“కులములోన ఒకడు గుణవంతుడుండెనా… కులము వెలయు వాని గుణము చేత..!”
అన్నీ కులాలు ఇష్టపడే పద్యం..ఏ మతమైనా సమ్మతించే భావం..!
మనిషి చచ్చిపోతే స్మశానంలో పూడ్చేటప్పుడు దూరం నుండే కుక్కలు., నక్కలూ చూస్తుంటాయి..
అందరూ వెళ్ళాక అవకాశం ఉంటే గుంట తవ్వి పీక్కుతినవచ్చనీ.. వాటిల్లో కూడా విచక్షణ ఉంటుంది.
ఎప్పుడు దూరంగా ఉండాలో… ఎప్పుడు తినాలో అనే..జ్ఞానం ఉంటుంది..!
ఓ మనిషి లోకం వదిలినప్పుడు.. లక్షలాది మంది బాధపడుతున్నపుడు ఇష్టం లేనివాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి..
విమర్శలకు దూరంగా ఉండాలి… విమర్శించటానికి అది సమయం కాదు.
ఈ మాత్రం సంస్కారం లేనివాళ్లకు.. విమర్శించే అర్హత లేనట్టే..!
విమర్శ కూడా ద్వేషంతో కాదు..ఆధారాలతో చెయ్యాలి.. పుకార్లతో,ఊహాగానాలతో కాదు.
నిజాలు తెలిసి చెయ్యాలి. అదీ సమయం సందర్భాన్ని బట్టి చెయ్యాలి..!
‘పాట’ అనేది ఏ పార్టీది కాదు.. సంగీతం అన్నీ మతాలది.. మనుషులందరిదీ..!
బాలసుబ్రమణ్యం గారి మరణం.. కుల,మత,భాష,ప్రాంతం దేశము తేడాలు లేకుండ అందరినీ కంటతడి పెట్టించింది.
ఎన్నో హృదయాలని కలిచి వేసింది.. విశ్వనాధ్ గారు అనుబంధం దూరమైనందుకు తల్లడిల్లారు..!
భారతీ రాజాగారు..తీవ్రం గా ఏడ్చాడు. శవసంస్కారం జరిగేప్పుడు దగ్గరే ఉండి తన సంస్కారం చూపించారు.
ఇళయరాజా గారు అరుణాచలంలో తన ఆవేదన సర్వేశ్వరుడికి చెప్పుకున్నారు..
బాలూగారి తర్వాత బాలూ అంతటి వాడు.. మనో..గుండెలు బాదుకుని ఏడ్చాడు..
వాళ్ళందరూ అన్నిటికీ అతీతంగా సంస్కారం చాటుకున్నారు.
అందుకే
“కులము వెలయు వాని గుణము చేత”
అన్నాడు వేమనగారు..!
భాషా అంతరాలతో కొట్టుకునే ప్రాంతాలన్నీ ఓకే ఆత్మగా కలిసి వేదన అనుభవించాయి.
ఈ సమాజంలో ఎవరినీ ఎవరూ తొక్కెయ్యలేరు. ఆ మాట అనుకోవటంతోనే ఎవరికి వారే తొక్కేసుకోవటం మొదలవుతుంది.!
జీవితంతో పోరాటం చేస్తున్నప్పుడు కొన్ని అవరోధాలు ఎవరికైనా ఎదురవుతాయి..! అల్పుడిని నాకే ఎదురైనాయి..!
బాలూ గారికి కూడా ఎదురైవుంటాయి..! ఎన్ని ఎదురైనా ఎదిరించటానికి.. ముందు మనం కరెక్టు గా ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి..
బద్ధకం,సోమరితనం,వదులు కోవాలి. శక్తిని నమ్ముకోవాలి.
పనిచేసే గుణం పెంచుకోవాలి. చేసే పనిని ప్రేమించాలి.
