ఆ విమానం ఆచూకీ ఇంకా మిస్టరీయేనా ?

Sharing is Caring...

How did that plane disappear?…………………..

ఎపుడో 1937 సంవత్సరంలో  అదృశ్యమైన అమేలియా ఇయర్‌హార్ట్ విమానం ఆచూకీ దొరికింది. డీప్ సీ విజన్ అనే సంస్థ ఇటీవల ఆ విమానం తాలూకు సోనార్ చిత్రాన్ని విడుదల చేసింది. 87 ఏళ్ళ క్రితం  పసిఫిక్ మహాసముద్రంలో ఆ విమానం పడిపోయింది.

మహిళా పైలట్ అమేలియా ఇయర్‌హార్ట్ నడిపిన ఆ విమానం తాలూకు అవశేషాలు గుర్తించినట్టు డీప్ సీ విజన్ సంస్థ చెబుతోంది. ఇందుకు సంబంధించిన  ఓ నివేదిక కూడా ఆ సంస్థ విడుదల చేసింది.

సౌత్ కరోలినాకు చెందిన డీప్ సీ విజన్  సంస్థ అమేలియా ఇయర్ హార్ట్ విమానం గురించి పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఎన్నో పరిశోధనలు నిర్వహించింది. ఎట్టకేలకు ఒక ఫోటోను తీసింది. 

39 ఏళ్ల ఇయర్‌హార్ట్, 44 ఏళ్ల ఫ్రెడ్ నూనన్ అనే మరో  పైలట్ ప్రయాణిస్తున్న ఈ విమానంలో ఇంధనం అయిపోయింది. హాలండ్ ద్వీపం వెళ్లాలనుకున్నారు. మధ్యలో ఏమైందో ఏమో కానీ ఆ విమానం హాలండ్ ద్వీపం సమీపంలోని  పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిందని అప్పట్లో అనుకున్నారు. అప్పట్లో కొంత మేరకు గాలింపులు జరిపినా ఆచూకీ దొరకలేదు.

డీప్ సి విజన్ విడుదల  చేసిన సోనార్ చిత్రం చాలా అస్పష్టంగా ఉందని  భావిస్తున్నారు. ఈ ఫోటోను సైడ్ స్కాన్ సోనార్ సహాయంతో పదహారు వేల అడుగుల లోతులో ఒక జలాంతర్గామి తీసింది. తప్పిపోయిన విమానం ఆకారం ఈ ఫోటోలో కొంత కనిపిస్తున్నది.

‘ఇయర్‌హార్ట్, నూనన్ విమానాన్ని సేఫ్‌ ల్యాండ్ చేయడానికి శాయశక్తులా  ప్రయత్నించారు , కానీ ఆ ప్రయత్నం  ఫలించలేదని డీప్ సి విజన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ రోమన్స్ అభిప్రాయపడ్డారు.

పదహారు మందితో కూడిన పరిశోధనా బృందం పసిఫిక్ మహాసముద్రంలో 90 రోజుల పాటు అన్వేషించారు. చివరికి ఈ ఫోటో తీయగలిగారు. శకలాలు కనుగొనేందుకు మరింత పరిశోధన చేయాల్సి ఉంది.

ఇయర్‌హార్ట్ అదృశ్యం తర్వాత చాలామంది సముద్రంలో పరిశోధనలు చేశారు. కాగా  ఇయర్ హార్ట్ జపనీస్ సైన్యం చేత బంధించబడిందని లేదా యునైటెడ్ స్టేట్స్‌కు తిరిగి వచ్చి వేరే పేరుతో జీవించిందనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

మొత్తం మీద అమేలియా ఇయర్ హార్ట్ విమానం అదృశ్యం ఇంకా మిస్టరీగానే  మిగిలింది. డీప్ సీ విజన్, నాటికో సంస్థలు పరిశోధనను కొనసాగిస్తున్నాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!