మావోయిస్టు పార్టీ పంథా సరైనదేనా ?(2)

Sharing is Caring...

sk.zakeer………………………………..

Need to rethink ………………………..రష్యన్ విప్లవం ప్రభావంతో వివిధ దేశాల్లో తొందరగా ఆధునీకరణలోకి వెళ్లాయి. పెట్టుబడిదారి దశలోకి వేగంగా ప్రయాణించేలా చేశాయి. ఎక్కడైతే ఆధునీకరణ పుంజుకుంటున్నదో,భూస్వామ్య వ్యవస్థలు పెట్టుబడిదారీ వర్గాలు రూపాంతరం చెందుతున్నాయో అక్కడ ప్రజా ఉద్యమాలు బలహీనపడుతున్నాయి.

పీపుల్స్ వార్ కు నారుపోసిన  తెలంగాణలో,అలాగే ఉద్యమాలు ఉధృతంగా సాగిన నల్లమల ప్రాంతాల్లో పోరాటాలు ఎందుకు కనుమరుగైనాయి ? మావోయిస్టు పార్టీ ఒక ప్రాంతంలో దెబ్బతింటే మరో ప్రాంతంలో మొలకెత్తవచ్చు. కానీ అంతిమ సారాంశం ఏమిటి? విప్లవోద్యమం మూలంగా  భూస్వాములు తెలంగాణలోని గ్రామాలు వదిలి పారిపోయిన సంగతి తెలుసు.

కానీ ఉద్యమం వెనుక పడగానే మళ్ళీ ఇతర రూపాల్లో వారి ఆధిపత్యం సాగుతోంది.టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక,ఆర్ధిక,రాజకీయ రంగాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. వ్యవసాయంతో పాటు రోడ్లు, పెన్షన్లతో  సహా పలు సంక్షేమ పథకాల వల్ల యువత ఆలోచనాధోరణిలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నది. ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు రాగానే మావోయిస్టులే కాదు ఇతర కమ్యూనిస్టు పార్టీలు కూడా బలహీనపడిన తీరును గమనిస్తున్నాం.

గ్రామీణ పీడిత ప్రజానీకానికి ,భూస్వాముల దోపిడీకి మధ్య ఉన్న  వైరుధ్యా న్ని ప్రధానమైన వైరుధ్యంగా సిపిఐఎంఎల్ గుర్తించింది.కార్మికులకు , పెట్టుబడిదారుల దోపిడీకి మధ్య ఉన్న వైరుధ్యం, భారత ప్రజానీకానికి, సామ్రాజ్యవాదుల దోపిడీకి మధ్య ఉన్న వైరుధ్యం కూడా ఆ పార్టీ గుర్తించింది.అయితే ఇదంతా 60 లలో సంగతి.ఈ వైరుధ్యాలలో భూస్వాములకు,గ్రామీణ ప్రజలకు మధ్య నేరుగా ‘ఘర్షణ’ వాతావరణం లేకుండా పోయింది.ఇది పెట్టుబడి దారుల మాహిమ.

తెలంగాణలో భూస్వాములకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నక్సలైట్ ఉద్యమం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.   గ్రామాలు, పట్టణాలుగా రూపాంతరం చెందుతున్న కొద్దీ, ఉత్పత్తి సంబంధాలు మారుతున్నందున వాటి ప్రభావం నేటి యువతరంపై పడింది. 80లలో, లేదా అంతకు ముందు విప్లవోద్యమాన్ని ఆకర్షించిన వారే గట్టిగా నిలబడినట్టు కనిపిస్తోంది. 1990 తర్వాత జన్మించిన యూత్ ఉద్యమాల జోలికి వెళ్లే ఆలోచనలే చేయడం లేదు.

విద్యార్థులతో  పాటు మధ్యతరగతిలోనూ మావోయిస్టుల పట్ల  మద్దతు తగ్గిపోయింది.  సాయుధ పోరాట మార్గమొక్కటే సరైనదా? ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ పోరాటాలు సాగుతాయి? నూతన ప్రజాస్వామిక విప్లవం భారతదేశంలో విజయవంతం  కావడానికి పరిస్థితులు సానుకూలంగా మారడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది ? ఈ లోగా ఇంకా ఎందరు త్యాగాలు చేయాలి? ఎంత రక్తపాతం జరగాలి? ఇవన్నీ ప్రశ్నలు.  

కాగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలను వయోభారం పీడిస్తోంది. దీర్ఘకాలంగా అడవుల్లో ఉండటం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న మాట నిజం. అనారోగ్యం, వయోభారం వల్లే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి తప్పుకున్నారు. ఆయన స్థానంలో నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ లో ఉన్నాడు.

70 ఏళ్లు దాటిన గణపతికి ఆర్థరైటిస్ సహా పలు ఇతర ఆరోగ్య సమస్యలున్నాయి. తెలంగాణకు చెందిన సత్వాజీ, పుల్లూరి ప్రసాదరావు, మల్లోజుల వేణుగోపాల్‌, కటకం సుదర్శన్‌, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణ రెడ్డి, మోడెం బాలకృష్ణ అంతా 60 ఏండ్లు పైబడిన వారే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 18 మంది తెలుగువారు ఉన్నారు.

మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం 130 మంది  అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులంటున్నారు. ఇందులో సగం మంది ఏపీకి చెందినవారే. 2004 చర్చల తర్వాత మావోయిస్టు పార్టీ బలహీనపడింది. ఎన్‌కౌంటర్లు, అనారోగ్యం, పార్టీ సిద్ధాంతాలతో విభేదించి పలువురు నాయకులు  లొంగిపోయారు.ఇటీవల కరోనాకు కొందరు మావోయిస్టులు బలయ్యారు.  

ఛత్తీస్ గఢ్,మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున తెలంగాణలో మళ్ళీ కాలు మోపవచ్చునన్న ఆలోచనతో పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులను అణచివేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి ‘కవర్ సంఘాలు’ గా ఆరోపిస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్‌, తెలంగాణ విద్యార్థి వేదికతో పాటు 5 సంఘాలపై పోలీసులు నిఘా పెట్టారు.తరచూ ఆయా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేస్తున్నారు.

ఇక ప్రధాని మోడీ హత్యకు పథకం రచించారంటూ పలువురు మేధావులు, న్యాయవాదులు,రచయితలను యు.ఏ.పీ.ఏ.కింద కేసులు పెట్టి జైలుకు పంపారు.వారిని అర్బన్ నక్సల్స్ అంటున్నారు.అడవి వెలుపల మైదాన ప్రాంతాల్లో,ముఖ్యంగా నగరాల్లో ఉండి  మావోయిస్టు కేడర్ కు ‘మేధో ఇంధనం’ సమకూర్చేవారిని కట్టడి చేయడమే కేంద్రప్రభుత్వ ఎజండాగా కనిపిస్తోంది.

అలాగే బయటి నుంచి అటవీప్రాంతాలకు  జరిగే ఔషధాలు,బియ్యం,ఇతర దినుసుల రవాణాపై గట్టి నిఘా ఉన్నది.మావోయిస్టులకు నిధులు సమకూర్చే వ్యక్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలపై నిఘా సాగుతున్నది.నిధుల సహకారం అందిస్తున్న కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపిన ఘటనలు జార్ఖండ్,ఛత్తీస్గఢ్ లలో జరిగాయి.

Pl.read it also …….మావోయిస్టు పార్టీ పంథా సరైనదేనా ?(1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!