రమణ కొంటికర్ల ……………………………………………
ఐఏఎస్… ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్.. ఛఛా అస్సలు నచ్చలేదు.. మాకు అయ్యాఎస్ అంటేనే బాగుంది. అందులోనే విశ్వాసమూ, విధేయత, మర్యాద, గౌరవమూ, అణుకువ, మరిన్ని అధికార హోదాలననుభవించే భవిష్యత్తు అవకాశాలు.. ఇలా అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరింకా మమ్మల్నెవరైనా ఐఏఎస్ అంటే కోపం రాదా.. ఏటి..?ఎవరధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర్నేగా మేం పనిచేసేది…? మరలాంటప్పుడు పాలనలో ఉన్నపార్టీకి విధేయంగా ఉంటే తప్పేటి…? ప్రతిపక్షాలకు విశ్వాసంగా ఉంటారా ఏటీ.. మీ పిచ్చి కాకపోతే..?!!
మరి మీరు ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతాలు తీసుకుంటున్నారు.. ప్రజలకు జవాబుదారీ కాదా అని పిచ్చి ప్రశ్నలు వేస్తేనే మాలాంటి ఐఏఎస్ లకు.. సారీ సారీ అయ్యాఎస్ లకు మండేది! మాకధికారదర్పం కట్టబెట్టేది.. అధికారంలో ఉన్నవారా.. ? వారికి అధికారం కట్టబెట్టినవారా…? ఆమాత్రం తెలీకుండా మాట్లాడితే అజ్ఞానులనుకుంటారన్న జ్ఞానం ఉండనక్కర్లా…?చూడండి మా సర్కారు లో గొప్పల గురించి ఎందరు పెద్ద మనుషులు, గొప్ప గొప్ప జర్నలిస్టులు, ప్యానల్ డిస్కషన్ లో పాలుపంచుకునే అనలిస్టులు ఎన్నెన్ని చెబుతున్నా.. ఐఏఎస్ పదం ఇప్పుడు అయ్యాఎస్ గా ఎందుకు మారిందని ఏ ఒక్క పెద్ద మనిషైనా రాసిండా చెప్పండి…? మడిసన్నాక కాస్త కళాపోషణుండాలోయ్!
ఓ సబ్ కలెక్టర్ మోకాళ్ల దగ్గర వంగి కూర్చుని మాట్లాడినా వార్తే! తండ్రసంటి నాయకుడి కాళ్లకు పాదాభివందనం చేసినా ఆర్తే!! మహా మహా గొప్ప జర్నలిస్టులే పట్టించుకోనప్పుడు.. మీడియా అంతా సర్కారును భుజానికెత్తుకుని మోస్తుంటే.. మీ చిల్లర మల్లర ఆర్తలనెవడు పట్టించుకునేది…? ఐతే గియితే కేసులు పెట్టి లోపల నూకి.. మళ్ళీ మేమే కదా మిమ్మల్ని పట్టించుకోవాల్సింది…? అప్పుడుగానీ బుద్ధి రాదా మీకు…? అసలు ఐఏఎస్ పవరంటే ఏంటనుకుంటున్నారేటి…? సారీ సారీ మళ్లీ అలవాట్లో పొరపాటు… అయ్యా ఎస్ అంటే ఏటనుకుంటున్నారేంటి…?
మీరేమో ఇలా ఉంటే… మా పై బాసులకేమో మమ్మల్ని చూస్తే ఈర్ష్య. ఎప్పుడొచ్చామన్నది కాదు.. సిక్స్ కొట్టామా లేదా… సెంచరీ చేశామా లేదా అన్న చందంగా సచిన్ మాదిరి మా ఆటను చూస్తే మా సీనియర్లకు కుళ్లు. అరె మనం చేయలేనివన్నీ ఈళ్లు చేసేస్తూ… నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారే అని లోలోపల తిక్క. ఏదైనా కుట్ర చేసి ఇరికించేయాలన్న కసి. కానీ మేం సాహో అంటోందెవరికో తెలిశాక కూడా ఆ ఎర్రెర్రి ప్రయత్నాలు చేస్తే ఏమవుతుందో.. మా కంటే సీనియర్లుగదా ఆళ్లు… ఆళ్లకు తెలిసుంటుందనే మా భరోసా!
ఇగ ప్రజలేమనుకుంటున్నారనేగా…? హా ఏముందిలే మాకు వాళ్లతో! ఏదైనా వచ్చేదుందా పోయేదుందా…? ఉన్నతాధికారులమైన ఫాఫానికి పైగా మేమే ప్రజావాణీలు పెట్టి వాళ్ల సోది గోడంతా విని టైం ఏస్ట్ చేసుకోవడం తప్ప! పోనీ ఆళ్లతో ప్రత్యక్ష సంబంధాలతో మాకేమైనా ఒరిగేదుందా..? మేమైనా నాయకులమా…? ఆళ్లతో ప్రత్యక్ష సంబంధాలు బలంగా ఉండి.. అందులోనూ అధికారంలో ఉన్న నాయకులతో సంబంధం పెట్టుకుంటే సరి! అంతే.. ఇదే మా పాలసీ… ఇప్పట్లో మా కొత్తతరం అయ్యాఎస్ ల ఫిలాసఫీ కూడా ఇదేనూ!
ఐఏఎస్ ను అయ్యాఎస్ చేసిన మాది ప్రొఫెషనలిజమేనా అనేగా మీ డౌటనుమానం…? హా ఏముంది బొంగులో ప్రొఫెషనలిజం…? చూస్తే సూటు, బూటుతో ప్రొఫెషనల్స్ లానే కనిపిస్తున్నాంగా…? అది చాలదా ఏటి…? ప్రొఫెషనలిజం పేరుతో తనకు మాలిన ధర్మాన్ని నిర్వర్తించే ధర్మరాజులమో, కర్ణులమో ఐతే… మేం ఈడ ఉండగలమా… మీరే సెప్పున్రి మరి..? మా ఐఏఎస్ సదువుల గురించి మీకు తెల్వదా ఏటి…? అందుకే అన్నీ పట్టించుకోవద్దు తమ్ముడూ! అలా సూసీసూడనట్టు ఎళ్లిపోతుండాలి లోకమన్నాక!! ఆమాత్రం తెల్వదు అలౌక్యులు.. ఆర్తలు రాస్తారట… హమ్మ?!!