Reason for Kim’s aggression…………………….
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు అణ్వాయుధాలపై విపరీతమైన మోజు అనే విమర్శలున్నాయి. ఆ మోజు వెనుక వ్యక్తిగత ఆసక్తి కంటే, ఉత్తర కొరియా మనుగడ, భద్రత,రాజకీయ ప్రతిష్ట వంటి వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా జనాభా 26.6 మిలియన్లు మాత్రమే.
అమెరికా… దక్షిణ కొరియాల నుండి తమకు ముప్పు ఉందని ఉత్తర కొరియా భావిస్తుంది. అణ్వాయుధాలు కలిగి ఉండటం ద్వారా, ఆదేశాలు తమపై సైనిక దాడికి దిగకుండా నిరోధించవచ్చని అధ్యక్షుడు కిమ్ నమ్ముతారు. లిబియా లేదా ఇరాక్ వంటి దేశాల నాయకులు అణ్వాయుధాలను వదులుకున్న తర్వాత పతనం అయ్యారని ఆయన ఉదాహరణగా చెబుతుంటారట.
1950 దశకంలో కొరియా యుద్ధం జరిగింది.. 1950-1953 మధ్యకాలంలో సోవియట్, చైనా మద్దతుతో ఉత్తర కొరియా, అమెరికా బలగాల మద్దతుతో దక్షిణ కొరియా ల మధ్య యుద్ధం జరిగింది. విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది. అపుడే ఆ దేశాల విభజన జరిగింది. నాటి నుంచి ఉత్తర కొరియా అణ్వాయుధాల పై దృష్టి పెట్టింది.
కిమ్ తాత తండ్రుల కాలం నుంచే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ..కిమ్ వారి బాటలోనే నడుస్తున్నారు. ఉత్తర కొరియా దూకుడు చూసి ఎలాగైనా ముకుతాడు వేయాలని ఐక్య రాజ్యసమితి నిర్ణయించింది. ఉత్తర కొరియాను దారికి తెచ్చుకోవాలంటే ముందు రష్యాకు చెక్ చెప్పాలని భావించి ,అణ్వాయుధ నియంత్రణ మండలి ద్వారా కఠిన ఆంక్షలు విధించింది . దీంతో ఉత్తర కొరియా దిగి వచ్చింది.
1994లో అణ్వాయుధ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీకి స్వస్తి చెప్పింది. అయితే ఎంతో కాలం మాట మీద నిలబడలేదు. 2003లో అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి బయటికొచ్చేసింది. ఈ కాలంలో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి అధికారంలో ఉన్నారు. 1994 నుండి 2011 వరకు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ (Kim Jong Il)కాగా అంతకుముందు ఆయన తన తండ్రి కిమ్ ఇల్-సుంగ్ దేశాన్ని పాలించారు.
2011 లో కిమ్ జోంగ్ ఉన్ పాలనా పగ్గాలు చేపట్టారు. అణ్వస్త్రాల నిరోధక ఒప్పందం నుంచి 2003 నుంచి బయటి కొచ్చిన తర్వాత 2006లో తొలి అణ్వాయుధాన్ని ప్రయోగించింది ఉత్తర కొరియా. దీనిపై పలు ప్రపంచదేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్రంగా స్పందించింది.ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించింది.కిమ్ జోంగ్ ఇల్ మాత్రం అవేం పట్టించుకోలేదు.
పగ్గాలు చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ 2011- 2017 మధ్యకాలంలో పలుమార్లు అణ్వాయుధాలను పరీక్షించారు. మిసైల్స్ టెస్ట్ చేశారు. దీంతో ఐక్యరాజ్య సమితి మరిన్ని ఆంక్షలు విధించింది. అయితే కిమ్ జోంగ్ ఉన్ అవేం పట్టించుకోలేదు. ప్రపంచమంతా తమను వెలి వేయడం, ఆంక్షలతో ఆర్థికంగా చితికిపోవడంతో కిమ్ కాస్త మెత్తబడ్డారు. అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించారు.
