చివరి రోజుల్లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో !!

Sharing is Caring...

The glory of the greats is eternal……………………………….

ఘంటసాల మాస్టారు చనిపోవడానికి ముందు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. మద్రాస్ లో ఉంటే నిర్మాతలు, దర్శకులు మా సినిమాకు ఒక్క పాటైనా సరే పాడాల్సిందే అని ఇబ్బంది పెడుతున్నారని ఆయన విశ్రాంతికోసం ఎవరికీ చెప్పకుండా 1973వ సంవత్సరం  చివర్లో ఓ సారి హైదరాబాద్ కొచ్చారు.

అంటే అదే నగరానికి వచ్చిన చివరి సందర్భం ఎందుకంటె ఫిబ్రవరి  11, 1974న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పట్లో ఆయన లక్డీకపూల్ లోని ద్వారకా హోటల్లో దిగేవారు. కాస్త కాలు సాగుతుంది కదా అని నడక మొదలుపెట్టారు.. ఆలిండియా రేడియో నుంచి కంట్రోల్ రూమ్ వైపుకు తిరిగి నిజాం క్లబ్ వైపుకు వెళుతుండగా అప్పుడే ఆకాశవాణిలో అప్రెంటిస్ గా చేరిన ప్రయాగ రామకృష్ణకు బాల్కనీలో  నుంచి చూస్తుంటే అటుగా నడిచి వెళ్తున్న ఘంటసాల మాస్టారు కనిపించారు.

ప్రయాగ రామకృష్ణ పరుగు పరుగున కిందికి దిగొచ్చి ఘంటసాల మాస్టారి వెనక పరిగెడుతూ ఆయన్ని చేరుకుని పలకరించారు. మీ అంతటివారు ఇక్కడికొచ్చాక మా రేడియో కేంద్రానికి రాకుండా వెళ్లడమేంటి దయచేసి ఒక్కసారి అడుగు పెట్టండి అని అభ్యర్ధించారు. అప్పట్లో శారదా శ్రీనివాసన్ కూడా ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తున్నారు. వారిది రేడియో డ్రామా, కథానికలో గొప్ప గొంతు. అయితే వారందరు ఘంటసాల గొంతుతో  పాడే పాటలు కోసం అభ్యర్ధించారు.

వీళ్లిద్దరితోపాటుగా నండూరి విఠల్ ఇంకా మిగతా వాళ్లంతా ఘంటసాల మాస్టారిని బతిమిలాడి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడానికి ఒప్పించారు. అప్పట్లో ఓ నార్త్ ఇండియన్ స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. హిందీలో రఫీ ఎంత గొప్ప గాయకుడో తెలుగులో ఘంటసాల మాస్టారు అంత గొప్ప నేపధ్య గాయకులు అని ఆయనకు చెప్పి, ప్రత్యేక కార్యక్రమం రూపకల్పనకు ఆయన్ని కూడా ఒప్పించి, అనుమతి తీసుకుని దాదాపు రెండు గంటల నిడివిగల కార్యక్రమాన్ని రూపొందించారు. 

ఆ కార్యక్రమంలో ఘంటసాల మాస్టారికి నచ్చిన అనేక పాటల్ని ఆయనతో పాడించుకున్నారు. ఘంటసాల పరమపదించిన తర్వాత ఆ ప్రత్యేక కార్యక్రమం ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రంలో అనేకసార్లు ప్రసారం అయ్యింది. ఎన్నిసార్లు ప్రసారం చేసినా సరే అంతకు అంతా శ్రోతలనుంచి ఆ కార్యక్రమానికి ఆదరణ వెల్లువెత్తడం విశేషం. మద్రాసులో ఎదురవుతున్న ఒత్తిడిని తప్పించుకుని కాస్త విశ్రాంతి తీసుకుందామని ఘంటసాల మాస్టారు హైదరాబాద్ కొస్తే ఇక్కడా ఆయన్ని కీర్తి కాంత వదలకుండా వెంబడించడం విశేషం. మహనీయుల కీర్తి అజరామరం.

 
వేలూరి పార్థసారధి సౌజన్యంతో

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!