జడ వెనుక ఇంత కథ ఉందా ?

Sharing is Caring...

Attractive hair style ………………………………..

“ఓ వాలు జడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా… రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా..నువ్వలిగితే నాకు దడ.” ప్రముఖ రచయిత జొన్నవిత్తుల గీతమది.జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, జడను గురించి ఎన్నెన్ని కావ్యాలు , రసిక ప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు.  

జడ పొడుగ్గా ఉండడం… ఒకప్పటి అందం…. కత్తిరించుకోవడం నేటి షోకు…జడను తలచుకోగానే సత్యభామ గుర్తొస్తుంది. జడతో కృష్ణుణ్ణి.. సుతారంగా రెండు తగిలించడం, ఎంత నాజూకు శృంగారం. మన కవులు జడల గురించి ఎన్నో పద్యాలు కూడా రాశారు. అసలు మహిళలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు? అన్నవిషయాల వెనుక పెద్ద కథే ఉంది.

ఇప్పుడు అంటే కొంతమంది ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధాలుగా వేసుకుంటారు. @  రెండు జడలు వేసుకోవడం … రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని..  పెళ్లికాలేదని అర్ధం. @  ఒక జడ వేసుకోవడం … పెళ్లి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపి వేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం.

@  ముడి పెట్టుకోవడం … జుట్టు ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం.@  అయితే ఒక జడ వేసుకున్నా , రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలుగా విడదీసి త్రివేణీ సంగమం లాగ కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు అర్ధాలు ఏమిటంటే ? తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం అంటారు. 
 
అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసి పోయేది.ఇంత అర్ధం ఉంది అంటారు.అసలు జడ వేసుకోవడం కూడా మన సంస్కృతి సంప్రదాయం అనిచెబుతుంటారు. కాగా జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం అంటారు కూడా. ఇక పెళ్లిళ్లు .. ఫంక్షన్ల సమయంలో ఆడవాళ్లు రకరకాల ఫ్యాషన్ జడలు కూడా వేసుకుంటారు.

పెళ్లికూతురు కైతే చాలా రకాల ఫ్యాషన్ జడలు వేస్తుంటారు. వీటికి స్పెషలిస్టులు కూడా ఉన్నారు. ఒక్కో మోడల్ జడకు ఒక్కో రకం ఛార్జ్ తీసుకుంటారు.  ఇందులో కూడా పొడవాటి జడ ఉన్నవాళ్లకు వేరే మోడళ్ళు .. పొట్టి జడలు ఉన్నవాళ్లకు వేరే మోడళ్ళు ఉంటాయి. ఈ జడల్లో పూల జడ, బంగారు జడ,నెమలి జడ. గాజుల జడ వంటి వెన్నో ఉన్నాయి.

అన్నింటికంటే పూల జడ అలంకరణ బాగుంటుంది. చాలామంది ఈ జడ కు ప్రాధాన్యత ఇస్తారు. అన్నట్టు బాహుబలి సినిమాలో అనుష్క దేవసేన పాత్రకు వాడిన హెయిర్ స్టైల్ బాగా పాపులర్ అయింది.  ఇక మారుతున్న కాలంతో పాటు అభిరుచులు కూడా మారుతున్నాయి. దాంతో క్రమంగా జడలు మాయమవుతున్నాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!