వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది. కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి. అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. ఆయన అభిమానులు ఉన్నారనే కారణం తోనో పార్టీ పెడితే సరిపోదు. పార్టీ పెట్టగానే ఓట్లు కూడా పడవు. అభిమానులతో పాటు ప్రజలను మెప్పించే రాజకీయాలు చేయాలి… రాజకీయ విధానాలను రూపొందించుకోవాలి. సరికొత్త పథకాలను ప్రజలకు పరిచయం చేయాలి.
ఇక ముందుగా షర్మిల తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పొందాలి. ఈ నమ్మకం పొందడమే అసలైన కష్టం. ఇప్పుడున్న పాలకులకంటే ఏ విధమైన మెరుగైన పాలన ఇవ్వగలమో ప్రజలకు చెప్పి ఒప్పించాలి. తెలంగాణ ప్రయోజనం కోసమే పని చేస్తానని .. అందుకు కట్టుబడి ఉన్నానని ప్రజలకు చెప్పగలగాలి. అవసరమైతే విధానపరంగా ఆంధ్రానేతలతో పోరాటం చేస్తానని కూడా స్పష్టంగా చెప్పాలి. చెప్పడమే కాదు అవసరమైన సందర్భంలో ఆచరించి చూపాలి. చిత్తశుద్ధి ప్రదర్శించుకోవాలి. అపుడే కొంత నమ్మకం జనాలకు ఏర్పడుతుంది.
ఇక స్థానిక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఒక ఆంధ్రా మహిళా తెలంగాణా కొచ్చి పార్టీ పెడుతుంటే విమర్శలు రావడం సహజం. షర్మిల విషయంలో విమర్శలు తొలి రోజునుంచే మొదలైనాయి. ఇందులో ఆశ్చర్యం ఏమిలేదు. ముందు ముందు ఆ వ్యతిరేకత ఇంకా బలపడవచ్చు లేదా బలహీన పడవచ్చు. వివిధ పార్టీల నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావచ్చు. వీటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనే సామర్ధ్యం కావాలి. చాకచక్యంగా విమర్శలను తిప్పిగొట్టే సత్తా ఉండాలి.దేనికి బెదరకుండా ముందుకు సాగే విల్ పవర్ మరీ ముఖ్యం. ఆ విల్ పవర్ షర్మిలకు ఉంటే రాజకీయాల్లో దూసుకుపోవడం సులభం అవుతుంది.
తెలంగాణా లో ఇప్పటికే రాజకీయంగా ఢక్కా మొక్కీలు తిన్న నాయకులు ఉన్నారు. ఎత్తులు పై ఎత్తులు వేసే సీనియర్ నేతలున్నారు. ఇరిటేట్ చేసే విధంగా విమర్శించే రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరితో ఎలా మెలగాలో ?ఎవరికెలా జవాబు చెప్పాలో నేర్చుకోవడం కూడా అవసరమే. ఇది నిరంతర పరిశీలన .. అనుభవం ద్వారా వస్తుంది.
వీటితో పాటుగా పార్టీ నిర్మాణం చేపట్టాలి. అనుభవం గల నేతల సహకారం తీసుకోవాలి. వారిని కలుపుకుపోవాలి. మెరికల్లాంటి కార్యకర్తలను తయారు చేసుకోవాలి. పోలింగ్ బూత్ నుంచి స్టేట్ కార్యాలయం వరకు పార్టీని పటిష్టంగా నిర్మించుకోవాలి. అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చుకోవాలి. పార్టీ విధానాలు .. సిద్ధాంతాలు రూపొందించుకుని జనంలోకి వాటిని తీసుకెళ్లాలి. అధికార ప్రతినిధులను నియమించుకోవాలి. వారికి పార్టీ పాలసీ కనుగుణంగా మాట్లాడే విధంగా శిక్షణ ఇప్పించాలి. సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు … విధానాలు జనంలోకి తీసుకుపోవాలి. ఇవన్నీ చేస్తూ ముందుకు వెళుతుంటే అధికారానికి దగ్గర అయ్యే అవకాశాలు ఏర్పడతాయి. అపుడు ప్రజలే నిర్ణయించుకుంటారు.
ఇక వైఎస్ సీఎం కావడానికి దాదాపు పాతికేళ్ల పైనే పట్టింది. అన్న జగన్ సీఎం కావడానికి 8 ఏళ్ళు పట్టింది. కాకపోతే జగన్ ది సొంత పార్టీ .. అధికారం లేకపోయినా అన్నేళ్లు ఓర్పుతో పార్టీని నడిపారు. వారిలా ఓర్పుతో షర్మిల రాజకీయాల్లో ఉండగలరా ? ఉంటేనే ఏదైనా సిద్ధిస్తుంది.
——–KNM