Is the pressure on the earth increasing?……………..
ఖరీదైన కలల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ సిటీ కి ముంపు ప్రమాదం పొంచి ఉంది.అక్కడ క్రమక్రమంగా భూమి కుంగిపోతున్నది.సిటీలో ఉన్న వేలాది ఆకాశహర్మ్యాలు, వాతావరణ మార్పులతో సముద్ర మట్టంపెరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణాలని చెబుతున్నారు.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్ ప్రతిఏటా 2 మిల్లీమీటర్ల మేర కుంగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ సైంటిస్టుల బృందం ఆమధ్య ప్రకటించింది. వారు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి.
ఈ వివరాలను ‘అడ్వాన్సింగ్ ఎర్త్, స్పేస్ సైన్స్’ పత్రికలో ప్రచురించారు. సముద్ర మట్టం పెరుగుదలకు తోడు భారీ భవనాల వల్ల న్యూయార్క్ భూమిపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకే నగరం మునిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇప్పటికైనా మేల్కొని నివారణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఈ ముంపు తీవ్రత ఇంకా ఉధృతమవుతుందని హెచ్చరించారు.నగరం నివాస యోగ్యం కాకుండా పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని అంటున్నారు.. ఇది కేవలం న్యూయార్క్ సిటీకే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు ముంపు బారిన పడుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.
న్యూయార్క్ నగర జనాభా 80 లక్షల పైమాటే. ఆకాశాన్నంటే భారీ భవనాలతో సహా 10 లక్షల దాకా భవనాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఏటా 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే భూమిలోకి కూరుకుపోతున్నాయి. ఉత్తర అమెరికాలో అట్లాంటిక్ తీరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సముద్ర మట్టం పెరుగుదల వల్ల ముంపు ముప్పు న్యూయార్క్ కు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
మరో 80 ఏళ్లలో.. అంటే 2100వ సంవత్సరం నాటికి న్యూయార్క్ సిటీ 1,500 మిల్లీమీటర్లు కుంగిపోతుందని అధ్యయనంలో గుర్తించారు. మునిగిపోతున్న ప్రాంతాలు… లాగార్డియా విమానాశ్రయంలో రన్‌వే 13/31… క్వీన్స్‌లోని ఈ ప్రాంతం సంవత్సరానికి 0.15 అంగుళాలు (3.7 మిల్లీమీటర్లు) చొప్పున మునిగిపోతోంది.
దిగువ మాన్హాటన్, బ్యాటరీ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో సహా ఈ ప్రాంతం మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంది. మిడ్‌టౌన్ మాన్‌హాటన్ .. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉన్న ఈ ప్రాంతం, ఉపరితలానికి దగ్గరగా ఉన్నందున మునిగిపోయే అవకాశం ఉండదు.
ఇక న్యూయార్క్ పై ప్రకృతి విపత్తుల దాడి కూడా ఎక్కువే. 2012లో సంభవించిన శాండీ తుపాను కారణంగా సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకువచ్చింది. చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. 2021లో సంభవించిన ఇడా తుఫాను వల్ల సిటీలో మురుగునీటి కాలువలు ఉప్పొంగాయి. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.
ఈ సమస్య ప్రపంచానికి ఒక సవాలు..సముద్ర మట్టాలు పెరగకుండా అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని, సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాల్లో భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించాలని సైంటిస్టులు సూచించారు. సముద్ర తీరంలో, నది ఒడ్డున, చెరువుల పక్కన నిర్మించే భారీ భవనాలు భవిష్యత్తులో వరద ముంచెత్తడానికి, తద్వారా ప్రాణ నష్టానికి కారణమవుతాయని వివరించారు.