బెంగాల్లో మోడీ గాలులు వీస్తున్నాయా ?

Sharing is Caring...

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు కనిపించే సూచనలున్నాయి. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సంస్థ ప్రతినిధులు బెంగాల్లో పర్యటించి అక్కడి రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఈసారి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం మొత్తం 294 అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ స్థానాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. కేవలం 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్‌ కాంగ్రెస్ కు అనుకూలత కన్పిస్తోంది.12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి అనుకూలత ఉంది. దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ-టీఎంసీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా  పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 5 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరో 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మెజారిటీ హిందూ ఓటర్లు బీజేపీవైపు పోలరైజ్ అవుతున్నారని సర్వే చెబుతోంది. 
నార్త్ బెంగాల్ లో 75 శాతానికిపైగా హిందువులుండగా, 14 శాతం ముస్లింలు, 4 శాతం క్రిస్టియన్లు, బౌద్ద ఓటర్లున్నారు.సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే.. దాదాపు 35 శాతం మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు తృణమూల్‌ కాంగ్రెస్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. నార్త్ బెంగాల్ లో మొత్తం ఓటర్లలో 10 శాతానికిపైగా ఎస్టీ ఓటర్లున్నారు. వీరు కూడా అధికార పార్టీ నేతల పనితీరు, అవినీతి పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న నార్త్ దినాజ్ పూర్, సౌత్ దినాజ్ పూర్, మాల్దా,ముర్షిదాబాద్ జిల్లాల్లోతృణమూల్ కి అనుకూలత కన్పిస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం మంది ముస్లిం సామాజికవర్గం వారే.  ఈ సర్వే ప్రకారం చూస్తే దీదీకి కష్టకాలమే అని చెప్పుకోవాలి.
ఇదిలాఉంటే  సరిగ్గా ఎన్నికల సమయంలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం అధికారపార్టీ తృణమూల్ కి పెద్దషాక్. టికెట్ పొందిన అభ్యర్థి సరళ ముర్ము కూడా బీజేపీలో చేరిపోయారు. దీంతో తృణమూల్ వేరొకరిని బరిలోకి దించింది. ఇవాళ రేపట్లో మరికొందరు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోవచ్చని సమాచారం. లాస్ట్ మినిట్ ఫిరాయింపుల వల్ల బరిలో నిలిచిన అభ్యర్థుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుంది.
కాగా దీదీ ఈసారి నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్నది. దీంతో అక్కడ హోరాహోరీ సమరం జరగవచ్చు. 2007లో చేపట్టిన భూ సేకరణ వ్యతిరేక ఉద్యమం ద్వారా మమతా బెనర్జీ‌తో పాటు సువేందు అధికారికి అప్పట్లో మంచి పేరు వచ్చింది. నిన్నటి వరకూ మమతా బెనర్జీ విధేయుడుగా ఉన్నసువేందు  తృణమూల్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. నందిగ్రామ్ నుంచే ఆయన  మళ్ళీ పోటీ చేస్తున్నారు.మమతపై 50 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తుంటే .ఎన్నికలకు ముందు వెన్నుపోటు పొడిచిన సువెందు ను అసెంబ్లీ అడుగుపెట్టనివ్వనని మమత ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!