ప్రపంచాన్నినడిపిస్తోంది సంకల్పబలమేనా ?

Sharing is Caring...

ఈ ప్రపంచం నడుస్తుంది వ్యక్తుల సంకల్పం వలనా, విధి బలం వలనా అన్న ప్రశ్నకి రమణ మహర్షి ‘ఇవి రెండూనూ, రెండూ కాదు’ అని అర్థం వచ్చే మాటలు అన్నారట. ఏదైనా ఒక సంఘటన ‘ముందే నిర్ణయింపబడిందా’ లేక ‘అప్పటికప్పుడు మన సంకల్పం వల్ల జరిగిందా’ లాంటి ప్రశ్నలకి జవాబు వాదనల వల్లనో, బుద్ధితోనో తెలుసుకోగలిగే విషయం కాదేమో.

ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత మన సంకల్పం వల్లనే ఇది జరిగింది అనుకోవడానికి ఎంత అవకాశం ఉందో ఆ సంకల్పం కలగడం అన్న సంఘటన ముందే నిర్ణయింపబడింది అనడానికి అంతే ఆస్కారం ఉంటుంది.

ఉదాహరణకి నేల మీద పడి ఉన్న అనేక రాళ్ళల్లో ఒక రాయిని తీసుకున్నప్పుడు ఆ రాయినే తీసుకోవడం అనేది మన ఇష్టానుసారంగా జరిగిందని మనం అనుకుంటాం. అయితే ఆ సంకల్పం ముందే ‘నిర్ణయమై పోయిందా లేదా’ అన్న విషయం తెలుసుకోవాలంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన యొక్క స్మృతి లేకుండా కాలంలో వెనక్కి వెళ్ళాలి. అది సాధ్యపడే విషయం కాదు కనుక ఇది వాదనకి తేలే విషయం కాదు.

‘నేను’ అనే స్మృతులు ఉన్న వ్యక్తి ఉన్నంత కాలమూ ఆ జ్ఞాపక ఫలితాలు కర్మ రూపంలో వ్యక్తమవుతాయని అంటారు – అది ఒక కోణం. మరో కోణమేమిటంటే నేనులో ఉన్న స్మృతులను గమనిస్తూ వాటి నుంచి విడివడదామనే స్వప్రయత్నం.

మొదటి కోణాన్ని విధిబలం గాను, రెండవ కోణాన్ని సంకల్పం గాను రమణ మహర్షి చెప్పేవారు. సత్యం తెలుసుకున్న జ్ఞానులకు ఈ రెండు కోణాలూ రాలిపోతాయి. అందుకనే అందరినీ దృష్టిలో పెట్టుకుని ‘రెండూ ఉన్నాయి, రెండూ లేవు’ అని మహర్షి అని ఉంటారు.

ఈ రెంటినీ దాటి ఆవలికి పోవడానికి నిరంతరమూ ప్రతి ఆలోచననూ ‘నేను’ వైపు లేదా ‘నీ ఉనికి’ వైపు మళ్ళించమని ఆయన చెప్పేవారు. సంకల్పమా (Free will) విధిబలమా (Destiny) అని చేసే వాదనలు అంతిమ సత్యాన్ని కనుగొనడానికి ఏ మాత్రమూ ఉపకరించవు అని కూడా అనేవారు.

————-  Radha Manduva 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!