Subramanyam Dogiparthi ………………………..
యువతరాన్నిమాత్రమే కాదు జనాల్నికూడా కదిలించిన సినిమా ఇది. కమ్యూనిస్ట్ పార్టీ నేపధ్యం నుండి వచ్చిన మాదాల రంగారావు నటించి, నిర్మించిన సినిమా ఇది. విప్లవ కథా చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్.
ఇలాంటి విప్లవ భావాలతో, పీడిత ప్రజల ఊరుమ్మడి బతుకుల మీద అంతకు ముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కాస్త సాఫ్టుగా ఉన్నసినిమాలు. మాదాల రంగారావు ఈ సినిమాను ఎర్ర బాటలో పరుగెత్తించాడు.
ఈ సినిమాకు నిర్మాత, కధకుడు కూడా మాదాల రంగారావే. ఎర్ర భావాలున్న ధవళ సత్యం దర్శకుడు. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా వి మధుసూధనరావు ను ,రచయితగా బొల్లిముంత శివరామకృష్ణను అనుకున్నారు. వీరిది కూడా కమ్యూనిస్ట్ నేపధ్యమే. ఎందుకో ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు.
తర్వాత రచయితగా ఒంగోలు కి చెందిన రచయిత ఎంవీఎస్ హరనాథరావును అనుకున్నారు. మాదాల,హరనాథరావు, టీ. కృష్ణ ఒంగోలు శర్మా కాలేజీ లో చదువుకున్నారు. ఆ కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ప్రజానాట్యమండలిలో చురుగ్గా పనిచేస్తున్న ఎంజే రామారావు, ధవళ సత్యం లను మాదాల ఎంపిక చేసుకున్నారు.
అప్పటికే ధవళ సత్యం దాసరి వద్ద కొన్ని సినిమాలకు పనిచేశారు. జాతర సినిమా తీశారు. ‘యువతరం కదిలింది’ ఆయనకు రెండో సినిమా’ ..సెంటిమెంట్లకు నెలవైన సినిమా రంగంలో కొబ్బరికాయ కొట్టకుండా ముహూర్తపు షాట్ అంటూ హడావుడి లేకుండా షూటింగు మొదలు పెట్టారు.
ఆగస్టు 15 న రిలీజ్ చేస్తామని ప్రారంభం నాడే ప్రకటించారు. కరెక్ట్ గా ఆగస్టు 15 నాడే విడుదల చేశారు. సినిమాకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ సినిమాను ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్లో స్క్రీన్ చేయించుకున్నారట. ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. డబ్బుల వర్షం కురిసింది.
ఆ డబ్బులతోనే నవతరం పిక్చర్స్ బేనర్ మీద మాదాల రంగారావు మరి కొన్నిఎర్ర సినిమాలను తీసారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని నమ్మిన ప్రజా నాట్య మండలి నేపధ్యం నుండి వచ్చిన రంగారావు సినిమా టైటిల్సులోనే ఆ మాట చెపుతాడు. సినిమా డైలాగులను నవతరం యూనిట్ వ్రాసారని టైటిల్సులో వేసారు. ఎంజే రామారావు, ధవళ సత్యం లు సంభాషణలు సమకూర్చారు.
టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలు , బుర్ర కధ చాలా బాగుంటాయి . సి నారాయణరెడ్డి వ్రాసిన ‘యువతరం కదిలింది’ అనే పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్. కాలేజీ ఫంక్షన్లలో బాగా వినిపించేది. దీనికి పూర్తి భిన్నంగా మరో చక్కటి పాట ‘ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో’ చాలా శ్రావ్యంగా ఉంటుంది.
అప్పటికే కధకుడు , బుర్రకధల రచయిత , రంగస్థల నటుడు, గాయకుడు అయిన అదృష్ట దీపక్ వ్రాసిన మొదటి సినిమా పాట ఇది . అల్లరే పల్లవి , ఓ చిన్నదానా ఓహో చిన్నదానా పాటలు బాగుంటాయి . నందారే లోకమెంతో చిత్రమురా , వినరా భారత వీరకుమారా బుర్రకధలు బాగుంటాయి .
ఈ సినిమాలో ప్రధానంగా మెచ్చుకోవలసింది ప్రభాకరరెడ్డి పాత్ర ను. ఆయన నటన ఉత్తమ నటుడు నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఉత్తమ కధా రచయితగా మాదాల రంగారావుకి , ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డులు వచ్చాయి.నంది అవార్డులతో పాటు ఇతర కళా సంస్థల నుండి కూడా అవార్డుల వర్షం కురిసింది.
మాదాల రంగారావు , రామకృష్ణ , మురళీమోహన్ , నారాయణరావు , సాయిచంద్ , రంగనాధ్ , నాగభూషణం , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు , నర్రా వెంకటేశ్వరరావు , చలపతిరావు , వల్లం నరసింహారావు , కె విజయ , రమాప్రభ , కృష్ణవేణి , మరెంతో మంది జూనియర్ ఆర్టిస్టులు , ఔత్సాహికులు నటించారు.
ప్రజా నాట్యమండలి కి చెందిన ‘అన్న’ నల్లూరి వెంకటేశ్వర్లు తెరపై కనిపించిన మొదటి సినిమా ఇది. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి.
తళుకుల ప్రపంచంలో జోగాడుతున్న ఈనాటి యువతరం ఆనాడు చైతన్య మూర్తులు జనం కోసం ఎలా కష్టపడ్డారో తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలను చూడాలి. ఇంతకుముందు చూడని మాతరం కుర్రోళ్ళు కూడా చూడవచ్చు.రిటైర్ అయి ఉంటారుగా. టైం ఉంటుంది.చూడండి.