రమణ కొంటికర్ల ……………………………………………………..
ఎంత వివాదమైతే… అంత ప్రచారం. ఇవాళ్టి ప్రమోషన్ మోటో ఇది. అందుకు సెంటిమెంటల్ గా ప్రజలకు ఎంత బాగా కనెక్టైన అంశాలనెంచుకుంటే… అంత వివాదం… అంతకంతకూ ప్రచారం. ఇప్పుడీ ముచ్చటకు కారణం… ‘దిగు దిగు దిగు నాగ’ అనే భక్తి భజనకు… శృంగారాన్ని ఒలకింపజేసే సినీ పేరడీ ఐటమ్ సాంగ్ సృష్టి.
నాగశౌర్య, రీతూవర్మ హీరో, హీరోయిన్లుగా ‘వరుడు కావలెను’ అనే సినిమా కోసం.. నిన్నటి దాకా అంత పెద్ద వివాదాలంటే ఏంటో తెలియని ‘అనంత’ శ్రీరాం అనంతమైన వివాదంలోకి తనకు తెలియకుండానే వెళ్లినట్టైందనుకోవాలా…? లేక, ఊహించలేక ఇరుక్కుపోయాడనుకోవాలా…? లేక, తెలిసీ… ఎంత వివాదమైతే అంత మరోసారి ప్రచారంలోకి రావచ్చనుకున్నాడోగానీ… సోషల్ మీడియాలో అనంత శ్రీరామ్ అనంతమైన ట్రోలింగ్ కు కేంద్ర బిందువై పోయాడు.
ఐదుగంటల్లో మిలియన్ వీక్షణలని గర్వంగా ప్రకటించుకున్న తన అఫీషియల్ ఫేస్ బుక్ అకౌంట్ లోనే ఏకిపారేస్తూ జరిగిన ట్రోలింగ్… ఎన్నో సెన్సిటివ్ పాటల్ని రాసిన అనంత శ్రీరామ్ సెన్సిటివిటీని డిస్టర్బ్ చేయకుండా ఉండలేనిదే! గుండె ఒకింత బరువైనా… దిటువు చేసుకుని .. ఆ ఏముందిలే అనుకునేందుకూ అవకాశం లేని ట్రోలింగది.
ఎన్నో మంచి పాటలు రాశాడు… లైవ్ లో తాను మాట్లాడుతున్నప్పుడు కొంత కృతకంగా.. లేని పెద్ద తనాన్ని ప్రదర్శించినా… తన పాటల ముందు తననవేవీ విమర్శలకు అంతగా గురిచేయలేదు. కానీ ఓ భక్తి భజనకు శృంగార భాష్యం చెప్పిన తీరుతో మాత్రం.. తానూహించినదానికన్నా ఎక్కువ స్పందన లభించిందనుకున్న విషయాన్ని సోషల్ ఫ్లాట్ ఫాంలో ఇతరులతో పంచుకునే లోపే… తానూహించలేని తిరస్కృతికి గురయ్యాడు.
పైగా పాటలో తాను వాడిన పదాలు… ఆ పదబంధాలపైనా చర్చకు తావిచ్చాడు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకోవడం అనే మాట విన్నాంకానీ… గొడుగుతో పొయ్యేదాన్ని… గుడిసెదాకా తెచ్చుకోవడంలో కవి ఆంతర్యమేంటో అర్థం కాలా! అంతేకాదు.. మనిషన్నాక కాస్త కళాపోషణుండాలని రావుగోపాలరావన్నట్టు… తనలో ఉన్న సాహిత్య కళనంతా పర్చి కొత్త పదాలకై పాకులాడినట్టుండటం… ఈ పాట జనానికి చిర్రెత్తుకు రావడానికి మరో కారణమై ఉండొచ్చు! మరంత క్రేజ్… అన్ని వ్యూసేంటంటారా…? ముందే అనుకున్నాంగా…? క్యూరియాసిటి! ఎంత వివాదమైతే… అంత మంది చూడటం… అదే ప్రచారాస్త్రం కావడం… వర్మ నుంచి నేటి అనంత శ్రీరామ్ శర్మ వరకూ చూస్తున్నదేగా…?
ఏ కొత్త పదాలు కనుక్కోవద్దా…? వేటూరి వంటివాళ్లు రాయలేదా అంటే..? రాశారు.. అది శృంగారమైనా… వినోదమైనా… విషాదమైనా… ఒదిగిపోయేట్టు… అబ్బా ఎంత బాగా రాశారనిపించారు. హిట్లర్ సినిమాలో నడక కలిసిన నవరాత్రి… సిగ్గు పడకే శివరాత్రి.. ఒంపుసొంపుల ఎల్వోత్రీ… కాలు జారకె కంగోత్రీ అంటూ వేటూరి రాసిన తీరును ఓ చిన్న ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. కానీ శ్రీరాం ఎంచుకున్న భక్తి భజన… అందులోని పదాల కూర్పు… పైగా ఇన్నేళ్ల సినిమా ప్రస్థానంలో ఏ పాటకెలాంటి రెస్పాన్సుంటుంది.
ఏ విషయానికి ప్రజలు ఏవిధంగా రియాక్టవుతారో తెలుసుకోకుండానో… తెలిసీ తెలియనట్టుగానో… లేక, తెలిసేనో… అనంతశ్రీరామ్.. ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయాడు. తాను పంచుకున్న ఆనందమంతా ఆవిరైపోయేలా… చివరాఖరకు తాను రాసుకున్న పాటపై జరుగుతున్న చర్చతో… రామ రామ ఇదేం గతిరా అని…తిరిగి తన పాటని తానే సమీక్షించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన చిన్న నీతేందంటే… దుర్భిణీలు పెట్టి అంజనం వేసే సోషల్ మీడియా కాలాన… మంచీ, చెడులను ఒకటికి నాల్గుసార్లు తరచి చూచి విశ్లేషించుకోందే.. సోషల్ వాల్స్ పైకి ఏది పడితే అది వదలరాదనేది! వదిలితే.. ఇదిగో అనంత శ్రీరాముడిలాగే అనంతమైన నిందారోపణలకు కేంద్ర బిందువవుతారని!!
Watch Vedeo ………………………………….. ‘దిగు దిగు దిగు నాగ’