చూపులు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటాయి.
ఆ పాట తెరకెక్కించిన తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ‘పాడు’ అని జగ్గయ్య గదమడం.. ‘డాన్స్’ అని అరవడం పాత్రలోని సైకో లక్షణాలను చూపుతాయి. బీ సరోజ డాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ANR పియానో వాయిస్తూ జగ్గయ్యను గమనిస్తుంటాడు. పాత్రను దృష్టిలో ఉంచుకుని ఆత్రేయ ఈ పాట రాశారు.. ‘నిను విడిచి నే వెళితే బతక లేవంట’అని సరోజ అనగానే జగ్గయ్య నవ్వులు .. చూపులు ..హావభావాలు ప్రత్యేకంగా ఉంటాయి.
పాత్రకు తగిన ఐ ఎక్స్ప్రెషన్స్ అవి జగ్గయ్యకే సాధ్యం అని చెప్పవచ్చు. ANR జగ్గయ్య ల సంభాషణలు కూడా పాత్రోచితంగా ఉంటాయి. ANR సరోజ లు ప్రేమించుకుంటున్నారని జగ్గయ్య కి తెలిసినప్పటినుంచి కథ వేగం పుంజుకుంటుంది. జగ్గయ్య ఆత్మహత్య చేసుకోవడానికి పకడ్బందీ గా ప్లాన్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ప్రేక్షకుల్లో ఉత్కంఠ ను రేకెత్తిస్తాయి.
సినిమాలో అక్కినేని, బీ సరోజా దేవి,జగ్గయ్యలవే కీలక పాత్రలు ముగ్గురూ బాగా చేశారు. చివరలో నాగయ్య గుమ్మడి లాయర్,డాక్టర్ పాత్రల్లో కనిపిస్తారు. రమణా రెడ్డి చిన్నపాటి విలన్ గా మెప్పించారు. రేలంగి, సూర్య కాంతం,గిరిజ వారి పాత్రల పరిథిలో బాగా చేశారు.
ఈ సినిమాకు మామ మహదేవన్ BGM అదనపు బలాన్నిచ్చింది. సినిమా కథ విన్నాక ఇందులో పాటలకు అవకాశమే లేదన్నాడట KVమహదేవన్. పాటలకోసం ఆత్రేయ, మధుసూధనరావులు మరింత కసరత్తు చేశారు. ఆత్రేయ మాటలు పాటలు ఆకట్టుకుంటాయి.
ఆత్రేయ రాసిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే..’ ‘గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి.. నీ కండ్లల్లో ఉన్నదీ భలే బడాయి..’, ‘పరుగులు తీసే నీ వయసునకు.. పగ్గం వేసెను నా మనసు..’ ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి పాటలకు మామ అద్భుతమైన బాణీలు కట్టారు. అవన్నీ ఎవర్గ్రీన్ సాంగ్స్ గా మిగిలిపోయాయి.
ఈ సినిమా యూ ట్యూబ్ లో ఉంది..చూడని వారు చూడవచ్చు.చూసినవారు కూడా చూడవచ్చు.
కొసమెరుపు … ఇలాంటి సైకో పాత్రను ‘గుడిగంటలు’ సినిమాలో ఎన్టీఆర్ చేశారు.అందులో ఎన్టీఆర్ కూడా అద్భుతంగా చేశారు.ఇందులోANR పాత్ర లాంటిదే అందులో జగ్గయ్య పాత్ర. ఇక ‘ఆత్మబలం’.. ‘గుడిగంటలు’ సినిమాలు 1964 సంక్రాంతి రేసులో నిలిచి విజయం సాధించాయి. తమాషా ఏమిటంటే రెండింటికి మధుసూధనరావే దర్శకుడు. ఒకటి బెంగాలీ కథ ..మరొకటి తమిళ కథ .
——KNM

