సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో సన్నాహాలు

Sharing is Caring...

Research on the Sun…………………….

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమై అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించిన  భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సూర్యుడి (Sun) రహస్యాలను కనుగొనేందుకు సిద్ధమౌతోంది. సెప్టెంబరు 2వ తేదీన ఉదయం 11. 50 నిమిషాలకు  ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) ప్రయోగం చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. 

ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక.. ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1 )ను మోసుకుని నింగిలోకి దూసుకు వెళుతుంది.  కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.  యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో  సౌర అధ్యయన ప్రక్రియను చేపడుతుంది. 

సూర్యుడి ని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్‌ ఇది. భూమి (Earth) నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలవుతుంది.  

ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు.

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌, మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.

ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. ఈ నెల 23న చంద్రయాన్‌-3 ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులోని రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!