షాడో ప్రభావం అంతలా ఉండేదా ?

Sharing is Caring...

పరేష్ తుర్లపాటి ……………………….                   Shadow mania……………

నవ్వకండి..ఇది సీరియస్ మ్యాటర్ … విజయవాడ అలంకార్ థియేటర్ ఆపొజిట్ లో MKM బుక్ స్టాల్ లో Madhu Babu V. గారు రాసిన షాడో డిటెక్టివ్ నవలలు అద్దెకిచ్చేవాళ్లు ! షాడో బుక్ రిలీజ్ కావటం ఆలస్యం… పొద్దున్నే షాప్ షట్టర్ కూడా తెరవకముందే స్వాతిముత్యం కమల్ హాసన్ లా వాలిపోయేవాడ్ని !

అప్పట్లో షాడో డిటెక్టివ్ నవళ్లు విపరీతంగా చదివి పూనకాలు తెచ్చుకున్నవాడిలో నేనూ ఒకడ్ని. బుక్ చదవటం అయిపోయేలోపు రెండు చేతివేళ్ళ గోళ్లు పూర్తిగా కొరుక్కోవటం పూర్తయిపోయేది ( టెన్షన్తో) అంచేత నాకు నైల్ కట్టర్ అవసరం పడేదికాదు ! ఆ సంగతి పక్కన బెడితే..

ఈ MKM బుక్ స్టాల్ యజమాని ఏజ్ బార్ అయినా కూడా పాత హిందీ సినిమాలో హీరో లెక్క ఫిట్ గా ఉండేవాడు ! తర్వాత తెలిసింది ఆయన మిలీట్రీ లో చేసి వచ్చారని ! అందుకని భయంతో కూడిన గౌరవం ప్రదర్శించేవాడ్ని ! అలా ఓ రోజు MKM బుక్ షాపుకెళ్లి షాడో బుక్ తీసుకుని మిలీట్రీ ఆయన్ని మెల్లిగా కదిలించా !

“షాడోలా ఫైటింగ్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి అంకుల్ ? ” అని అమాయకంగా అడిగా ! బుక్ షాప్ ఓనర్ ఆశర్యంగా చూసాడు నా వంక !
“ఏం చదువుతున్నావ్ బాబూ ? ” తేరుకుని అడిగాడాయన !
“టెంత్ కొచ్చా అంకుల్ “
“ఫైటింగ్ నేర్చుకుని ఏం చేస్తావ్ ?”
“భలేవారే అంకుల్..షాడో ఏం చేస్తాడో నేనూ అదే చేస్తా “

ఏమనుకున్నాడో ఏమో “రేయ్ ! ఇంకోడొచ్చాడు..మాట్లాడు..”అని కేకేసాడు ! లోపల్నుంచి ఆయన కొడుకు బయటికొచ్చి నా వంక చూసాడు !( అతడు కరాటే లో బ్లాక్ బెల్ట్ ఓనరని తర్వాత తెలిసింది )
తండ్రి జరిగింది చెప్పాడు !

“సరే ! నీకు ఫైటింగ్ నేర్పుతా..రేపు ఉదయం ఐదు గంటలకల్లా గాంధీనగర్ వెల్కమ్ హోటల్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది. దాని మేడ పైకి రా ..సరిగ్గా ఐదు గంటలకల్లా వచ్చేయ్ ‘!” ఇంకేం మనం కూడా షాడోలా శత్రువుల గుండెల్లో శతాబ్ది ఎక్స్ప్రెస్ పరిగెట్టించొచ్చు అని ఇంటికెళ్లి పొద్దున నాలుగు గంటలకే అలారం పెట్టుకుని’ షాడో షాడో ‘ అనుకుంటూ పడుకున్నా !

చెప్పిన ప్రకారం తెల్లవారుఝామున ఐదు గంటలకు ఎస్బిహెచ్ డాబాపైకి చేరుకున్న నన్ను చూసి మిలీట్రీ ఆయన కొడుకు ఆశర్యపోయాడు ! అప్పటికే అక్కడ నలుగురు షాడోలు ఉన్నారు ! వాళ్ళు కూడా నాలాగే లేత సొరకాయలు..

“ముందు నీకు కరాటే నేర్పుతా..మొదలెడదామా ” అని గాల్లోకి కాళ్ళు చేతులు ఉపటం మొదలెట్టాడు ! “సరే ! నేనూ కాళ్ళు చేతులూ ఉపటం మొదలెట్టా !” ఓ పదినిమిషాలు ఊపిన తర్వాత అతడు దగ్గరకొచ్చి నా చేతులు పట్టుకుని చూసాడు !

“చూడు తమ్ముడూ ! లేత సొరకాయ గిల్లితే గోరు దిగుతుందే నీ చేతులు కూడా అలాగే ఉన్నాయ్..లైట్ గా గిల్లితే లీటర్ రక్తం కారేలా ఉంది..ఈ అరచేతులు చూడు..పూరీ పిండిలా ఎంత మెత్తగా ఉన్నాయో..అరచేతులు కత్తుల్లా ఉండాలి..ఇలా సుకుమారంగా ఉంటే కరాటే కాదు కదా కబాడీకి కూడా పనికిరావ్ “అని ఆత్మాభిమానం మీద గిల్లాడు..

“మరి షాడో లా అవ్వాలంటే ఏం చెయ్యాలి..”రోషంగా అడిగా !
“ఎవడికైనా ఐఏఎస్సో ఐపీఎస్సో అవ్వాలని ఉంటుంది..నువ్వెంట్రా బాబూ షాడో అవ్వాలంటావ్ ?అని నసుక్కుని , ‘ఇదిగో ఇలా రాటు దేలాలి అంటూ ఓ గమ్మేలాలో వేడి ఇసుక తెప్పించి అరచేతి సైడులను కత్తిలా చేసుకుని ఆ ఇసుకలో బాదమన్నాడు !” ….  అలాగే బాదా.. 

ముందు ఆ వేడికి గిల గిలాలాడిపోయా … నాల్రోజుల్లో అలవాటు అయిపోయింది !
అతడన్నట్టు చేతులు కత్తుల్లా తయారయ్యాయ్ ! ‘బాగా చేస్తున్నావోయ్.. ఇగ ఇంట్లో సొరకాయలు తరగాలంటే కత్తులు అవసరం లే..నీ చేతులు చాలు..ఇలా కంటిన్యూ చేస్తే షాడో కి షాడో ఆవుతావ్ ‘ అని నన్ను మెచ్చుకున్నాడు కూడా !  ….  అప్పుడడిగా ..

“అంకుల్..నెక్స్ట్ రివాల్వర్ తో కాల్చటం ఎప్పుడు నేర్పుతారు అని !” షాక్ అయ్యాడు … నావంక అదోలా చూసాడు… నిశ్శబ్ధంగా ఏవో మూగ సైగలు చేశాడు …. నాకేమీ అర్ధం కాలే. అంతే…. ఆ మర్నాటినుంచి అతడు అడ్రస్ లేడు !
అట్లుండేది అప్పట్లో మనకు షాడో మేనియా !!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!