ఉత్తర కొరియా దూకుడును అడ్డుకోకపోతే ప్రపంచానికే ముప్పు తప్పదని భావించిన ఐక్యరాజ్యసమితితో పాటు పలు ప్రపంచదేశాలు ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.దీంతో కిమ్ జోంగ్ ఉన్ దారికొచ్చారు. 2018లో అమెరికా అధ్యక్షుడితో కిమ్ సమావేశమయ్యారు. అణ్వాయుధాలకు స్వస్తి పలుకుతామని సంతకాలు చేశారు.
మరోవైపు ఉత్తర కొరియాతో ఉన్న సమస్యలను పక్కన పెట్టి ఆ దేశంతో సత్సంబంధాల కోసం దక్షిణ కొరియా, చైనా కూడా ముందడుగు వేశాయి.కొన్నాళ్ల తర్వాత కిమ్ మనసు మార్చుకున్నాడు. ప్రపంచ దేశాల ఆంక్షలను బేఖాతరు చేశారు. 2020లో కిమ్ మళ్లీ అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో వీటిని పరీక్షిస్తూనే వస్తున్నాడు.
అత్యాధునిక క్షిపణులను తయారు చేసి వదులుతున్నాడు. ఇంతటితో ఆగకుండా సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని సొంతంగా అణు సామాగ్రిని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కిమ్ ప్రయత్నాలపై కొందరు బహిరంగ విమర్శలు చేశారు. ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలని దక్షిణ కొరియా అభ్యర్థించింది.
అదలావుంటే… ఉత్తర కొరియా యోంగ్ బోల్డెన్ కాంప్లెక్స్ తో పాటు మరొక యురేనియం ప్లాంట్ ను నిర్మించి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలకు రష్యా, చైనా సహకరిస్తున్నాయని.. ముందు వాటికి చెక్ పెట్టాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.. ఉత్తర కొరియా వద్ద ఇప్పటి వరకూ సుమారు 50 వరకూ అణ్వాయుధాలు ఉండవచ్చని అంచనా.
అణ్వాయుధ శక్తిగా ఎదగడం ద్వారా, అంతర్జాతీయ సమాజంతో ముఖ్యంగా అమెరికాతో సమాన స్థాయిలో చర్చలు జరపవచ్చని కిమ్ భావిస్తారు. ఆంక్షలు ఎత్తివేయడం లేదా ఆర్థిక సహాయం వంటి రాయితీలను పొందేందుకు ఈ కార్యక్రమాన్ని ఒక బేరసారాల సాధనంగా కిమ్ ఉపయోగిస్తుంటారు. అందుకే అణ్వాయుధాల తయారీ పై ఎక్కువగా సొమ్ము ఖర్చు పెడుతుంటారు.
ఉత్తర కొరియా బడ్జెట్ అత్యంత గోప్యంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన వ్యయాన్ని అంచనా వేయడం కష్టం. అయినప్పటికీ, వివిధ నివేదికలు కొంత సమాచారాన్నితెలియ జేస్తున్నాయి. దక్షిణ కొరియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ ఎనాలిసిస్ ప్రకారం, ఉత్తర కొరియా 1970ల నుండి తన అణు కార్యక్రమంపై మొత్తం 1.1 బిలియన్ నుండి 3.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉండవచ్చని అంచనా.
2021లో అణ్వాయుధాలపై సుమారు 642 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉండవచ్చని మరో నివేదిక సమాచారం. ఇది ఆ దేశ జిడిపిలో గణనీయమైన భాగం.ఆశ్చర్యకరంగా, ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమానికి అవసరమైన నిధులను సైబర్ దాడులు.. క్రిప్టోకరెన్సీ దొంగతనాల ద్వారా సమకూర్చుకుంటున్నట్లు UN నివేదికలు అనుమానిస్తున్నాయి.
ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను దేశం భరిస్తోంది. కార్మికులకు లేదా భూమికి చెల్లింపులు చేయనవసరం లేకపోవడంతో, ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ వ్యయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అణ్వాయుధ కార్యక్రమం వల్ల ఉత్తర కొరియా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

