Is Spartacus a fictional character?…………………………..
వెలుగు వెనుక చీకటి… పీడన శృతి మించినప్పుడల్లా ఒక పిడికిలి పైకి లేస్తుంది. దాని పేరు స్పార్టకస్. కార్మికుడి కడుపు మండి ఒక నినాదం ఉద్భవిస్తుంది. దాని పేరు స్పార్టకస్. విద్యార్థి ఉద్యమానికో బావుటా కావాలి. దాని పేరూ స్పార్టకసే. ప్రతి తిరుగుబాటుకూ స్ఫూర్తి స్పార్టకస్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ వీరుడు అసలు నిజంగానే ఉన్నాడా? కల్పిత పాత్రా? ఇతడి ఖాతాలో నమోదైన విజయానికి సత్యసంధత ఉందా? ఇతడి మరణంలో మిస్టరీ ఏమిటి?
చారిత్రక, సామాజిక, సాహిత్య, రాజకీయ, సినీ చరిత్రల్లో స్పార్టకస్ పాత్రకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తమ అసక్తి, అభిరుచి, స్ఫూర్తి, నమ్మకాలతో అనేకమంది స్పార్టకస్‌ను అభిమానించారు. కొందరు స్పార్టకస్‌ను ఆరాధించారు. వీరుడని కొనియాడారు. స్పార్టకస్ బాణీని అనుకరించారు. అతడి చరిత్రను, దానిపై అతడు చూపిన ప్రభావాన్ని గ్రంథస్థం చేశారు… ఇక్కడే అసలైన తేడాలు వచ్చాయి. స్పార్టకస్ ప్రస్థానంలో ప్రశ్నార్థకాలను తెచ్చిపెట్టాయి.
అత్యంత క్రూరత్వం, విషాదకర సంఘటనలు, మహత్తరమైన ఆదర్శభావాలు… ఇవి ‘స్పార్టకస్’ ప్రస్థానంలో ప్రధాన ఘట్టాలు. క్రీస్తు జననానికి ఒక శతాబ్దం పూర్వం రోమ్ నాగరికతలో చెప్పుకోదగ్గ అధ్యాయం స్పార్టకస్‌ది. రోమ్ పాలకులు అనేక జాతుల ప్రజలను బానిసలుగా చేసుకుని తీవ్ర హింసలపాలు చేస్తుంటే ఆ బానిసల్లో ఒకడైన స్పార్టకస్ వారిలో విప్లవాగ్ని రగిల్చే ప్రయత్నం చేశాడు. దీనికి తెరతీసింది రోమన్ కలోజియం. నేటికైతే అది ఒక గొప్ప చారిత్రక కట్టడం కానీ ఆ భారీ కట్టడం లోపల జరిగిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కలోజియం వేదికగా బానిసల మధ్య మల్లయుద్ధాలు పెట్టి ఆనందించడం నాటి పాలకుల, ప్రజల దినచర్య. కొంతమంది రాక్షసానందం కోసం బానిస వర్గానికి చెందిన యోధుల్లాంటి తన సహచరులు ఒకర్నొకరు చంపుకోవడం సహించలేని స్పార్టకస్ దీనిని వ్యతిరేకిస్తాడు.
