ఆ కుటుంబం బ్యాడ్మింటన్ క్రీడకే అంకితం !!

Sharing is Caring...

All are athletes……..

ఒక కుటుంబం మొత్తం ఒకే రంగానికి అంకితం కావడం విశేషం. ఆ కుటుంబం లో తండ్రి, తల్లి,కుమార్తె, కుమారుడు బ్యాడ్మింటన్  క్రీడకే అంకితమైనారు. భారత క్రీడారంగంలో ఒక అరుదైన వారసత్వాన్ని సృష్టించారు.ఆయన బ్యాడ్మింటన్ ఆటగాడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.దేశానికి ఒలింపిక్ పతకాలను అందించారు. 

ఆయన అర్ధాంగి కూడా తక్కువకాదు. ఆమె దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరు. జాతీయ స్థాయిలో ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక వారి వారసురాలు, ఆ ఇద్దరు దిగ్గజాల ప్రతిభను పుణికిపుచ్చుకుంది. నేటి తరం డబుల్స్ విభాగంలో దేశానికి ఆశాకిరణంగా మారి, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధిస్తూ వారి క్రీడా వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్తోంది.

ఇక వారసుడు శిక్షణ పొందుతున్నాడు. తల్లి, తండ్రి,అక్క ల స్పూర్తితో అతగాడు కూడా సంచలన విజయాలు సాధించేందుకు సమాయత్తమవుతున్నాడు.ఆ అద్భుత కుటుంబం ఎవరిదో కాదు.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ది.

గోపి చంద్ 1973, నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, నాగండ్ల గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాథమికంగా ప్రకాశం జిల్లాకు చెందినవారైనప్పటికీ, ఆయన కుటుంబం తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది.గోపి చంద్ తండ్రి  పుల్లెల సుభాష్ చంద్రబోస్. ఈయన బ్యాంకులో పని చేశారు.తల్లి పుల్లెల సుబ్బరావమ్మ. గోపీచంద్ క్రీడా కెరీర్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఆయన అన్నయ్య పుల్లెల రాజశేఖర్ ప్రోత్సాహంతోనే గోపీచంద్ బ్యాడ్మింటన్ వైపు మళ్లారు. హైదరాబాద్‌ లోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని ఏ.వి. కాలేజ్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రుడయ్యారు. చదువుకునే రోజుల్లోనే ఆయన ఇండియన్ కంబైన్డ్ యూనివర్శిటీస్ బ్యాడ్మింటన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్రస్థానం 10 ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. ఎస్.ఎం. ఆరిఫ్ వద్ద, ఆ తర్వాత ప్రకాష్ పదుకొనే అకాడమీలో, బెంగళూరులోని సాయి  కేంద్రంలో గంగూలీ ప్రసాద్ వద్ద శిక్షణ పొందారు.
1996 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. 2001లో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు.

ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత 2008లో ‘గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ని స్థాపించి, సైనా నెహ్వాల్, పి.వి. సింధు వంటి మేటి క్రీడాకారులను తయారు చేశారు.

క్రీడా రంగంలో ఆయన సాధించిన విజయాలకు ప్రభుత్వం ఆయనను వివిధ పురస్కారాలతో సత్కరించింది .  గోపిచంద్ అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న,పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు, పద్మభూషణ్ వంటి అవార్డులు అందుకున్నారు.  

గోపి చంద్  వైవాహిక జీవిత విషయానికొస్తే …… 2002, జూన్ 5న తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి. లక్ష్మి ని వివాహం చేసుకున్నారు.పి.వి.వి. లక్ష్మి  కూడా ఎనిమిది సార్లు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా ఒలింపియన్లలో ఒకరు.

గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  గాయత్రి గోపీచంద్, ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గా రాణిస్తున్నారు . కుమారుడు సాయి విష్ణు పుల్లెల కూడా బ్యాడ్మింటన్ లో శిక్షణ పొందుతున్నారు.గాయత్రి గోపీచంద్  ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒక వెలుగు వెలుగుతున్న క్రీడాకారిణి.

ఆమె 2003, మార్చి 4న హైదరాబాద్‌లో జన్మించారు. తొలుత కేవలం వినోదం కోసం ఆడినప్పటికీ, క్రమంగా క్రీడపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అండర్-17 విభాగంలో జాతీయ స్థాయిలో నంబర్ 1 ర్యాంకును పొందారు.

తండ్రి గోపి చంద్ ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచిన 21 ఏళ్ల తర్వాత, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్ చేరిన మొదటి భారతీయ మహిళల డబుల్స్ జంటగా చరిత్ర సృష్టించారు. 2022 లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన  కామన్వెల్త్ గేమ్స్ లో  మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్నారు.

దక్షిణాసియా క్రీడలు 2019 లో మహిళల జట్టు విభాగంలో స్వర్ణం, సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించారు. 2022లో ఒడిశా ఓపెన్ విజేతగా, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ విజేతగా నిలిచారు. 2025, జనవరిలో వీరు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో భారతీయ జంట సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే. ఫిబ్రవరి 2026 నాటికి వీరు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో కొనసాగుతున్నారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!