ప్రాణం,ఆత్మ ఒక్కటేనా?

Sharing is Caring...

 

Shaik Sadiq Ali…………………………………….

ప్రాణం అంటే ఏమిటి ? ఈ ప్రశ్న చాలా కాలంగా నన్ను వేధిస్తోంది. ఈ ప్రాణం ఎక్కడినుంచి వస్తుంది? ఎక్కడికి పోతుంది? అలాగే, ఆత్మ అంటే ఏమిటి? ప్రాణం, ఆత్మ ఒక్కటేనా? లేక వేర్వేరా? ఈ ప్రశ్నలు తరతరాలుగా నాలాంటి ఎందరినో వేధిస్తున్నాయి.దీనికి సంబంధించి ఎందరెందరో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు.

నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.అమెరికాలోని కొందరు శాస్త్రవేత్తలు మరణావస్థ లో వున్న ఎందరి మీదనో పరిశోధనలు చేశారు. చివరికి ఒక అవగాహనకు వచ్చారు. వారి పరిశోధనల ఆధారంగా ప్రాణం బరువు ఆరు ఔన్సులు ఉంటుందని తేల్చారు.

ప్రాణం పోయిన క్షణాల్లో మనిషి బరువు ఒక్కసారిగా ఆరు ఔన్సులు తగ్గిపోతుందనీ, మరుక్షణం నుంచి మృతదేహం బరువు మునుపటి కన్నా కొంచెం ఎక్కువ పెరుగుతుందని నిర్ధారించారు. అయితే ఆ ప్రాణం ఎక్కడికి పోతుందో మాత్రం వాళ్ళు కనిపెట్ట లేక పోయారు. దాని మీద ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

కాగా, హిమాలయ యాత్ర సందర్భంగా కొందరు సాధువులను, సాధకులను కలిసిన సందర్భంగా ఇదే విషయం గురించి చర్చించాను.వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రాణం అనేది ప్రకృతిలోని పంచభూతాల్లో ఉంటుందనీ, ఆ పంచ భూతాల ద్వారానే ప్రాణం అనేది ఏర్పడుతుందనీ, మరణానంతరం ఆ ప్రాణం మళ్ళీ పంచభూతాల్లో కలిసి పోతుంది.

స్వచ్చమైన గాలిలో,నీటిలో,ఆకాశంలో,భూమిలో, అగ్నిలో ప్రాణం ఉంటుందనీ చెప్పారు.వాటి ద్వారానే ప్రాణ శక్తి లభిస్తుందనీ చెప్పారు.అందుకే కలుషితమైన వాతావరణంలో జీవించే వారి ప్రాణశక్తి హరించుకుపోయి త్వరగా మరణిస్తారనీ, హిమాలయాల వంటి అతి స్వచ్చమైన ప్రదేశాల్లో నివసించేవారు ఎక్కువ కాలం జీవిస్తారనీ చెప్పారు.

అయితే, హిమాలయాలు కూడా చాలా వరకు కలుషితం అయ్యాయనీ, వాహనాలు, మానవ సంచారం పెరిగిపోవటంతో సాధకులు హిమాలయాలలోని మరింత లోతైన, సాంద్రమైన ప్రదేశాలకు వెళ్లి సాధన చేసుకుంటూ వున్నారని వివరించారు.

తద్వారా వందల ఏళ్ళు జీవించి ఉండ గలుగుతున్నారని చెప్పారు. అలా ఎక్కువ కాలం జీవించారని చెప్తున్న వాళ్ళను కలిశాను,కానీ వారి వయసును నిర్ధారించుకోలేక పోయాను.ఎందుకో ఈ ప్రాణ రహస్యం ప్రకృతితో ముడిపడి వుందని చెప్పిన దాన్ని విశ్వసించాలనిపిస్తుంది.

అలాగే, ఆత్మ గురించి కొన్ని గ్రంధాలను పరిశోధించాను. యోగవాసిష్టం ,కేనోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు తదితర గ్రంధాలలో ఆత్మ గురించి, పరమాత్మ గురించి ప్రస్తావన వుంది. అవే అంశాలు భగవద్గీతలోనూ దర్శనమిచ్చాయి. ఆత్మ,పరమాత్మ గురించి వుందికానీ, ప్రాణం, జీవం అంశాల అనుసంధానం కు సమాధానం దొరక లేదు.

నీ వలెనే నీ పోరుగువారిని ప్రేమించు, అనే వాక్యానికి అర్ధవివరణ భగవద్గీతలో దొరకినది. నీలోనూ, నాలోనూ ఉండే ఆత్మ ఒక్కటే,అది పరమాత్మలో భాగమే అని గీతలో వివరణ చూసాక మనందరిలో వున్న అంశం ఒక్కటేనని ,అందరం ఒకే మూలానికి అనుసంధానమై ఉన్నామనీ అర్ధమయ్యింది.కానీ, ప్రాణం గురించి మరింత తెలుసుకోవాలని వుంది. మిత్రులు ఎవరైనా విపుల సమాచారం ఇవ్వగలిగితే బాగుండు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!