Bharadwaja Rangavajhala ………………..
Das is not just about action ……………….
భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన KSR దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలబడిపోయారు.సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే…ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసి తీరాలి. అదీ ఆయన రేంజ్.కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు. దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ లేదు.
గుంటూరులో ఓ సినిమాహాల్లో బుక్కింగ్ క్లర్క్‌గా జీవితం ప్రారంభించిన దాస్ సినిమా మీద ప్రేమతో మద్రాసు వచ్చి ఎస్.భావనారాయణ కంపెనీలో చేరాడు.ఎన్‌టిఆర్ బండరాముడు సినిమా టైమ్‌లో ఫ్లోర్ ఊడ్చిన దాస్ చాలా కాలానికి యుగంధర్ సినిమా కోసం ఎన్టీఆర్ ను డైరక్ట్ చేశారు.
దాస్ అంటే యాక్షన్ మాత్రమే కాదు. దాస్ అంటే పట్టుదల. ఒక పని అనుకుంటే దాన్ని ఎలాగైనా సాదించడం.హార్మనీ పెట్టె సైకిల్ మీద పెట్టుకుని తిరిగే సత్యంను సంగీత దర్శకుణ్ణి చేసింది ఆ పట్టుదలే. మేకప్ మేన్ వీర్రాజును నిర్మాతను చేసిందీ ఆ పట్టుదలే. డైరెక్టర్‌గా తనకు తనే బ్రేక్ ఇచ్చుకుని నిలబడ్డ అరుదైన చరిత్ర దాస్‌ది.
భావనారాయణ కంపెనీలో శోభన్‌బాబుతో లోగుట్టు పెరుమాళ్లకెరుక సినిమా డైరెక్ట్ చేశారు దాస్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అక్కడ నుంచి బయటకు వచ్చేసి సీనియర్ మేకప్ మేన్ వీర్రాజుకు ఓ కథ చెప్పి అతన్ని ప్రొడ్యూసర్‌ను చేశాడు. వక్త్ అనే హిందీ సోషల్ మూవీని జానపదానికి ఎడాప్ట్ చేసి కాంతారావు హీరోగా రాజయోగం తీశాడు. విడుదలైన ప్రతి సెంటర్‌లో యాభైరోజులు ఆడింది.
అలా సక్సస్ ట్రాక్ ఎక్కారు దాస్. ఆ తర్వాత దాస్‌కు బాగా పేరు తెచ్చిన సినిమా రౌడీరాణి.
విజయలలిత హీరోయిన్‌గా విజయచందర్ హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ కొట్టడమే కాకుండా బాలీవుడ్‌లో రీమేక్ అయింది.వినోద్‌మెహ్రా హీరోగా డాకూరాణి పేరుతో దాసే డైరెక్ట్ చేశాడు.
కృష్ణతో అనుకోకుండా ఏర్పడిన అనుబంధం సుదీర్ఘకాలం కొనసాగింది.కృష్ణను మాస్ హీరోను చేసింది దాసే. దాస్ మాస్ డైరెక్టర్‌గా మారింది కూడా కృష్ణ సినిమాల నుంచే. జర్నలిస్ట్ వై.వి.రావు కృష్ణతో సినిమా చేద్దామనుకుని దాస్‌ను సంప్రదించాడు. అలా తయారైన సినిమా పేరు టక్కరి దొంగ చక్కని చుక్క. దాస్‌కి అది పద్దెనిమిదో సినిమా. కృష్ణ కాంబినేషన్‌లో మొదటి సినిమా.సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆ కాంబినేషన్‌లో నలభై సినిమాలు వచ్చాయి.
వాటిలో చరిత్ర సృష్టించిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు. పద్మాలయా బ్యానర్‌లో మొదటి హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు. భారత దేశంలోనే మొదటి కౌబాయ్ సినిమా అది. రాజస్థాన్ వెళ్లి షూట్ చేశారు. హాలీవుడ్ కౌబాయ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో తీశాడని దాస్‌కు మంచి పేరొచ్చింది.
త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డూండీ నిర్మాతగా దాస్ కృష్ణ కాంబినేషన్‌లో వరసగా దొంగ టైటిల్స్‌తో సినిమాలు తీసి సంచలనం సృష్టించాడు.భలే దొంగలు, దొంగలకు దొంగ, దొంగల వేట దొంగలు బాబోయ్ దొంగలు ఇలా ప్రతి సినిమా సక్సస్ అయింది. శ్రీకాంత్ మూవీస్ బ్యానర్‌లో జేమ్స్‌బాండ్ తరహా కథలతో సక్సస్‌ఫుల్ సినిమాలు చేశారు. ఏజంట్ గోపీ, రహస్యగూడచారి సినిమాలు బాగా ఆడాయి.
