హిమ కుండ్ యాత్ర –అరుదైన అనుభవం !!

Sharing is Caring...

 కాశీపురం ప్రభాకర్ రెడ్డి……………………….

హిమకుండ్ ….   మానస సరోవరం కన్నా ఎత్తులో ఉన్న సరస్సు… జీవితం లో ఒక్కసారైనా మునక వేయాలని ప్రతి సిక్కు జాతీయుడు కలలుగనే  పరిశుద్ధ జల కొలను… హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మణ్ గంగ నది జన్మస్థానం.. .హిమకుండ్ గా పిలవబడే మంచు గుండం దర్శించాలని ఎవరికుండదు..?

ఏడాదిలో 8  నెలలు మంచుతో ఘనీభవించబడి కేవలం 4 నెలలు మాత్రమే మంచి నీటితో దర్శనం ఇచ్చే ఈ హిమకుండ్ చేరాలంటే ఆషామాషీ కాదు. సముద్ర మట్టానికి 15200 అడుగుల ఎత్తులో  7 పర్వత శిఖరాల మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాంతానికి చేరడం ప్రొఫెషనల్ పర్వతారోహకులకు తప్ప అన్యులకు సాధ్యమయ్యేది కాదు.ఈ సరస్సు ఒడ్డున హిమకుండ్ సాహిబ్ పేరుతో  నిర్మించబడిన సిక్కుల గురుద్వారా వల్ల ఇది పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది.

సిక్కులకు పుణ్యస్థలం ఎందుకంటే?

హిమకుండ్ సరస్సు సిక్కులకు పుణ్యస్థలం ఎందుకు అయిందంటే.. సిక్కుల 10 వ మత గురువైన గురు గోవింద్ సింగ్ పూర్వ జన్మ లో ఇక్కడ తపస్సు చేసినట్లు నమ్ముతారు. దీంతో భక్తులు ఆయన పేరుతో ఒక చిన్న గురుద్వారా ( ప్రార్థనా మందిరం)ఏర్పాటు చేసుకున్నారు.

1960 ప్రాంతం లో ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ హరికీరత్ సింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి గురుద్వారా ను అత్యంత ఆధునికంగా నిర్మించాడు. మొత్తం సిక్కు సమాజాన్ని మోటివేట్ చేసి .. ఎంతో క్లిష్టమైన  ఈ పర్వతం పైకి చేరేందుకు నడక మార్గాన్ని కూడా నిర్మించాడు.

అప్పటినుంచి ఇక్కడికి పర్యాటకుల తాకిడి .. ముఖ్యంగా సిక్కు భక్తుల సందర్శన పెరిగి పోయింది.  ప్రతి వర్షా కాలంలో ఈ మార్గం పాడవుతూనే ఉంటుంది. దీన్ని బాగు చేయడం నిరంతర కార్యక్రమం గా ఉంటుంది. సిక్కులు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోడ్డు రిపేర్ల పనిలో పాల్గొంటారు. దీనిని కరసేవ అంటారు. ఈ కరసేవ కోసం ముందుగానే తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటారు.

ఇది ప్రపంచం లోనే అతి ఎత్తైన ప్రదేశం లో నెలవైన గురుద్వారా ఇదొక్కటే కావడం విశేషం. .ఘంఘరియా నుంచి ఈ మార్గం గుండా 5000 అడుగుల పైబడిన ఎత్తుకు (5.5 km) ట్రెక్కింగ్ చేస్తేనే హిమకుండ్ చేరుకోగలం.. తిరుమల కొండను 3 సార్లు ఎక్కినంత కఠినంగా ఉంటుంది.

పర్వతం ఎక్కలేని వారికోసం శిక్షణ పొందిన గుర్రాలు సిద్ధంగా ఉంటాయి.  పైకి తీసుకు వెళ్ళి తిరిగి కిందకు చేర్చేందుకు 3000 రూపాయలు తీసుకుంటారు.ఈ సరస్సు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఇక్కడి వాతావరణం సంక్లిష్టంగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.ప్రతి ఏటా 150000 మంది హిమకుండ్ వస్తారు.హిమకుండ్ దర్శనం చేసుకున్న పర్యాటకుల్లో మూడో వంతు అంటే 50000 పైగా Altitude sickness కు గురై ఇబ్బందులు పడ్డారని   తాజా సర్వే లో తేలింది.

Mountain sickness వల్ల మా బృందంలో ఇద్దరు గదికే పరిమితం అయ్యారు.నేను, గోపవరం పుల్లయ్య యాదవ్ మాత్రం వెళ్లేందుకే సిద్ధమయ్యాము. ఉదయం 7 గంటలకు మా క్యాంపు నుంచే గుర్రపు స్వారీ ప్రారంభించాం.ఇక్కడ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత వేసవి కాలంలో కూడా మైనస్ 5 డిగ్రీలకు పడిపోతుంది. పగటి వేళల్లో కూడా ఉన్నట్టుండి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అందుకే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పర్యాటకులను అనుమతించరు.

