కఠారి పుణ్యమూర్తి…………………………………………..
FEAR అంటే అర్థం భయం ఒకటే కాదు, False Evidence Appearing Real అంటే వాస్తవంలా అనిపించే అబద్ధం… ఇప్పుడు కరోనా విషయంలో జరుగుతున్నదిదే… అంటే కరోనా అబద్ధమని నా ఉద్దేశ్యమా అని మీకు అనిపించింది కదా?…కరోనా వైరస్ నిజం… కానీ కరోనా వల్ల మాత్రమే చచ్చిపోతారనేది నిజంలా అనిపిస్తున్న అబద్ధం..
అతడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.”దెయ్యం కంటే భయ్యం (భయం) మా చెడ్డదండి”.. ఇంగ్లీషులో చెప్పాలంటే “Fear is much worse than a Devil”… అర్ధరాత్రి శ్మశానంలో ఒక పుల్ల ముక్క చొక్కాకి పట్టుకోవడంతో దెయ్యమనుకుని భయమేసి గుండాగి చనిపోతాడో పిల్లోడు ఆ సినిమాలో… ఇప్పుడు కూడా చాలామంది వైరస్ కి భయపడే చనిపోతున్నారు, కొద్దిమంది మాత్రం దీర్ఘకాలిక జబ్బులుండడం వల్ల వైరస్ ని ఎదుర్కోలేక మరణిస్తున్నారు.
కరోనా ముందు ఎవరూ హఠాత్తుగా చనిపోలేదా? కరోనా లేని కాలంలో భారతదేశంలో రోజుకి 35 వేల మంది చనిపోయేవారు…ఇప్పటికి కూడా అలానే చనిపోతున్నారు..కానీ మన ఫోకస్ అంతా కరోనా చావులని భయపెడుతున్న దినపత్రికలు, వాట్సాప్ యూనివర్సిటీ వార్తల మీద ఉండడం వల్లే భయపడుతున్నాం…ఆ దరిద్రాన్ని అస్సలు పట్టించుకోకూడదు. సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
కొంచెం జ్వరం వస్తే కరోనా కంగారు, కొంచెం దగ్గు వస్తే కరోనా వణుకు… ఈభయమే వైరస్ కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారిందిప్పుడు. కొంతమంది మరింత సెన్సిటివ్ గా ఉంటారు. ఏ చిన్న నెగటివ్ వార్త విన్నా తట్టుకోలేరు. విపరీతంగా ఆలోచిస్తారు. ఆందోళన పడుతుంటారు.ఇది కామన్. కుటుంబ పెద్దలే వారికి ధైర్యం చెబుతుండాలి. సునామీలా వచ్చిన కరోనా ను ఎదుర్కోవడానికి మందులతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. బెడ్ల కొరత .. ఆక్సిజన్ కొరత అంటూ వచ్చే వార్తలను వినగానే మనకు అలాజరిగితే ఏమౌతుందో అన్న ధోరణిలో కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్లు మీడియా కు దూరంగా ఉండటమే మంచిది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ వార్తలు కూడా డిప్రెషన్ కు గురిచేస్తాయి.భయ పడేవాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిదే.
కొంత మంది వీటికి అతీతంగా వ్యవహరిస్తూ వద్దన్నా వినకుండా రోడ్ల మీద తిరుగుతుంటారు. వీళ్లకు ధైర్యం ఎక్కువ .. జాగ్రత్త తక్కువ. ఫలితంగా కరోనా అంటించుకుని కుటుంబ సభ్యులకు తగిలిస్తుంటారు. ఇలాంటి కేసులే ఇపుడు ఎక్కువ. ఏది ఏమైనా ఇలాంటి విపత్కర సమయంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించడం కంటే మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. భయాన్ని తరిమికొట్టాలి. సెల్ఫ్ కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది.పాజిటివ్ దిశగా ఆలోచించాలి. అసలు ఈ ప్రపంచానికి వైరస్లు, బాక్టీరియాలు కొత్తేమీ కాదే..మనిషి కంటే ముందునుండీ ఉన్నాయి… మనిషి పుట్టుక తర్వాత కొత్తగా వచ్చినవి కూడా ఉన్నాయి ఈ కరోనా వైరస్ లాగా… ఇంకా కొత్తవి కూడా ముందు ముందు రావచ్చు… మనం భయపడితే వచ్చేది చావు తప్ప, వైరస్ రావడం ఆగదు.
మొన్నామధ్య ఇటలీలో ఒక ముసలావిడ 102 ఏళ్ల వయసులో కరోనా బారిన పడి కూడా బ్రతికిందట.. ఈవిడకి 1918 లో స్పానిష్ ఫ్లూ కూడా సోకిందట..అప్పుడు కూడా మరణాన్ని జయించిందట. హైదరాబాద్ లో 110 ఏళ్ళ రామానంద తీర్థులు, పెంటమ్మ అనే 90 ఏళ్ళ వృద్ధురాలు, దొరస్వామి అనే 104 ఏళ్ళ పెద్దాయన కరోనాను జయించారు. వీళ్లందరి విజయ రహస్యం ఏమిటంటే “ఎప్పుడూ అధైర్యపడని గుండె నిబ్బరం.. సంతోషంగా ఉండడం, సంగీతం , డ్యాన్స్లతో జీవితాన్ని ఆస్వాదించడం”. సంతోషం సగం బలం అని పెద్దలు ఊరికే అనలేదు కదా…. ఇలాంటి కేసు లు ఎన్నో ఉన్నాయి. వాటిని స్టడీ చేయాలి. ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రతి విషయానికి ఆందోళన పడకుండా కొంత సంయమనం పాటిస్తే కరోనా ను ఎదుర్కోవడం కష్టమేమి కాదు. కరోనా సోకినా కూడా బెంబేలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఉందాం… కరోనాని జయిద్దాం…