వజ్రాలు దొరికే పార్క్ ఇదే !

Sharing is Caring...

ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్. ఈ పార్క్ అమెరికాలోని  అర్కన్సాస్‌ రాష్ట్రంలోని మర్ఫీబొరొలో ఉన్నది.

వెయ్యి ఏళ్ళ క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున వజ్రాలు బయట పడ్డాయి. ఇక్కడి భూముల్లోపల వజ్రాల గనులు ఉన్నాయని అంటారు. సాంకేతిక కారణాల వల్ల ఆ గనులను తవ్వడానికి వీల్లేకపోయింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పార్క్ గా మార్చేసింది.

900 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ పార్క్ ఉన్నది. ఇందులో 37 ఎకరాలను సందర్శకుల కోసం కేటాయించారు. ఈ ప్రాంతంలోకి సందర్శకులు ఎవరైనా వెళ్ళవచ్చు. అక్కడ వజ్రాల వేటను సాగించవచ్చు. వజ్రాలు దొరికితే ఇంటికి తీసుకెళ్ళవచ్చు.1906 నుంచి మొత్తం 75 వేల వజ్రాలు బయటపడ్డాయి.1972 నుంచి ఇప్పటివరకు 33 వేల వజ్రాలు సందర్శకులకు దొరికాయట.

అయితే ఓపిగ్గా వెతుక్కోవాలి. ఇక్కడ దొరికే వజ్రాలు తెలుపు,గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయి. వజ్రాలతో పాటు విలువైన రాళ్ళూ కూడా ఇక్కడ దొరుకుతాయని సందర్శకులు అంటున్నారు. ఎంతో మంది సందర్శకులకు లక్షల రూపాయల విలువైన వజ్రాలు దొరికాయని చెబుతున్నారు.

వజ్రాల వేటలో భాగంగా ఇక్కడ నేలను తవ్వడానికి అవసరమైన పరికరాలను మనమే తీసుకెళ్లవచ్చు.లేదంటే అక్కడ అద్దెకు కూడా ఇస్తారు.వజ్రాలను వెతికే పద్ధతి కూడా అక్కడి సిబ్బంది సందర్శకులకు వివరిస్తారు. పార్క్ లోపలికి వెళ్లాలంటే టిక్కెట్ తప్పని సరిగా కొనుగోలు చేయాలి.

పెద్ద వాళ్లకు 8 …చిన్నవాళ్లకు 5 డాలర్లు పెట్టి టికెట్ కొనాలి.ఇక పార్క్ లోపల వినోద కేంద్రాలు .. క్యాంటీన్లు కూడా ఉన్నాయి.పార్క్ లో వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. పిక్నీక్ స్పాట్స్, రెస్ట్ రూమ్స్ ఇతర సదుపాయాలున్నాయి. బాగుంది కదా .. అయితే పదండి పోదాం .. దొరికితే వజ్రాలు దొరుకుతాయి. లేదంటే పార్క్ లో చెట్టు కింద సేద తీరి .. ఏదైనా పానీయం సేవించి రావచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!