హే రాజన్ ఏమిటిది ??

Sharing is Caring...

చిత్రం లో కనిపించే వ్యక్తి పేరు పద్మరాజన్ . తమిళనాడు లోని ధర్మపురి కి చెందిన వ్యక్తి . చూడటానికి సామాన్యుడిలా కనిపిస్తాడు కానీ గట్టోడే. ఎవరైనా గెలవడం కోసం పోటీ చేస్తారు . ఓటమి కోసమే పోటీ చేసి వాళ్ళు అరుదు . ఆ అరుదైన వ్యక్తుల్లో   పద్మరాజన్ ఒకరు. 
రాజన్ ఇప్పటి వరకు 174 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.వినడానికి ఆ మాట నమ్మశక్యంగా లేకపోయినా అది ముమ్మాటికీ నిజం. పోటీ చేసింది సామాన్యులపై కాదు. పీవీ.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ ,కె ఆర్ నారాయణన్ ,జయలలిత , వైఎస్ రాజశేఖరరెడ్డి ,కరుణానిధి , ఏకే ఆంటోనీ,నరేంద్ర మోడీ వంటి ప్రముఖులపైనే. గెలుస్తాడని ఆయనకు నమ్మకం లేకపోయినా పోటీ చేసి ఓడిపోవడమే ఆయన కోరుకుంది. పైకి పద్మ రాజన్ ఎన్నికారణాలు చెప్పినా  ఐడెంటిటీ క్రైసిస్ ఇందుకు ప్రధాన కారణమనే విమర్శ లేకపోలేదు.   గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాలనుకున్నాడు .మొత్తానికి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో కెక్కి తాను అనుకున్నది సాధించాడు.  1988 నుంచి పద్మరాజన్ ఎన్నికల్లో పోటీ చేయడం మొదలు పెట్టాడు. వరుసగా రెండు చోట్ల … మూడు … ఐదు చోట్లా పోటీ  చేసేవాడు. ఒక్కసారి కూడా ఒక ఓటరు దగ్గరికి వెళ్లి ఓటు వేయమని అడగలేదు. అసలు ప్రచారమే చేయలేదు. అదొక పాలసీగా పెట్టుకున్నాడు. ప్రజలు సానుభూతి తో వేసే ఓట్లు కూడా తనకు అవసరం లేదు అనేవాడు . 
పద్మరాజన్ 1991 లో నంద్యాల ఉపఎన్నికలో పీవీనరసింహరావు పై పోటీ చేసి ప్రమాదంలో చిక్కుకున్నాడు.  ఆ ఎన్నిక కు సంబంధించి నోటిఫికేషన్ రాగానే మొదటిరోజే  నామినేషన్ వేసి వస్తుండగా పద్మరాజన్ ను  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలే అలా చేసారని పద్మ రాజన్ అనుమానం. అప్పటివరకు వేరెవరూ నామినేషన్ వేయలేదు. ఆ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కాంగ్రెస్ భావించింది. కానీ ఆలా జరగలేదు.  తర్వాత బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేశారు.  మొత్తానికి  ఆ దుండగుల కళ్ళు గప్పి  పద్మ రాజన్  ఆ ప్రదేశం నుంచి తప్పించుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.  అప్పటి ఉప ఎన్నికలో పీవీ దాదాపు ఐదు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ తో గెలుపొందారు. 96 లో జరిగిన ఎన్నికల్లో కూడా నంద్యాల నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఆ సంఘటనతో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలాఉంటాయో పద్మ రాజన్ కి అర్ధమైంది.
టైర్లకు పంచర్లు వేసే షాపును నిర్వహించిన  పద్మరాజన్ హోమియో డాక్టర్ గా కూడా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పిచ్చితో దాదాపు 25 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యేవి. అయినా కూడా వెనుకాడ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలను ఎత్తి  చూపేందుకు తాను అన్ని ఎన్నికల్లో పోటీ చేశానని పద్మ రాజన్ గర్వంగా చెప్పేవారు.
2011 లో  దక్షిణ తమిళ నాడు లో సొంత నియోజక వర్గం మెట్టూరు లో పోటీ చేసినపుడు రాజన్ కి 6273 ఓట్లు వచ్చాయి . దాంతో అతని నమ్మకం పెరిగింది. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదని డిపాజిట్లు పోగొట్టుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసాడు.  అన్నట్టు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో  రాజన్ కి స్ఫూర్తి జోగీందర్ సింగ్. ఈయన 300 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారట. 1998 లో జోగీందర్  కాలం చేశారట.
పద్మ రాజన్  ఒకేసారి ఐదురారు  నియోజకవర్గాల్లో నామినేషన్ వేయడం గమనించిన ఎన్నికల కమీషన్  అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసే విషయం లో నిబంధనలు మార్చింది. ఆ క్రెడిట్ పద్మరాజన్ దే .  96 ఎన్నికల్లో పద్మరాజన్  5 రాష్ట్రాల్లో 8 లోకసభ ,5 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నామినేషన్లు వేశారు . ఇది గమనించి ఎన్నికల కమీషన్  నిబంధనలు మార్చింది. ఒక అభ్యర్థి ఎన్నికలో రెండు చోట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకూడదనే నిబంధన విధించింది.పోటీ చేసే అభ్యర్థిని  తప్పనిసరిగా 10 మంది సపోర్ట్ చేస్తూ అతగాడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలనే నియమం పెట్టింది. దీంతో పద్మ రాజన్ వెనక్కి తగ్గాడు.  తన సొంత రాష్ట్రానికే పరిమితమైనాడు
మొత్తం మీద 2016 వరకు 174 సార్లు పోటీ చేసి వార్తల్లో కెక్కారు. 

——  KNMURTHY 

 

 

 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. DRKREDDY October 1, 2020
error: Content is protected !!