అప్పట్లో అస్వతంత్రుడైన స్వతంత్రుడు !

Sharing is Caring...

భండారు శ్రీనివాసరావు…………………………………………………..

తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు, వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక రామారావు, రాజశేఖరరెడ్డి ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం.

ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదనంగా అనేక ప్రజాకర్షక పధకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా వారిదే.

పోతే ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ చేష్టలుడిగివున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రాజశేఖరరెడ్డి స్థానంలో, వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాలనుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి, ఆ దృష్టి తోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా  నాడు నామినేట్ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడయిన కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలి.

ఎందుకంటే, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్న కులం, ధనం, వర్గం వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా, ఏ రకమయిన ప్రాధమిక అర్హతా లేకుండా, కనీస స్థోమత కూడా లేకుండా, రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా రోశయ్య సీఎం పదవికి ఎంపికయ్యారు. అదిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు చోటా మోటా కాంగ్రెస్ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా ఆ పార్టీలో వేళ్ళూనుకుంది.

అలాంటి పార్టీలో వుంటూ కూడా, అధిష్టానం కొలువైవున్న కొత్త డిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారంటే ఆయనకు వున్న సీనియారిటీకి తోడు అదృష్టం కూడా కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయటవారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం  గమనార్హం. ఇటు ప్రభుత్వాన్నీ,అటు పార్టీ అధిష్టానాన్నీ తన కనుసన్నల్లో వుంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభాసామర్ధ్యాలు కలిగిన రాజశేఖరరెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తిమీద సాము అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక. 

పార్టీలో ఎవరు ఏమిటి? అన్న విషయాలు పుక్కిట పట్టిన దక్షుడు రోశయ్య. అధిష్టానం మనసెరిగి మసలుకునే తత్వం వొంట బట్టించుకున్న వ్యవహారశీలి ఆయన. బలం గురించి బలహీనతలు గురించి స్పష్టమయిన అంచనాలు వేసుకోగలిగిన సమర్ధుడు ఆయన. అన్నింటికీ మించి రాజకీయాలలో ‘కురు వృద్ధుడు.  ‘పెద్దమనిషి’ అన్న ముద్రతో పాటు, అందరూ అర్రులు చాచి అందుకోవాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి పదవిని తృణ ప్రాయంగా త్యజించే సంసిద్దతను వ్యక్తం చేయగలిగిన ధీమంతుడు.

పరిశీలకులు తొలినాళ్ళలో ఊహించిన స్థాయిలో ఆయన పట్ల వ్యతిరేకత వెల్లువెత్త లేదు. ఇవికాక, కాకలు తీరిన నాయకులకు ఏ మాత్రం కొదవ లేని కాంగ్రెస్ పార్టీలోని సహజ సిద్ద వర్గ రాజకీయాలు సైతం రోశయ్య ముఖ్యమంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాయి.మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా, మంత్రులను మార్చకుండా, వైఎస్సార్ పధకాలను ఏమార్చకుండా గుంభనగా నెట్టుకొస్తూనే వచ్చారు.

లోగడ కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా, ఆయన తనదయిన శైలిలో నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగించే ప్రయత్నం చేసారు. వై.ఎస్. మరణం తర్వాత ఎనిమిది మాసాల కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే. కానీ వాటి విషయంలో ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు.

ఉదాహరణకు ప్రెస్ అకాడమి చైర్మన్ గా తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏ పీ ఐ ఐ డి సీ అధినేతగా శివసుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి. సమర్ధులయిన ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, రాజశేఖరరెడ్డి సైతం ప్రెస్ అకాడమి విషయంలో రోశయ్య మాదిరిగా స్వతంత్ర నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే, జర్నలిష్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమీషనరుగా పీఎస్సార్ ఆంజనేయులును బదిలీ చేసిన తీరుని కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!