అదే బ్యానర్‌లో వచ్చిన నవలా చిత్రం గిరిజా కళ్యాణానికి కూడా దాసే డైరెక్టర్. దాస్ డైరెక్ట్ చేయడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందనే వాళ్లూ ఉన్నారు. కానీ దాస్ మాత్రం ఆ సబ్జక్ట్‌ను కూడా చాలా చక్కగా హాండిల్ చేశాడు.
యాక్షన్ సినిమా అంటే దాస్ మాత్రమే చేయాలనేది అప్పటి తెలుగు సినిమా పరిశ్రమ నిశ్చితాభిప్రాయం.దర్శకుడు విశ్వనాథ్ తను తీసిన కాలాంతకులు చిత్రంలో యాక్షన్ పార్ట్ డైరక్ట్ చేయమని అడిగితే ఓకే అని చేసిపెట్టారు దాస్. అలాగే అల్లూరి సీతారామరాజు టైమ్ లో డైరక్టర్ రామచంద్రరావు కన్నుమూస్తే…యాక్షన్ ఎపిసోడ్ అంతా తీయాలని కృష్ణ అడిగినదే తడవు పనిలో దిగిపోయారు దాస్. హాలీవుడ్ లెవెల్లో తీసి తనేంటో చెప్పారు.
కురుక్షేత్రం సిన్మా లో యుద్ధం సన్నివేశాలు దాస్ గారు తీసినవే.దాస్ డైరెక్షన్‌లో చేయడానికి కొత్త హీరోలు చాలా ఉత్సాహ పడేవాళ్లు.ఎందుకంటే దాస్ అంటే బి,సి సెంటర్లలో స్పెషల్ క్రేజ్ ఉండేది. ఆయన సినిమాలు ఆ సెంటర్లలోనే అదరగొట్టేవి.నేల క్లాసు డైరెక్టర్ అనే పేరు ఉండేది దాస్‌కి. దాన్నాయన చాలా పెద్ద కాంప్లిమెంట్ అనేవారు.
చిరంజీవి కూడా దాస్ మూవీస్ చేయాలని తొలి రోజుల్లో తెగ ఉబలాటపడ్డారు.దాస్ తో రెండు యాక్షన్ సినిమాలు చేశారు కూడా.కొత్త ప్రతిభను ప్రోత్సహించడం దాస్ కు చాలా ఇష్టం. దర్శకరత్న దాసరిని హంతకులు దేవాంతకులు చిత్రానికి డైలాగ్ రైటర్ గా పెట్టుకున్నారు. దాస్ ప్రోత్సాహంతోనే ఆ తర్వాత రోజుల్లో దర్శకుడుగా దాసరి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు.
కత్తుల రత్తయ్య సినిమా టైమ్‌లో నటుడు త్యాగరాజు రికమెండేషన్‌తో మోహన్‌బాబును అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకున్నారు దాస్. భలేదొంగలులో షక్కర్‌మే రక్కర్ అంటూ ఓ మాసీ ఊతపదంతో మంచి కారక్టర్‌లో మాస్‌కు పరిచయం చేశారు. అక్కినేనితో తప్ప మిగిలిన అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేశారు దాస్.
ఆదుర్తి, తాపీ చాణక్య లాంటి ఓ తరహా దర్శకులతో సినిమాలు తీసిన సారధి స్టూడియోస్ కృష్ణ , రజనీకాంత్‌లతో సినిమా చేయాలనుకున్నప్పుడు కనిపించిన దర్శకుడు దాసే.అలా వచ్చిన చిత్రాలే అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే. వీటిలో అన్నదమ్ముల సవాల్ చాలా పెద్ద విజయం సాధించింది.
దాస్ తీసిన చిత్రాల్లో ఈనాటి బంధం ఏనాటిదోకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా దాస్ సినిమాలకు ఆరుద్ర పాటలు రాయడం సత్యం మ్యూజిక్ చేయడం రివాజు.కానీ ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు రాజేశ్వర్రావు మ్యూజిక్ చేశారు.దేవుల పల్లి వెంకట కృష్ణ శాస్తి సాహిత్యం అందించారు.ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ లాంటి క్లాసికల్ సాంగ్స్ దాస్ సినిమాలో ఉండడం విశేషమే మరి.
నిర్మాత బాలయ్య గారి పుణ్యం అది. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిల్చిపోయే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన సంచలనాత్మక దర్శకుడు దాస్ మాస్ దర్శకుల గురువుగా గుర్తుండిపోతారు. దాస్ తెలుగులో 66 హిందీలో 11, కన్నడంలో20, తమిళ్3, మలయాళం లో 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. అన్నట్టు ఆయన పూర్తి పేరు కొండా సుబ్బరామ దాస్ .. ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి లో పుట్టారు. ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు డైరెక్ట్ చేసిన ఖ్యాతి ఆయనది.
.