జసిందా ఈ పేరు వినే ఉంటారు. న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి మొన్నటి అక్టోబర్ లో జసిందా ఎన్నికయ్యారు. చాలాకాలంగా జసిందా(40) తన బాయ్ ఫ్రెండ్ క్లార్క్ గెఫోర్డ్ (44)తో సహజీవనం చేస్తోన్నది. మూడేళ్ళ క్రితం ఒక చిన్నారిని కూడా కన్నది. 2019 లో ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అనుకోకుండా వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవల పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అతిధుల జాబితా తయారయ్యాక పెళ్లి తేదీని అధికారికంగా వెల్లడిస్తారట. న్యూజిలాండ్ లో డిసెంబర్, జనవరి,ఫిబ్రవరి వేసవి నెలలు. అంటే ఆ సమయంలో వీరి పెళ్లి జరగొచ్చు అంటున్నారు.
జసిందా కు ప్రజానాయకురాలిగా మంచి పేరుంది. నెలల బిడ్డతో ఆమె అసెంబ్లీ కి వచ్చి ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనేది. ప్రభుత్వ విధానాలపై మాట్లాడేది. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించేది. పిల్లను తీసుకునే వివిధ దేశాల్లో జరిగే కీలక సమావేశాలకు సైతం హాజరయ్యేది. గత ఏడాది జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో జసిందా నాయకత్వం లోని లేబర్ పార్టీకి 49 శాతం ఓట్లు లభించాయి. దీంతో పార్లమెంటులో లేబర్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లభించింది. అప్పటికే ప్రధానిగా ఉన్న జసిందా రెండోసారి పీఎం అయ్యారు. పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన మహిళల్లో జసిందా ఒకరు.
న్యూజిలాండ్ ను కరోనా రహిత దేశంగా మార్చారు.ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకున్నారు. కరోనా వైరస్ విషయం గమనించగానే న్యూజిలాండ్ సరిహద్దులు మూసివేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పౌరులను చైతన్య పరిచారు. నెల రోజులు దేశాన్ని లాక్డౌన్ లో ఉంచారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని దృవీకరించుకున్నాకనే లాక్ డౌన్ ఎత్తివేశారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించారు. ఆ దేశం జనాభా సుమారు 5 మిలియన్లు మాత్రమే. ముందస్తు జాగ్రత్తలు ఆ దేశాన్ని కాపాడాయి.
కాగా అంతకు ముందు క్రిస్ట్ చర్చ్ లో మసీదులపై దాడులు జరిగిన క్రమంలో ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వపరంగా స్పందించి మీకు అండగా మేమున్నాం అంటూ ప్రజలకు భరోసా ఇచ్చింది జసిందా.సమర్ధవంతంగా వ్యవహరించి ప్రజలకు ధైర్యం చెప్పడంలో ఎంతో పరిణితి, మానవతను చూపారామె. ఈ అంశాలన్నీ ప్రజలను ఆకట్టుకున్నాయి. అందుకే రెండోసారి ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు.జసిందా 28 ఏళ్ళ చిన్న వయసులో ప్రతినిధుల సభలో ప్రవేశించారు.
అప్పటికి పార్లమెంట్ లో ఆమె ఒక్కరే అతి పిన్న వయస్కురాలు. అప్పటి నుంచి లేబర్ పార్టీ నాయకుడు ఆండ్రూ లిటిల్ దగ్గరే డిప్యూటీ నేతగా పనిచేశారు. 2017 లో ఆండ్రూ తన వారసురాలిగా జసిందా ను ప్రకటించి పదవీ విరమణ చేసాడు.
ఇక అక్కడి నుంచి జసిందా దూసుకుపోయింది. సంకీర్ణ ప్రభుత్వానికి నేతగా ఎంపికై దేశ పగ్గాలు చేపట్టారు. ప్రజా రంజక పాలన అందించారు. ఆమె కృషికి ప్రజల మద్దతు లభించింది. దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలలో ప్రమాదకర రకాలను నిషేదించారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి భారీ విజయం లభించడం గత ఐదు దశాబ్దాల్లో ఇదే ప్రధమం.
——- KNMURTHY