దెయ్యంతో ఇంటర్వ్యూ 3

Sharing is Caring...

“వామ్మో ఇన్నిరకాలా ?ఇన్ని దెయ్యాలను కనుగొన్నారంటే మీ మనుష్యులు సామాన్యులు కాదు.
అన్నట్టు కొరివి దెయ్యాలు గురించి చెప్పలేదు ” ప్రియంవద అడిగింది.
“కొల్లిదేవా దెయ్యాలు దాదాపుగా కొరివి దెయ్యాలు లాంటివే” అన్నాను.

“మొత్తానికి మీరు కూడా దెయ్యాల గురించి బాగానే రీసెర్చ్ చేశారు.” అంది నవ్వుతూ
“ఇంతకూ తమరు ఏకేటగిరీ కి చెందిన వారో చెబుతారా ?” అడిగాను.
“వద్దులే … చెబితే భయపడిపోతారు ?” అందామె నవ్వుతూ.
” మరి చివర్లో అయినా చెబుతారా ??
“ఒకే. ”
“మరో ప్రశ్న … దెయ్యాల ప్రత్యేకత ఏంటి ?”

“దెయ్యాలకున్న స్వేచ్ఛ మరెవ్వరికీ లేదు . మాకు రెక్కలు లేవు, కానీ ఎగురుతాం. ఆకారం లేదు,
కానీ బహురూపాల్లో అందర్నీ భయపెడుతుంటాం. మాకు రంగు,రుచి వాసన లేవు,
కానీ పరకాయ ప్రవేశంతో అన్నింటిని ఆస్వాదిస్తుంటాం.ఇది మా ప్రత్యేకత.”
“అవును … ఒక దెయ్యంగా మీరు ఎప్పుడన్నా భయపడ్డారా ?”

“ఒకసారి ఒకరింటికి పొరపాటున వెళ్ళా …అది ఒక మాంత్రికుడి ఇల్లు. నన్ను అతగాడు కట్టి పడేశాడు …
శిక్షగా దెయ్యాల సీరియల్స్, సినిమాలు చూపించాడు. రెండు రోజులు పాటు అదే పని.
దాంతో నాకు కొత్త జబ్బు పుట్టుకొచ్చింది. ఎక్కడ చిన్న శబ్దమైనా వణకిపోయేదాన్ని.
తలుపు చప్పుడైనా, గాలికి కర్టెన్లు కదిలినా భయమే. వాడెవడో రాంగోపాల్ వర్మట.

దెయ్యాల సినిమాలు తీయడంలో ఎక్సపర్ట్ అంట. రాత్రి, పగలు తేడాలేకుండా దెయ్యం సినిమాలు
తీసిపారేశాడట.ఐస్ క్రీమ్ తింటున్నా అందులో నుంచి దెయ్యం వస్తుందేమోనన్న భయం పట్టుకుంది.
టివీల్లో దెయ్యాలు చూశాక మామీద మాకే అసహ్యం కలుగుతోంది. మా పేరుచెప్పుకుని ఇష్టమొచ్చినట్లు సినిమాలు
తీస్తున్నవారినీ, వాటిని టివీల్లో చూపిస్తున్న వారినీ పట్టిపీడించాలని ఉంది. కానీ ఆ పనిచేయలేను. అందుకే
దెయ్యం సినిమాలు, సీరియల్స్ బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నా.” చెప్పింది ప్రియంవద.

“మా మనుష్యులు దేవుడు , దేవతలున్న క్షేత్రాలను చూసి వస్తుంటారు .
అలాగే మీరు కూడా పేరుమోసిన దెయ్యాలు ఉన్న ప్రాంతాలను చూసి వస్తుంటారా ?”
“లేదు … నేను ఈ మధ్యనేగా దెయ్యంగా మారింది.”
“అవును అలా మారడానికి వెనుక ఏమైనా కారణం ఉందా ?”

“పెద్ద కథే ఉంది … అది మరోసారి చెబుతాను. ”
“దెయ్యం కథలు రాసే రచయితలు తెలుసా మీకు ?”
“అపుడెపుడో యండమూరి రాసేవాడు. తర్వాత చాలామంది రాశారు …
ఈమధ్య కే ఎన్ మూర్తి అనే ఎవరో రెండు చేతులతో దెయ్యం కథలు రాస్తున్నాడని,
అందులో మంచి దెయ్యాల గురించి కూడా రాసాడని మాదెయ్యాలు చెప్పుకుంటున్నాయి.”
“ఆయన తెలుసా మీకు ?”

” తెలీదు. ”
“అది నేనే ”
“ఆయన మీరేనా ? ” ఆశ్చర్యపోయింది ప్రియంవద.
“చివరి రెండు ప్రశ్నలు .. దెయ్యాలు అమాయకులను కూడా హింసించినట్టు సినిమాల్లో చూపిస్తుంటారు …. నిజమేనా ? “
” నాకు తెలిసి అలాంటిది ఏది లేదు.. దెయ్యాలు తమకు కీడు చేసిన వారిని మాత్రమే భయపెడతాయి.. హింసిస్తాయి. “
“ఒకే … ఆఖరి ప్రశ్న … బహురూపాల్లో అందర్నీ భయపెడుతుంటాం అన్నారు. కొన్ని రూపాలు చూపిస్తారా ?
“చూపిస్తా కానీ భయపడితే నాది కాదు బాధ్యత… ఓకేనా ?” అడిగింది ప్రియంవద.

“దెయ్యాలు మరీ అంత భయంకరంగా ఉంటాయా ?” భయం భయంగానే అడిగాను.
” మీరు చూడగలరేమో ? ఒక్కసారి వెనక్కి చూడండి ” అందామె .
అంతే వెనక్కి తిరిగాను … రకరకాల దెయ్యాలు కనిపిస్తున్నాయి.
కొన్ని గెటప్స్ సినిమాల్లో మాదిరిగా ఉన్నాయి . చివరి గెటప్ మాత్రం భయంకరంగా ఉంది.

ఆ దెయ్యం జుట్టు విరబోసుకుని ఉంది. మొహం సగభాగం కత్తితో చెక్కినట్టు ఉంది.
దవడ దగ్గర మాంసపు కండలు బయటకొచ్చాయి. అది అచ్చం ఇంగ్లిష్ దెయ్యంలా ఉంది.
వాటిపై పురుగులు తిరుగుతున్నాయి . అతి జుగుప్సాకరంగా ఉంది.
ఒక కన్ను మాత్రమే తెరిచి ఉంది. అది కూడా అగ్ని గోళం లా ఉంది. గిర్రున తిరుగుతోంది.
నోట్లో నుంచి నాలుక బయటకొచ్చి పాములా బుస కొడుతోంది.

అలా చూస్తుండగానే ఒక్కసారిగా ఆ నాలుక నా మొహం మీదకు సాగుతూ పొడుచుకొచ్చింది.
అంతే… వెన్నులో వణుకు మొదలైంది. భయంతో అక్కడనుంచి ఎగిరి దూకాను.
ఢా …….. మ్మని కింద పడ్డాను.
కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసాను. పక్కనే మంచం కనిపించింది.
అదేంటి ? చింత చెట్టు పై నుంచి దూకితే ఇంట్లో ఎలా పడ్డాను ?
ఇది కలా ? నిజమా ?
ప్రియంవద ఏమైంది ? ఆ ఇంగ్లీష్ దెయ్యం ఎటుపోయిందో ?

—————– @@@@@——————

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!