ఆహార సంక్షోభం అనివార్యమా ?

Sharing is Caring...

ప్రపంచంలో ఓ పక్క ఆకలి చావులు .. మరోపక్క కరోనా .. ఇంకో వైపు యుద్దాలు, అంతర్యుద్ధాలు .. ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార సంక్షోభం ఏర్పడొచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.  అదే జరిగిందంటే … పరిస్థితులు దారుణంగా మారతాయి. 

ప్రపంచంలో క‌రోనా మ‌ర‌ణాల కంటే, ఆక‌లి చావులే అధికంగా ఉన్న‌ట్టు పేద‌రికం నిర్మూల‌న‌ కోసం ప‌నిచేస్తోన్న ఆక్స్ఫామ్   సంస్థ నివేదిక‌  చెబుతోంది. పెరుగుతున్న పేద‌రికం, ఆక‌లి చావుల‌పై ఈ సంస్థ  ఓ నివేదిక‌ను రూపోందించింది.  ఈ నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచంలో 155 మిలియ‌న్ల మంది అత్యంత దారుణ‌మైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ప్ర‌తీ నిమిషానికి 11 మంది ఆక‌లితో మ‌ర‌ణిస్తున్నారు.  ప్ర‌కృతి విప‌త్తులు, క‌రోనా కారణంగా  ఆహార‌ సంక్షోభంతో ప్రపంచం  కొట్టుమిట్టాడుతుంటే, మరోవైపు… కొన్ని దేశాల్లో అంత‌ర్గ‌త యుద్ధాలు  శాపంగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనాభా పెరిగితే సంక్షోభం ఘోరంగా మారుతుంది. 

ప్రస్తుతం ప్రపంచ జనాభా 790 కోట్లు కాగా అది 2050 నాటికి  వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం పోనవసరం లేదు. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా?అంటే ? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్‌ కౌంట్స్‌’  సంస్థ.

మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని ఈ సంస్థ సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది.

భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం.ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమంటున్నారు నిపుణులు. 

 
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయని  అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్‌ పెరగుతోంది.  ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నారు.  యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదని  నిపుణులు చెబుతున్నారు.

పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి వివిధ కారణాల వల్ల కోతకు గురవుతోంది.ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా సాధ్యం కాదు.

ఇక ఆహార వృథా కూడా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఎక్కువగా ఉందని అంటున్నారు. మన దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్‌ వేస్టేజ్‌ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు.

దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా వేస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!