రఫ్ఫాడించలేక పోయాడు !

Sharing is Caring...

జఫ్ఫా … సినిమా పేరు ఇది .. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించారు. మరో కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 2013 లో ఈ సినిమా విడుదల అయింది. ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వెన్నెల కిషోర్ డైరెక్టర్ గా చేసిన రెండో ప్రయత్నం ఈ జఫ్ఫా. ఇది కూడా పెద్దగా ఆడలేదు.  

ఎలాంటి పాత్రనైనా బ్రహ్మానందం అవలీలగా చేసేయగలడు. కానీ ఈ జఫ్ఫా లో చేయడానికి స్కోప్ లేదు.కథ బలహీనంగా ఉండటం తో సినిమా నత్తనడక నడుస్తుంది. బ్రహ్మానందం ఉండి కూడా ప్రయోజనం లేకపోయింది. తన కిచ్చిన పాత్ర మేరకు బ్రహ్మానందం చక్కగా నటించాడు. ఆ పాత్రలో జీవించాడు . కాసేపు నవ్వించాడు. 

కొన్ని సీన్లు మరీ పేలవంగా ఉన్నాయి. ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే  కామెడీ సినిమా లో లేదు. అయితే కొన్నికొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఎంజాయ్  చేసేలా తీశారు. కథ .. కథనం మీద మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. స్టోరీ లైన్ ఆసక్తికరంగా లేదు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తో  సినిమా తీసేటప్పుడు కథలో హాస్య సన్నివేశాలను అద్భుతంగా మలచుకోవాలి.ఆ మేరకు కసరత్తు చేయాలి.

బ్రహ్మి తో పాటు సినిమాలో ఆలీ, సప్తగిరి,వేణు మాధవ్, మేల్కొటే, ధనరాజ్ , రఘుబాబు వంటి కమెడియన్స్ నటించారు. వారితో పాటు వెన్నెల కిషోర్ పూర్తి స్థాయి పాత్ర పోషించాడు. జబర్దస్త్ టీమ్ సభ్యులు చాలామంది ఉన్నారు. తాగుబోతు రమేష్ కూడా కాటి కాపరి పాత్రలో కాసేపు అలరించాడు. ఇంతమంది కమెడియన్స్ కాంబినేషన్ లో తీసినా  సినిమాలో ఆద్యంతం నవ్వులు పూయలేదు. అదే సినిమాకు మైనస్ అయింది.

కథను సాగదీసినట్టుంది. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ పేలినప్పటికీ మిగతా సినిమా చప్పగా ఉంటుంది. ఆలీ సీన్స్ కూడా పండలేదు. ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమా మొత్తం మీద అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అంటూ అన్ని బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. సినిమా సరిగ్గా రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.

కామెడీ రాయడం వేరు …కామెడీ పాత్రలు చేయడం వేరు… కామెడీ సినిమాలు తీయడం వేరు. ఎందరో కమెడియన్లు ఉన్నారని .. వాళ్ళు ఉంటే చాలు సినిమా హిట్ అని లెక్కలు వేసినట్టున్నారు. అందుకే కథ పైన గురి పెట్టలేదు. దాంతో చౌ చౌ గా సినిమా తయారైంది. సినిమా నిడివి ఇంకా తగ్గి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా కొంచెం ఓపిగ్గా చూడాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!