A celebrity that even VIPs recognize………………………………..
డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. 43 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా తిరుమల శ్రీవారి సేవలో తరించారు. శేషాద్రి అంటే ఎవరికి తెలీదు. డాలర్ శేషాద్రిగా ఆయన పాపులర్ అయ్యారు.
అసలు డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది అంటే … నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్‌ను ధరించడం కారణంగా ఆయన పేరు పక్కన డాలర్ తగిలించారు. కొన్నాళ్ళు శ్రీవారి బొమ్మ ఉన్న డాలర్ల అమ్మకాలు ఆయన చేతి మీదుగా జరిగాయి. అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. డాలర్ ఆయన మెడలోకి రావడం వెనుక కూడా కథ ఉంది.
డాలర్ శేషాద్రి పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నలభై ఏళ్ల క్రితం ఓ జ్యోతిష్యుడు నా జాతక చక్రం ప్రకారం పొట్టేలు బొమ్మ కలిగిన డాలర్‌ను ధరించాలని చెప్పారు.
శ్రీవారి ఆలయంలో పనిచేసే నేను మెడలో జంతువు బొమ్మను ధరించడం సరికాదన్నా. ఆ శ్రీవారే జంతువులను ఆధారంగా చేసుకుని ఉన్నారని జ్యోతిష్యుడు చెప్పడంతో నాటి నుంచి డాలర్ ధరిస్తున్నాను.. ఇది గమనించిన మీడియా ప్రతినిధులు నా ఇంటి పేరు పాల శేషాద్రి నుంచి డాలర్ శేషాద్రిగా మార్చేశార”ని ఆయన వివరించారు.
ఇక టీటీడీలో డాలర్ శేషాద్రికి ఎంతో పేరు ఉంది. దేవస్థానంలో సాధారణ గుమాస్తాగా చేరారు. అనతికాలంలోనే స్వామి వారి కైంకర్యాల నిర్వహణలో పట్టు సాధించారు. 2007 లో బొక్కసం ఇన్‌ఛార్జిగా పదవీ విరమణ చేశారు. ఆ నాటి నుంచి ఆలయ ప్రత్యేకాధికారిగా కొనసాగారు. శ్రీవారి ఆలయం, కైంకర్యాలు, స్వామి వారి ఆభరణాల గురించి శేషాద్రికి తెలిసినంతగా.. ఇంకెవ్వరికీ తెలియదంటారు.
అందుకే రిటైర్ అయి పద్నాలుగేళ్ళు దాటినప్పటికీ ఆయన సేవలను ఉపయోగించుకుంటున్నారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఆయనకు అందరూ పరిచయం. చొచ్చుకుపొయే స్వభావం కావడంతో ఎంత పెద్ద వారైనా కలిసి మాట్లాడేవారు.
విఐపీలు ఆయనను గుర్తిస్తారు. పలకరిస్తారు. కొందరు విఐపీలు అయితే పాదాలకు నమస్కారం కూడా చేస్తారు. డాలర్ శేషాద్రిని వెంకన్న ప్రతినిధిగా భావించి ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. వీఐపీలు ఎవరూ వచ్చినా శేషాద్రి దగ్గరుండి దర్శనాలు చేయిస్తుంటారు.గతంలో ఒకసారి శేషాద్రిని తిరుమల నుంచి బదిలీ చేశారు. తర్వాత టీటీడీ బోర్డు పై వీవీఐపీల నుంచి ఒత్తిడి రావడంతో ఆ బదిలీ ఆర్డర్ ఉపసంహరించుకున్నారు. అది డాలర్ శేషాద్రి పలుకుబడి.
శేషాద్రి వివాహితులే కానీ సంతానం లేరు. కుటుంబం తిరుపతిలో ఉంటుంది.ఈయన కుటుంబానికి కూడా దాదాపు దూరంగా ఉంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వెనక వైపున్న గోవింద నిలయంలోని చిన్న గదిలో శేషాద్రి ఉండేవారు. ఆయన సుమారు 18గంటలు గుడిలో ఉండేవారు . కేవలం కాసేపు నిద్రించడానికి తన గదికి వెళ్లేవారు. ఆయన 2021 లో నవంబర్ 29 న కన్నుమూశారు.