తనకు ప్రాణాతిప్రాణమైన ‘నల్లబానిస’ డ్రాబాను కలోజియం సాక్షిగా రోమన్ సైనికులు చంపేయడం స్పార్టకస్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది. ‘‘అనేక సంవత్సరాలుగా మగ్గిపోతున్న లక్షలాది బానిసలకు ఒక మార్గం చూపగలవు నీవు’’ అంటూ తన చేతిలో ఒరిగిపోయిన డ్రాబా స్ఫూర్తితో, ఇతర మల్లయోధుల సాయంతో స్పార్టకస్ రోమన్లపై తిరుగుబాటు చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో విజయాలను సాధిస్తాడు. వేలాది బానిసలు స్పార్టకస్ నాయకత్వంతో రోమన్లపై విరుచుకుపడతారు. ఇరుపక్షాల తరఫునా విపరీతమైన జననష్టం జరుగుతుంది. చివరకు నమ్మకద్రోహం రూపంలో విధి స్పార్టకస్‌ను కబళిస్తుంది. ఇది స్పార్టకస్ విఫలగాథ. భావితరాలకు, బానిసత్వం కింద మగ్గిన జాతులకు ఇదొక ఆదర్శగాథ. అయితే ఈ ధీరోదాత్తుడి ప్రస్థానంలో విభిన్నమైన వాదనలున్నాయి. అవేంటంటే…
థ్రేసియన్ తెగకు చెందిన స్పార్టకస్ లిబియా ఉప్పుగనుల్లో బానిసగా మగ్గాడంటారు. స్పార్టకస్ హీరోయిజం గురించి ఎవరికీ సందేహాలు రాలేదు కానీ, అతడి భావాలు వర్థిల్లిన స్థానం గురించి అనేక వాదనలు వినిపిస్తాయి. స్పార్టకస్ పుట్టుకతో బానిసవర్గానికి చెందినవాడు కాదంటారు. ఇలాంటి థియరీని చెప్పేవారు అతడు రోమన్ సైన్యంలో పనిచేసేవాడని పేర్కొంటారు. కొన్ని సంఘటనలతో అతడు సొంత సైన్యం చేతిలోనే బందీగా మారాడని, అటునుంచి బానిసగా అమ్ముడయ్యాడనేది వీరి వెర్షన్.
కారల్‌మార్క్స్ దృష్టిలో ‘ప్రాచీన శ్రామిక వర్గపు ప్రతినిధి’గా, తొలితరం కమ్యూనిస్టుగా భవిష్యత్తరాలతో కీర్తింపబడిన స్పార్టకస్ గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. స్పార్టకస్ ఎలాంటి వాదాన్నీ ప్రవచించలేదు కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో రోమన్లపై తిరగబడ్డాడనే విషయంపై వాదోపవాదాలున్నాయి. స్పార్టకస్ చరిత్రను విపులంగా రాసిన ఫ్లూటార్క్ అభిప్రాయం ప్రకారం స్పార్టకస్‌ది ఒక గమ్యం లేని పోరాటం! ఒక దశలో రోమన్ల కాఠిన్యాన్ని చూసి స్పార్టకస్ భయపడ్డాడు. తనతో పాటు మరి కొందరు బానిసలు సొంతిళ్లకు వెళితే చాలని భావించాడు!
ఫ్లూటార్క్, అప్పియన్ అనే చరిత్రకారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘స్పార్టకస్ చర్యల్లో ఏవీ అతడు రోమన్ సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నించినట్టు గానీ, బానిసత్వాన్ని రద్దు చేయించడానికి కానీ నడుం కట్టినట్టు లేవు…’ అని అప్పియన్ స్పష్టంగా వ్యాఖ్యానించాడు. స్పార్టకస్ పోరాటం నిజమే…అయితే దాని ఉద్దేశం గురించి కాల్పనికత ఎక్కువగా ఉందనే అభిప్రాయాలున్నాయి.
‘గ్లాడియేటర్’ యూరోపియన్ ప్రపంచంలో గొప్ప గుర్తింపు ఉన్న మల్లయోధులు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ‘స్పార్టకస్’ ను కూడా గ్లాడియేటర్‌గానే చెబుతారు. అయితే అప్పటికి గ్లాడియేటర్ల ఉనికి లేదనీ చాలాకాలం క్రితమే గ్లాడియేటర్ల సంస్కృతి అంతమైందనీ కొందరి అభిప్రాయం.
రోమన్ సామ్రాజ్యాన్ని ఒక వైపు నుంచి స్పార్టకస్ ప్రభావితం చేస్తూ వచ్చాడు. ఇతడు రోమన్ పాలకులకు పీడకలగా మారాడు. రోమన్ సామ్రాజ్యంలోని మిగతా ప్రాంతాల్లో కూడా విప్లవాన్ని రగల్చడానికి స్పార్టకస్ కొంతమంది బానిసలతో ముందుకు సాగాడు. ఆ ప్రయత్నంలో రోమన్ సేనలు స్పార్టకస్‌ను బంధించి హతమార్చాయి. అతడి శవం కూడా దొరకలేదు! అయితే దీనికి మరి కొంచెం కాల్పనికత జోడించే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంతిమంగా స్పార్టకస్ తన సహచరుడు ఆంటోనియస్‌తో కలిసి దొరికిపోయాడు.
