Poonch Encounter ………………………………….
కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్‌కౌంటర్ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్‌లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది.
అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు ఆగినా మళ్ళీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పూంచ్ ప్రాంతంలో అడవిలో దాగిన ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రత్యేక దళాల నుండి అధునాతన సైనిక శిక్షణ పొందారని భావిస్తున్నారు. నిటారుగా ఉన్న కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతాల్లో బంకర్లు ఏర్పాటు చేసుకుని అదను చూసి దొంగ దాడులు చేస్తున్నారు.
ఈ నెల 11వ తేదీన సురాన్‌కోటె దగ్గర భారత గస్తీ బృందాల పై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురిని చంపేశారు. మరల 14వ తేదీన మెందహార్ వద్ద మరోసారి దాడి చేసి మరో నలుగురు భద్రతా సిబ్బందిని హత్య చేశారు.ఈ ఘటనల్లో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లతో సహా.. తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మిలిటరీ దళాలు అప్రమత్తమై ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి. కనిపించిన ఉగ్రవాదులను కాల్చేస్తున్నారు. వారి బంకర్లను పేల్చేస్తున్నారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో మూడువేల మంది శిక్షణ పొందిన సైనికులు పాల్గొంటున్నారు. పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. పదమూడు రోజులుగా పూంచ్-రాజౌరీ జాతీయ రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భాటా దురియాన్ అడవిలో ఈ కూంబింగ్ జరుగుతోంది.
ఈ దట్టమైన అడవిలో మిలిటెంట్లు దాక్కొని మిలిటరీ దళాలపై దాడులకు దిగుతున్నారు. దీంతో జమ్ము-రాజౌరీ జాతీయ రహదారిని భద్రతా దళాలు మూసివేశాయి. పూర్తిగా రాకపోకలు నిషేదించారు. మిలిటరీ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అధునాతన ఆయుధాలను భారత దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో వాడుతున్నాయి.
ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఐఈడీ (బాంబులను ) ఉపయోగిస్తున్నారు. దారుల్లో ..చెట్లపైన వీటిని అమర్చారు. వాటిని గుర్తించి .. పేల్చి వేస్తూ కూంబింగ్ చేస్తున్నారు. సరిహద్దు కాల్పుల విరమణ కారణంగా తరచుగా ఇక్కడ ఉగ్రవాదుల చొరబాటు జరుగుతోంది.
ఫిబ్రవరి 24న భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడం దీనికి ప్రధాన కారణమని అంటున్నారు.జులై నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు 10-15 మంది మిలిటెంట్లు చొరబడ్డారని ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో మిలిటెంట్ దళాల రిక్రూట్మెంట్ సాగిందని .. దాదాపు 100 మంది కాశ్మీరీ యువకులను రిక్రూట్ చేసుకున్నట్లు భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదే రీతిలో 2003లో సురాన్ కోటే దగ్గర ఆపరేషన్ సర్ఫ్ వినాశ్ జరిగింది. అప్పట్లో అక్కడ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ బదర్ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటు చేసుకుని దాడులకు దిగేవి. దీంతో భారత్ దళాలు ఆపరేషన్ సర్ఫ్ వినాశ్ కార్యక్రమాన్ని చేపట్టి ఉగ్రవాదులను తుదముట్టించాయి.
———-KNM