Another actor who is not supported by Tamil voters …………………..
మురళి కార్తికేయన్ ముత్తురామన్..ఒకప్పటి స్టార్ హీరో .. సీతాకోక చిలుక ‘అన్వేషణ’, ‘అభినందన’, ‘గోపాలరావు గారి అబ్బాయి’ వంటి తెలుగు సినిమాల ద్వారా పాపులర్ అయిన తమిళ హీరో.. తెలుగులో చేసింది కొన్నిసినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయిన నటుడు.
‘అభినందన’ సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. తమిళంలో బిజీగా ఉండటంతో తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేయలేకపోయాడు కార్తీక్. ఆయన గాయకుడు కూడా .. అపుడపుడు పాటలు కూడా పాడేవాడు.
కార్తీక్ 1960 సెప్టెంబర్ 13న చెన్నైలో జన్మించాడు.ఆయన తండ్రి ఆర్ ముత్తురామన్ మంచి నటుడు. ఆయన నుంచే నటనను వారసత్వంగా పుచ్చుకున్నాడు. అలైగళ్ ఒవతిల్లై(1981) అనే తమిళ చిత్రంతో కార్తీక్ సినీ కెరీర్ మొదలయింది.అందగాడైన కార్తీక్ కి తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. స్వల్ప కాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు.
‘సీతాకోక చిలుక’ సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు.’అన్వేషణ’ తో తెలుగులో కూడా డిమాండ్ పెరిగింది. అయితే తమిళ్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చే వాడు.
సినిమాల్లో స్థిరపడ్డాక తనతో నటించిన హీరోయిన్ రాగిణితో ప్రేమలో పడ్డాడు.1988లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అని ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్ల తర్వాత రాగిణి సోదరి రతి ని కూడా పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరి వివాహంపై రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి.
రెండో పెళ్లి ద్వారా ఒక అబ్బాయి కూడా పుట్టాడు. రెండో వివాహం చేసుకుని కార్తీక్ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. రాగిణి కార్తీక్ ని వదిలేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అదే సమయంలో ఇతర వ్యసనాలకు బానిస అయ్యాడని అంటారు.ఈ క్రమంలో కెరీర్ మెల్లగా కుంటుపడింది.
2000వ దశకం నుంచి కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గిపోయింది. తర్వాత విలన్ వేషాలు కూడా వేసాడు.అయినా అంతగా ఆఫర్స్ రాలేదు. కార్తీక్ 125 కి పైగా చిత్రాలలో నటించారు. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు,ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.
తర్వాత రాజకీయాల్లోకి దిగి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. 2006లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరాడు. పార్టీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఎందుకో అక్కడ నచ్చక 2009 లో సొంతంగా ‘నాదలమ్ మక్కల్ కచ్చి’ అనే పార్టీ పెట్టాడు.
ఎన్డీయే కూటమిలో చేరారు.. తేని ,విరుద్ నగర్ లోకసభ స్థానాలకు పార్టీ పోటీ చేసింది. విరుద్ నగర్ లో కార్తీక్ స్వయంగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేక పోయాడు. కార్తీక్‌కు కేవలం 17వేల 336 ఓట్లు మాత్రమే వచ్చాయి.నాలుగో స్థానం లో నిలిచాడు.
తర్వాత అనారోగ్య కారణమంటూ ఆ పార్టీ ని రద్దు చేసి 2018లో మరో పార్టీని స్థాపించాడు.అది కూడా ఓటర్లపై ప్రభావం చూపలేకపోయింది. ఏఐఏడీఎమ్‌కే కూటమికి తన మద్దతును ప్రకటించాడు. ఏంచేసినా రాజకీయ ప్రయత్నాలు కలసి రాలేదు.
ఈయన కుమారుడు గౌతమ్ కార్తీక్ కూడా నటుడే. మొదటి భార్య రాగిణి కుమారుడు. గౌతమ్ తొమ్మిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. గౌతమ్ ఊటీలో తన తల్లితో పెరిగాడు, గౌతమ్ 2013లో ‘కడల్’ సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
‘దేవరట్టం’ సినిమాలో తనతో కలిసి నటించిన కోలీవుడ్ హీరోయిన్ మంజిమా మోహన్ ని ప్రేమించి 2022 నవంబరు 28న వివాహం చేసుకున్నాడు.గౌతమ్ సినీ కెరీర్‌ను ప్రారంభించడంలో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు.
తమిళ సినిమాల్లో తన కొడుకు ప్రయాణానికి ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ తండ్రీకొడుకులు “మిస్టర్ చంద్రమౌళి” చిత్రంలో కూడా కలిసి నటించారు.ఇందులో కార్తీక్ గౌతమ్ తండ్రిగా నటించాడు.