మనం చేసే పని అందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలంటే మన ప్రవర్తన బాగుండాలి..!
ఇవన్నీచేసి ఫలితాలు అనుకున్నట్టు రాకపోయినా తృప్తి ఉంటుంది.
ధైర్యం తోడుగా ఉంటుంది..!
ఏదయినా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..!
నాకున్న తక్కువ తెలివితో గమనించిన మహానుభావుల కధలు ఇలాగే ఉన్నాయి..!
వాల్మీకి ఎవరని రామాయణాన్ని అందరూ పూజిస్తున్నారు. ఆయన్ని ఎవరూ ఆపలేదే..!
వేమన ఎవరని ఆయన పద్యాలే వేదాలని చిన్నప్పుడు వల్లె వేశాం..
రవీంద్రనాధుడు ఎవరివాడని జాతీయగీతం పాడటానికి వ్యతిరేకిస్తాం…!?
రాజ్యాంగాన్ని రాయమని అంబేద్కర్ ని అందరం ఎందుకు కోరుకున్నాం .!?
అబ్దుల్ కలామ్ ఎవరని చేతులు జోడించి సలామ్ లు చేస్తున్నాం..!
ప్రపంచంలో ఎవరి మేధస్సుని , ఆత్మశక్తిని ఏ శక్తి ఆపలేదు..!
బాలూ గారి జీవితమూ అంతే..! ఆయన ప్రతిభ..శ్రమ ఆయనని ఎంతో ఎత్తుకుపెంచాయి..!
ఆయన నిరంతర సంగీత తపస్సులో పడి అందులోనే లీనమయ్యాడు..!
ఎదుటి వాళ్ళను తొక్కేసే స్వభావం ఉన్నవాడు.. సంకుచిత మనస్కుడు అయితే అంత తపోసాధన చెయ్యలేడు..!
హృదయం అసూయా, ద్వేషాలతో నింపుకున్నవాడు.. అన్ని భాషలమీద, సాహిత్యాలమీద పట్టు,పరిపక్వత సాధించలేడు…!
నేలమీద కూర్చుని జేసుదాసు పాదాలు కడిగిన భక్తి తనలో దాచుకున్నవాడు కాబట్టే
ఆర్ద్రత, స్పందనలు పండిన స్వరం పలికించగలిగాడు. అందరినీ మురిపించగలిగాడు..!
కేవలం.. ఆయన్ని సమర్ధించటానికి ఇలా రాయటం లేదు..!
గాయపడ్డ ఆలోచనలను ఓదార్చటంకోసం రాస్తున్నాను..!
సృష్టి లో ప్రతి మొక్కకి, ప్రాణికి.. కంటికి కనిపించని క్రిములకు కూడా ఓ విలువ శక్తి ఇస్తూనే దేవుడి సృష్టి సాగింది..!
ఎవరి విలువలు వాళ్ళు తెలుసుకుంటే ఎదుటి వాడి విలువ తెలుస్తుంది..రాణిస్తుంది..!!
అందుకే శోధించి సాధించమని పెద్దవాళ్ళు చెప్పింది. సమాజంలో కుల,మత, వర్గ బేధాలకు విలువ ఇవ్వని వాళ్ళు ఎంతో మంది ఉంటారు..
అందరిలో ఉంటారు..!వాళ్ళని కూడా గాయపరిచి.., మార్చి.. సమాజాన్ని మరింత కలుషితం చెయ్య వద్దని..
కోరిక,
విన్నపం,
ప్రశాంత హెచ్చరిక.
————- మరుధూరి రాజా .. సినీ రచయిత
Excellent opinion of the author ! My congratulations to him !🌹🌹🌹
మాటల్లో చెప్పలేని భావం
మనిషిలో కలిగే ఆర్థ్రత
మనసులో మెదిలే ఆలోచనలు…
అన్ని బహు చక్కగా చెప్పారు… కంగ్రాట్స్
వంద శాతం నిజం సర్