గుర్రాలపై సవారీ కూడా అంత సులభం కాదు. మైదానం కాదు కదా..! పైకి వెళ్ళి వచ్చేసరికి శరీరం కుదేలైపోతుంది. ఫిట్నెస్ మెయింటైన్ చేసేవారికి ఓకే.. నడుము నొప్పి  ఉన్నవారు గుర్రాలు ఎక్కడం, ట్రెక్కింగ్ చేయడం వంటివి చేయకూడదు. నా స్వీయానుభవంతో కూడిన సిన్సియర్ సలహా ఇది.
.
హిమకుండ్ నుంచి పుష్పవతి నది వరకు కిందకు దుముకుతూ వచ్చే లక్ష్మణ్ గంగ నది పక్కనే మనం వెళ్ళే మార్గం ఉంటుంది. ఈ నది హోయలతో పాటు లోయ చుట్టూ చూడటానికి ఎంతో బాగుంటుంది. హిమకుండ్ వెళ్ళే మార్గం వెంట అనేక పుష్ప వనాలు ఉన్నాయి.

ఇవి అన్నీ సహజ సిద్ధంగా పెరిగినవే. పైకి వెళ్ళే కొద్దీ. లోయ కిందకు చూస్తే.. ఘంఘరియా గ్రామం..
ఆ పక్కనే ప్రవహిస్తున్న పుష్పవతి నది .. ఒక విజువల్ వండర్ గా చెప్పొచ్చు.  ముఖ్యంగా valley of the flowers కు వెళ్ళే లోయ చుట్టూ కమ్ముకున్న మేఘాల దృశ్యం ఈ హిమకుండ్ నుంచి చూసే తీరాలి. మా అదృష్టం కొద్దీ ఈ రోజు సూర్యుడు బాగా ప్రకాశించడంతో మా పర్యటన నేత్ర పర్వంగా సాగింది.

కనిపించని కమలం
సిక్కులు సరే.. వారి ఆధ్యాత్మిక విశ్వాసం మేరకు ఈ కఠిన యాత్ర కు మానసికంగా సిద్ధమై వస్తారు. మరి నా మాటేమిటి..? ఇంత సంక్లిష్టమైన హిమకుండ్ కు నన్ను మళ్లించిన శక్తి ఏమిటంటారు..? హిమాలయాలకే పరిమితమైన ఒక అరుదైన పుష్పాన్ని చూడాలనే ప్రగాఢమైన కోరిక వల్లనే… అది valley of flowers లో కూడా పుష్పించదు.

దాని పేరు బ్రహ్మ కమలం..ఈ పుష్పానికి ఉన్న పురాణ ప్రశస్తి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా దీన్ని ప్రకటించారు.అది పుష్పించే అరుదైన పర్వతాల్లో ఈ హిమకుండ్ ఒకటి. హిమకుండ్ సరస్సు సమీపంలో ఈ కమలాలను చూడటం అద్భుతమైన అనుభూతి గా చెప్పుకుంటారు.

హిమకుండ్ లో బ్రహ్మ కమలాలు చూడొచ్చు అని మా గైడ్ కూడా నమ్మకం గా చెప్పాడు. అయితే జూలై ఆగస్టు మాసాల్లో మాత్రమే ఇవి పుష్పిస్తాయని మేం అక్కడికి చేరుకున్నాకే తెలిసింది.హిమకుండ్ నుంచి మరో 300 అడుగులు పైకి ట్రెక్కింగ్ చేస్తేనే బ్రహ్మ కమలాల వనాన్ని చూడగలం. అయితే అవి వికసించే సీజన్ ముగిసిందని ఆ దారి మూసివేసినట్లు ఇక్కడి గార్డ్ చెప్పటం తో తీవ్రంగా నిరుత్సాహం వేసింది.

అయితే, పర్వత శిఖరాల మధ్యలో ఈ స్వచ్ఛమైన సరస్సు మాత్రం మమ్మల్ని మురిపించింది. ఈ నీటిలో పర్వత శిఖరాలు, వెండి మబ్బులు ప్రతిబింబించటం అరుదైన మనోహర దృశ్యం. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ , ఉదయం 9.30 గంటలకు కూడా 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటం విశేషం.

ఈ సరస్సు నీటిని ముట్టుకుంటే రక్తం గడ్డకట్టి పోయేలా ఉంది. అయినప్పటికీ కొందరు సిక్కులు పవిత్ర స్నానాల పేరుతో ఇందులో  మునకలు వేయడం ఇంకా పెద్ద విశేషం. హిమకుండ్ వచ్చిన ప్రతి యాత్రికుడికి గురుద్వారా నిర్వాహకులు కిచిడి ప్రసాదం పెడతారు. వేడి వేడి గా ఈ కిచిడి ని ఈ చల్లని ప్రదేశం లో తినడం అన్నిటికన్నా మంచి అనుభవం.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!