ఉక్రెయిన్ vs రష్యా వార్ =భారీ ప్రాణ నష్టం!

Sharing is Caring...

ర‌ష్యా ఉక్రెయిన్ పై చేస్తోన్న భీకర దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈ ప్రతిఘటనలో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ మ‌ర‌ణించిన‌ట్లు నెక్ట్సా మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇరు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌ను ఉక్రెయిన్ హ‌త‌మార్చింద‌ని అంటున్నారు.అయితే ఈ విషయాన్నీ రష్యా ఇంకా ధ్రువీకరించలేదు. ఇరువర్గాల పోరులో రోజూ వందలాది మంది సైనికులు, ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతవారం రోజులుగా కొనసాగుతోన్న భీకర యుద్ధంలో ఉక్రెయిన్‌ సైనికుల చేతిలో ఇప్పటివరకు 9వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మృతి చెందిన సైనికుల దేహాలను రష్యా హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నది.

లెక్కలను బట్టి చూస్తుంటే ఉక్రెయిన్ బలాన్ని రష్యా తక్కువగా అంచనా వేసిందని భావించాలి.
ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులకు పాల్పడుతున్న రష్యా సేనలు కొన్నిచోట్ల పైచేయి సాధించినప్పటికీ పెద్ద స్థాయిలో రష్యాయే సైనిక, ఆయుధ నష్టాలను చవిచూస్తోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ అంటోంది.

ఉక్రెయిన్‌ ప్రతిఘటనలో 217 యుద్ధ ట్యాంకులు, 900 సాయుధ శకటాలు 374 యుద్ధ వాహనాలు, 90 ఫిరంగులు, 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, వందల సంఖ్యలో ఇంధన ట్యాంకులు ధ్వంసం అయినట్టు వార్తలు వస్తున్నాయి.కాగా రష్యా సమాచారం భిన్నంగా ఉంది.ఇప్పటివరకు 498 మంది రష్యా సైనికులు మరణించగా 1597 మందికి గాయాలైనట్లు చెబుతోంది.

ఉక్రెయిన్‌కు చెందిన 2870 మంది సైనికులు తమ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా అంటోంది. రష్యా భీకర దాడుల్లో ఇప్పటికే 2వేల మంది సామాన్యప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ చెబుతోంది. మొత్తం మీద ఇరుదేశాల మధ్య జరుగుతున్నయుద్ధంలో వేల సంఖ్యలో అటు సైనికులు ఇటు ప్రజలుప్రాణాలుకోల్పోతున్నారు.

ఆర్ధిక ఆంక్షలతో విసిగిపోయిన పుతిన్ ఆదేశాలతో దాడులను ముమ్మరం చేసిన రష్యా దళాలు ఖేర్సన్‌ నగరంపై పట్టు సాధించాయి. ఏది ఏమైనా పుతిన్ అనుకున్నట్టు ఉక్రెయిన్ పై యుద్ధం అంత సులభంగా లేదు.కాగా ఇవాళ రెండో దశ చర్చలు జరగనున్నాయి.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!