Melting iceberg …………….
ప్రపంచంలోనే అతిపెద్ద మంచు పర్వతం A23a 2025 ప్రారంభంలో దక్షిణ జార్జియా ద్వీపానికి సమీపంలో ఉన్న లోతైన జలాల్లో నిలిచిపోయింది. అది నెమ్మదిగా విడిపోవడం (disintegrating) ప్రారంభించి, వేల చిన్నముక్కలుగా మారుతోంది..ఇప్పుడు అది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో తేలుతూ, అంటార్కిటికా నుండి దూరంగా కదులుతోంది.
ఈ ఐస్బర్గ్ A23a 1986లో విడిపోయి 30 ఏళ్లకు పైగా అంటార్కిటిక్ seabed లో ఉండి, 2020లో కదలడం మొదలుపెట్టింది, చివరికి దక్షిణ జార్జియా తీరానికి చేరుకుంది..అక్కడ అది విరిగి ముక్కలు అవుతోంది.
A23a ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే ?
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో దక్షిణ జార్జియా ద్వీపానికి దగ్గరగా అంటార్కిటికా నుండి ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ క్రమంలోనే ఇది విరిగిపోతోంది. చిన్న ముక్కలుగా మారుతోంది. ఇది గ్రేటర్ లండన్ కంటే రెట్టింపు పరిమాణంలో ఉండేది. కానీ ఇప్పుడు విడిపోయిన ముక్కల వల్ల దాని పరిమాణం తగ్గిపోతోంది.వెచ్చని నీరు, అలలు, ప్రవాహాల కారణంగా ఇది క్రమంగా కరిగిపోతుంది, కానీ ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.
1986 లో అంటార్కిటికాలోని ఫిల్చ్నర్ ఐస్ షెల్ఫ్ నుండి A23a విడిపోయింది. 2020 నాటికి ఇది వెడ్డెల్ సముద్రం నుండి కదలడం ప్రారంభించింది. 2024-2025 మధ్యకాలంలో దక్షిణ జార్జియాకు దగ్గరగా నిలిచిపోయింది..
తాజా నివేదికల ప్రకారం ఇది ద్వీపానికి సుమారు 100 నాటికల్ మైళ్ల వాయువ్య దిశలో కేంద్రీకృతమై ఉంది. 2025 ఆగస్టు చివరి నుండి ఈ భారీ మంచుకొండ వేగంగా ముక్కలవ్వడం ప్రారంభమైంది.సెప్టెంబర్ 2025 నాటికి, ఇది తన అసలు పరిమాణంలో సగానికి పైగా కోల్పోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఒకప్పుడు ఈ మంచు కొండ దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. అయితే ముక్కలైన తర్వాత, దీని ప్రధాన భాగం సుమారు 1,300 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది.
ఈ మంచుకొండ ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇది ముక్కలవుతూ సముద్రంలో నౌకల ప్రయాణానికి ముప్పుగా మారే అవకాశం ఉంది.ఐస్బర్గ్ A23a వల్ల ప్రస్తుతానికి మానవులకు లేదా జనావాసాలకు తక్షణ ముప్పు లేదు.
A23a వంటి భారీ మంచుకొండను శాటిలైట్ల ద్వారా సులభంగా గుర్తించి, ఓడలను వాటి దారి మళ్లించవచ్చు. కానీ, ప్రస్తుతం ఇది విచ్ఛిన్నమవుతున్నందున, దాని నుండి విడివడే చిన్న “బెర్గి బిట్స్” (bergy bits) లేదా చిన్న మంచు ముక్కలను రాడార్లు గుర్తించడం కష్టం. ఇవి వాణిజ్య ఫిషింగ్ బోట్లకు లేదా ఇతర నౌకలకు తగిలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
A23a జార్జియా ద్వీపానికి చాలా దగ్గరగా వస్తే లేదా తీరానికి చేరుకుంటే, అది స్థానిక వన్యప్రాణులపై ప్రభావం చూపవచ్చు.ద్వీపంలోని పెంగ్విన్లు (king penguins), సీల్స్ (fur seals, elephant seals) వంటి జంతువులు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడానికి సముద్రంలోకి వెళ్లే దారులను ఈ భారీ మంచుకొండ అడ్డుకోవచ్చు.
దీనివల్ల ఆహార కొరత ఏర్పడి, వాటి సంతానోత్పత్తిపై లేదా మనుగడపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.మంచుకొండ కరగడం వల్ల సముద్ర నీటి ఉష్ణోగ్రత, లవణీయత, పోషకాల స్థాయిలో మార్పులు వస్తాయి. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థను (marine ecosystem), ముఖ్యంగా అతి చిన్న రొయ్యల వంటి జీవులను ప్రభావితం చేస్తుంది.

