Amazing waterfalls………………………
రాజస్థాన్ అనగానే ఎడారులు ,ఇసుక తిన్నెలు, ఒంటెల సవారీలు, తలపై కుండలు, చేతులకు కంకణాలు ధరించిన మహిళలు, విశాలమైన రాజభవనాలు, పెద్ద కోటలు గుర్తుకొస్తాయి. కానీ రాజస్థాన్ లో అద్భుతమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద జలపాతం భీమ్లాట్ .
ఈ భీమ్లాట్ జలపాతం ఆరావళి పర్వత శ్రేణుల నడిబొడ్డున సహజరీతిలో ఏర్పడిన అద్భుతం. 8వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల ఈ అద్భుతమైన నీటి వనరు ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు అంటారు.
హిందూ ఇతిహాసం మహాభారతంలోని భీముని పేరు మీద ఈ జలపాతం ఏర్పడింది. బీముడు తన గదతో నేలను కొట్టి జలపాతాన్ని సృష్టించాడని పురాణ కథలు చెబుతున్నాయి. దట్టమైన అడవులు..చుట్టూ కొండల నడుమ ఈ జలపాతం ఉంది .. అక్కడి ప్రకృతి దృశ్యాలు .. పైనుంచి దూకే నీటి పాయలు ,లోతైన లోయ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఈ ప్రాంతమంతా చల్లగా ఉంటుంది. రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ఉన్న ఈ భీమ్లాట్ జలపాతం బుండి-చిత్తోర్‌గఢ్ రోడ్‌లో ఉంది.. భీమ్లాట్ జలపాతాన్ని ఎడారిలో స్వర్గంగా అక్కడివారు వర్ణిస్తారు. 60 మీటర్ల ఎత్తు నుండి జల ధారలు కిందనున్న ఆకుపచ్చ కొలనులోకి దూకుతుంటాయి. ఈ దృశ్యాలు కనువిందు చేస్తాయి.
వర్షాకాలంలో ఈ జలపాతాన్ని సందర్శించడం అద్భుతంగా ఉంటుంది. ఏడారి ప్రదేశం రాజస్థాన్‌లో పచ్చదనంతో నిండిన ప్రదేశాన్ని చూడాలనుకుంటే.. భీమ్లాట్ కి వెళ్ళాలి. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. రాజస్థాన్‌లోని బుండి నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత జలపాతం వద్దకు చేరుకోవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రదేశం అందాల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.
రాజస్తాన్ లో అందమైన ప్రదేశాలు, కోటలు, రాజరికపు పాలనను గుర్తు చేసే ఎన్నో గొప్ప ప్యాలెస్ లు ఉన్నాయి..అయితే వీటితో పాటు రాజస్థాన్‌లో కూడా జలపాతాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ జలపాతాలు, ప్రకృతి, పచ్చదనం పర్యాటకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. చల్లదనం అనుభవిస్తూ ఆనందంగా గడపవచ్చు..
భీమ్లాట్ తో పాటు గైపెర్నాథ్, ధృధియ, పదఝర్ మహాదేవ్, మేనల్, అలెవా, చులియా వంటి జలపాతాలు కూడా ఉన్నాయి.పర్యాటకులు ఎవరైనా రాజస్థాన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడి చారిత్రక కట్టడాలను చూడడం, షాపింగ్ చేయడం మాత్రమే కాకుండా ప్రకృతి అందాలతో ఆకట్టుకునే ఈ జలపాతాలను కూడా సందర్శించవచ్చు.