రోమన్ పాలకుడు క్రాసన్ వారిద్దరి మధ్య మల్లయుద్ధం పెట్టి గెలిచిన వాడిని శిలువ వేస్తానని ప్రకటించాడు! అత్యంత దారుణమైన ఈ పోటీలో ఆ ఇద్దరు యోధులూ ఒకర్నొకరు చంపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు! ఎందుకంటే ఆ పోటీలో బతికిన వారు శిలువకు వేలాడాల్సి ఉంటుంది. తన స్నేహితుడికి ఆ ప్రత్యక్ష నరకం తప్పాలనే ఆ ఇద్దరి తపన! ఈ పోరాటంలో స్పార్టకస్ తన మిత్రుడికి మరణం ప్రసాదించాడు. ప్రత్యక్ష నరకాన్ని తాను ఎంచుకున్నాడు. అలా స్పార్టకస్ మరణం చరితార్థం అయ్యింది.
మనిషి అంతిమ లక్ష్యం స్వాతంత్య్రమే అనే సిద్ధాంతంతో హోవర్డ్ ఫాస్ట్ ‘స్పార్టకస్’ నవలను రచించారు. దీని తొలి ప్రచురణ 1951లో వెలువడింది. బహుశా ఫాస్ట్ నవల రూపంలో స్పార్టకస్ చరిత్ర రచనకు పూనుకోకుంటే, ఆ యోధుడికి ఇంత గుర్తింపు ఉండేది కాదేమో! స్పార్టకస్‌ను స్ఫూర్తికి పర్యాయ పదంగా మార్చారు ఫాస్ట్. ఈ నవల క్లైమాక్స్‌లో స్పార్టకస్‌ను చంపాలనే ఉద్దేశంతో ‘మీలో స్పార్టకస్ ఎవరు?’ అని రోమన్ ప్రభువు ప్రశ్నిస్తాడు. బందీలైన వేలాది మంది బానిసలు ఒక్కసారిగా ‘నేనే స్పార్టకస్, నేనే స్పార్టకస్’ గళమెత్తుతారు.
వాస్తవంగా ఇది జరిగిందో లేదో కానీ… రచనాప్రక్రియలో ఇది ఒక సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక సినిమాల్లోనూ, రచనల్లోనూ నాయకుడిని కాపాడుకోవడానికి అతడి అనుచరులు అలా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం.స్పార్టకస్ క్రీస్తు పూర్వం 109లో జన్మించారు. ఆయన జీవిత కాలం 38 సంవత్సరాలే! అనేక మంది రాజకీయ నాయకులకు, రచయితలకు స్పార్టకస్ స్ఫూర్తిగా నిలిచాడు. అర్జెంటీనా విప్లవకారుడు చేగువేరా స్పార్టకస్‌ను వీరుడిగా ఆరాధించేవారు. యూరప్‌లో మనుగడ కోసం పోరాడే కమ్యూనిస్టులకు కూడా స్పార్టకసే స్ఫూర్తి.
జర్మనీలో ‘స్పార్టకస్‌లీగ్’ పేరుతో 1916లో ఒక విప్లవ సంఘం ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఈ విప్లవ సంఘం కూడా విఫలం కావడం గమనార్హం.‘స్పార్టకస్’ పేరుతో తీసిన సినిమా ప్రపంచ సినీచరిత్రలో అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఆ సినిమాలో కాల్పనికత ఎక్కువగా ఉందని చరిత్రకారులు అభిప్రాయపడతారు. హోవర్డ్ ఫాస్ట్ నవల అధారంగా ఈ సినిమా తీశారు. ఇటీవల ‘స్పార్టకస్’ పై వెబ్ సిరీస్ కూడా తీశారు
-courtesy….. జీవన్‌రెడ్డి. బి