Market crash due to war scare…………………
స్టాక్ మార్కెట్లు యుద్ధ భయంతో వణుకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు ఆందోళనలో పడ్డారు. ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సూచీలు భారీగా పతనమైనాయి .శుక్రవారం సెన్సెక్స్ 808.65 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం ఓ దశలో 25వేల పాయింట్లకు దిగువకు చేరి.. చివరికి 200.25 పాయింట్ల నష్టంతో 25,049.85 వద్ద స్థిరపడింది. గురువారం అయితే సెన్సెక్స్ ఏకంగా 1,769.19 పాయింట్లు,నిఫ్టీ 546.80 పాయింట్లు నష్టపోయాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం పరిస్థితి కొంత మెరుగు అని చెప్పుకోవచ్చు.
ఏది ఏమైనా ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ భయాలు తగ్గేవరకూ మార్కెట్ల పరిస్థితి ఇలాగే ఉండవచ్చు. మదుపర్ల సంపద మరింత హరించుకుపోవచ్చు. ముడి చమురు ధరలుపెరగడం ఇన్వెస్టర్ల భయానికి మరో కారణం. ఇన్నాళ్లు 70-71 డాలర్ల వద్ద కొనసాగిన బ్యారెల్ ముడి చమురు ధర గురువారం 75 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా శుక్రవారం 78.38 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇటీవల చైనా ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలతో ఆ దేశానికి చెందిన స్టాక్స్ రాణిస్తున్నాయి. ఈక్రమంలో భారత్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయన్న ఆందోళనలు నెలకొన్నాయి శని,ఆదివారాలు మార్కెట్లకు శెలవు ..సోమవారం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ముందే అంచనా వేయలేము. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భయాల మధ్య.. స్టాక్ మార్కెట్లు మరికొన్ని రోజులు ఇలానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
కాగా.. లెబనాన్ మిలిటెంట్ షియా ఇస్లామిస్ట్ ఉద్యమ నాయకుడు నస్రల్లా హత్యకు ప్రతీకారంగా అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా.. తమ పై దాడి చేసిన వారిని వదిలిపెట్టమని.. ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదని ప్రతిజ్ఞ చేసింది.. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆకారణంగా ఇతర వస్తువుల ధరలు పెరగడం అనివార్యం..
మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నపుడు .. యుద్ధ భయం నెలకొన్నపుడు షేర్లు కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారం. కాబట్టి ఇన్వెస్టర్లు కొద్దీ రోజులు కొనుగోళ్ళకు దూరంగా ఉండటం మంచిది. కాకపోతే ఏయే షేర్ల ధరలు ఎంత మేరకు తగ్గాయి అన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది.