నిజ నిర్ధారణకు వెనుకడుగేల ?

Sharing is Caring...

Govardhan Gande………………………………….

Why back off…………………………………………………..ఏనాడో త్రేతాయుగంలో సీతమ్మ తన పాతివ్రత్యాన్ని రుజువు చేసేందుకు అగ్నిప్రవేశం చేసిందనేది పురాణ గాథ. తన సౌశీల్యాన్ని నిరూపించుకున్నారు.తరువాత ఆమె శ్రీరాముడి వద్దకు వెళ్ళలేదు. తన తల్లి భూమాత వద్దకు వెళ్లిపోయారు.సీతమ్మ రాముడితో తిరిగి కలిసి ఉండేందుకు  సిద్ధపడలేదు. ఓ సగటు పౌరుడు వేసిన నింద. నింద మాత్రమేనని,నిజం కాదని లోకానికి చాటి చెప్పేందుకే రాముడు (రాజు కాబట్టి) సీతమ్మను పరీక్షించాడనేది జనవాక్యం.విశ్వాసం. సీతమ్మ కూడా లోకానికి తన శీలాన్ని చాటేందుకు మాత్రమే ఆ పని చేసారనేది రామాయణ కావ్య సారాంశం.

అలాగే రాముడు తన తండ్రి మాటకు కట్టుబడి 14 ఏళ్ళు అరణ్య వాసం చేసాడు.సావిత్రి, అనసూయలు తమ భర్తల ప్రాణాలను కాపాడుకునేందుకు మృత్యు దేవుడు యముడితోనే పోరాడారు. భీష్ముడు తన తండ్రికి చేసిన వాగ్దానం మేరకు జీవిత పర్యంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. కర్ణుడు పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు దానం చేసి దాన కర్ణుడయ్యాడు.హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి బాకీ పడిన సొమ్మును చెల్లించేందుకు ఆలి, బిడ్డలనే అమ్మివేశాడు.

బలి చక్రవర్తి, తన దాన గుణాన్ని చాటుకుందుకు వామనుడి పాదాల కింది ప్రాణాలను అర్పించాడు. ధర్మరాజు తన మాట కోసం ఆలిని సోదరులు,రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.ఏకలవ్యుడు తనకు ఎలాంటి శిక్షణనూ ఇవ్వని గురువు ద్రోణుడికి ప్రాణ సమానమైన కుడి చేతి బొటన వేలిని “గురుదక్షిణ” గా త్యాగం చేసాడు. ఇలాంటి వారు వారు ఇచ్చిన మాట,నమ్మిన విశ్వాసం కోసం జీవితాలను త్యాగం చేశారు. తమ ప్రాణాలను సైతం బలి ఇచ్చారు.భారతీయ పురాణాలు,ఇతిహాసాల్లో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

వీరంతా తమ శీలాన్ని నిలుపుకునేందుకు,నిరూపించుకునేందుకు అన్నీ త్యాగం చేసి చిరస్మరణీయులు గా  నిలిచిపోయారు. ఇవన్నీ శీలవంతమైన,ఆదర్శ సమాజ నిర్మాణ లక్ష్యంతోనే జరిగి ఉంటాయి. రామాయణం కావ్యమా? ఇతిహాసమా? అనే సంగతి ఇప్పటి సందర్భానికి అనవసరం. ఇక అసలు విషయానికి వద్దాం.

దేశంలో రామ రాజ్యాన్ని నిర్మిస్తామని పైన చెప్పిన మహనీయుల పేర్లను పదేపదే స్మరిస్తూ,చెబుతూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వారికి మాత్రం ఇలాంటి వారి లక్షణాలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  తాజా ఉదంతమే తీసుకుందాం. పెగాసన్ స్పైవేర్ హ్యాకింగ్ ఉదంతాన్నే చూద్దాం. ఆ నిఘా పరికరాలు ప్రైవేటు వ్యక్తుల,సంస్థలకు ఇవ్వబోమని ఆ కంపెనీ పదే పదే చెబుతున్నది. నిఘాకు గురైన వారు ఎక్కువగా ప్రతిపక్షంలో వారు, వ్యవస్థలోని అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు, కొందరు అధికార పక్షానికి చెందిన వారు కూడా ఉన్నారునుకోండి.

ఇంత పెద్ద వివాదం తలెత్తినపుడు ఆదర్శ రామరాజ్యాన్నినిర్మిస్తామని ప్రజలకు పదేపదే చెప్పిన,చెబుతున్న వారి నుంచి సమాజం సహజంగానే శీల పరీక్షను ఆశిస్తుంది కదా. అదేమీ అభ్యంతరకరమైనది కాదు కదా. అగ్నిలోకి దూకెయ్యమని కోరడం లేదు కదా.జరిగిందని చెబుతున్న/ భావిస్తున్న/ ప్రచారంలో ఉన్న/ అమ్నెస్టీ ల్యాబ్ నిర్దారించిన హ్యాకింగ్ పై నిజ నిర్ధారణ  జరిపించడానికి వెనకాడడమెందుకు?అభ్యంతరం ఎందుకు? తప్పు చేయనపుడు, దానిలో తమ పాత్రే లేనపుడు శీల పరీక్షకు వెనకాడడం ఎందుకు? నిజాయితీ నిరూపణకు సిద్ధపడడం లేదేందుకు?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!