Achyutha devaraya inscription ........
ప్రఖ్యాత శిల్పకళాక్షేత్రం లేపాక్షి వీరభద్రాలయ రెండవ ప్రాకార గోడపై ఉత్తర దిక్కున గల పెద్ద శాసనాన్ని తుళు వంశ ప్రశస్తి శాసనంగా గుర్తించినట్టు సీనియర్ జర్నలిస్టు, చరిత్రకారుడు మైనాస్వామి తర్జనితో మాట్లాడుతూ అన్నారు. లేపాక్షి లోని అన్ని శాసనాల కంటే తుళువంశ ప్రసస్తి శాసనం చాలా పెద్దది. ఆ శాసనాన్ని లేపాక్షి ఆలయ నిర్మాణానికి ఇతోధికంగా సాయపడిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అచ్యుత దేవరాయలు క్రీస్తుశకం 153 3 లో ఆ శాసనాన్ని రాయించాడు.
శాసన లిపి కన్నడ కాగా.. అందులోని భాష సంస్కృతం. అచ్యుతరాయల హయాంలో ఉన్న సంస్కృత కవయిత్రి తిరుమలమ్మ ఆ శాసనాన్ని రూపొందించినట్టు తెలుస్తున్నది. పురాణ ప్రభువులు బుధుడు, పురూరవుడు, తుర్వసుడు, యయాతి తదితరులు తమ వంశానికి మూల పురుషులని అచ్యుతరాయలు చెప్పుకొన్నాడు.
తిమ్మభూపతి -దేవకీదేవి, ఈశ్వర నాయకుడు – బుక్కమాంబ, నరస నాయకుడు – తిప్పాంబ, నాగలంబ,ఓబాంబ, నరసింహారాయలు, శ్రీక్రిష్ణదేవరాయలు తదితరుల పేర్లు శాసనంలో ఉన్నట్టు మైనా స్వామి వివరించారు. అంతేగాక శ్రీక్రిష్ణదేవరాయల శౌర్య పరాక్రమాలను బట్టి ఆయనకు మూరురాయరగండ, త్రి సముద్రాధిపతి, అరిరాయ విభాడ, హిందూ రాయ సురత్రాణ, దుష్ట శార్దూల మర్దన..వంటి బిరుదులు కూడా ఉన్నాయి.
తుళు వంశ ప్రభువులు గొప్ప పరిపాలనను అందించారని, రాజ్యాన్ని విస్తరించడానికి చేర,చోళ, పాండ్య, బహుమనీ సుల్తానులు గజపతులు…వంటి రాజులను ఓడించినట్టు శాసనం చెబుతున్నది. తమ వంశంలోని గొప్ప ప్రభువులను స్ఫూర్తి గా తీసుకొని తాను ధర్మ పాలనను కొనసాగిస్తున్నట్టు అచ్యుత దేవరాయలు శాసనంలో చెప్పాడు. “శుభమస్తు, శివమస్తు, శ్రీ లేపాక్షి వీరేశ్వర దేవర” అని శాసనం మొదలవుతుంది. తరువాత సంస్కృత శ్లోకాలు శాసనాన్ని వివరిస్తున్నాయి. వాస్తవానికి రెండవ ప్రాకార గోడ శాసనాన్ని 1912లో బ్రిటిష్ అధికారులు నమోదు చేశారు. అయితే నేటి వరకు శాసనాన్ని పరిష్కరించలేదు.
విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, హంపి, శ్రీకాళహస్తి, కంచి, శ్రీరంగం, కుంభకోణం, శ్రీశైలం, మహానంది, హరిహర, గోకర్ణ, లేపాక్షి తదితర ఆలయాలకు భూములను … బంగారాన్ని విరివిగా దానం చేసినట్టు అచ్యుతరాయల శాసనం చెబుతోంది. భూములు, సువర్ణ దానంతో పాటు వేలాది గోవులను ఆలయాలకు బహూకరించారు. ఆ దానాల వల్ల రాజ్యంలోని ఆలయాలు నిత్య దీప ధూప నైవేద్యాలతో కళకళలాడమే కాకుండా భక్తులకు నిత్యాన్న దానాన్ని కూడా అందించాయి.