INVESTMENT ………………………..ఆర్ధిక సమస్యలతో మూతపడిన “జెట్ ఎయిర్ వేస్” విమానాలు మళ్ళీ ఎగరనున్నాయి. ఇందుకు మూడు నుంచి ఆరు నెలల కాలం పట్టవచ్చు. కంపెనీ కార్యకలాపాలు మొదలైతే ఇన్వెస్టర్లకు తక్షణమే లాభం ఉంటుందా ? అంటే ఉండదనే చెప్పాలి. జెట్ ఎయిర్ వేస్ షేర్లను భారీ ధరల వద్ద కొనుగోలు చేసి నష్టపోయిన ఇన్వెస్టర్లు చాలామందే ఉన్నారు. రెండేళ్ల క్రితం కంపెనీ విమాన సర్వీసులను నిలిపివేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు షేర్ ధర దాదాపు 60 శాతం పతనమైంది.
సర్వీసుల నిలిపివేతకు ముందురోజు 2019 ఏప్రిల్ 16 న జెట్ షేర్లు రూ. 241 వద్ద ఉండగా మూడు రోజుల క్రితం 99 వద్ద ట్రేడ్ అయింది. జెట్ విమానాలు మళ్ళీ ఎగర వచ్చుఅంటూ వార్తలు రాగానే మెల్లగా షేర్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం జెట్ షేర్లు రూ. 109 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీ మూత పడగానే దాని మార్కెట్ విలువ కూడా 1617 కోట్లనుంచి 1129 కోట్లకు పడిపోయింది.
ఇక ప్రస్తుతం జెట్ షేర్లు సర్క్యూట్ పరిధిలోకి వెళ్లాయి. ఈ దశలో షేర్లను కొనుగోలు చేస్తే లాభమా ? అంటే ఈ దశలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమని విశ్లేషకులు చెబుతున్నారు. రిస్క్ తీసుకోగల సత్తా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అది కూడా పరిమితంగా అయితే మంచిది. గత రెండు మూడు రోజులుగా 2 లక్షల షేర్ల మేరకు అమ్ముడు పోతున్నాయి. విమాన సర్వీసులు మొదలయ్యాక … కంపెనీ పనితీరు మెరుగుపడటానికి చాలాకాలం పడుతుంది. 2017 లోఈ షేర్లు రూ . 574 వద్ద ట్రేడ్ అయ్యాయి. 2018 లో షేర్ ధర రూ. 746 వరకు పెరిగింది. కంపెనీ సంక్షోభంలో చిక్కిన క్రమంలో అదే ఏడాది ఆగస్టు 2 నాటికి రూ. 331 కి పతనమైంది. అప్పట్లో షేర్లను కొన్న ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు. అధిక ధరల వద్ద షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కొంత కాలం వేచి చూడక తప్పదు.
ప్రస్తుత ధర కంటే తక్కువ ధరల్లో ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే వాళ్ళు పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. షేర్ ధర మెల్లగా పెరుగుతుంది కాబట్టి దశలవారీగా అమ్మకాలు చేయవచ్చు. చిన్నఇన్వెస్టర్లు తొందరపడి ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. ఇక కంపెనీ 2020 మార్చి నాటికి రూ 2841 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టలేకపోయింది. 2017 నుంచే కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఖర్చులు పెరగడంతో ఆదాయం క్రమేణా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరలు, కరెన్సీ విలువ, పోటీ వాతావరణం వల్ల సంస్థ ప్రతి రోజు రూ.4 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అధిక రుణాల కారణంగా జెట్ ఎయిర్‌వేస్ మూలధన నిల్వలు కూడా కరిగిపోయాయి. ఈ ప్రయివేటు ఎయిర్ లైన్స్ దివాళా పరిష్కార ప్రక్రియలో భాగం గా జలాన్ -కల్రాక్ కన్సార్షియం సమర్పించిన బిడ్ కు NCLT ఆమోదం చెప్పింది. విధాన ప్రక్రియ అంతా ముగిసి, విమానాలు ఎగిరి, కంపెనీ గాడిలో పడితే మంచిదే.
————-KNM