హృదయాన్ని కదిలించే ఫోటో !!

Sharing is Caring...

Ramana Kontikarla………………..

Heart-wrenching …….. ………..

వంద మాటలు చెప్పలేనిది ఒక్క ఫోటో చెబుతుంది. ఫోటో గుండెను మెలిపెడుతుంది. కవ్విస్తుంది.నవ్విస్తుంది.ఆలోచింప జేస్తుంది.ఆవేదనకు గురి చేస్తుంది. అనుభూతినిస్తుంది. ఫోటో కి అంత పవర్ ఉంది.

రాసిన వాక్యాలను కావాలంటే రీ రైట్ చేసుకోవచ్చు.కానీ లైవ్ లో ఒక సీన్ మిస్ అయితే మళ్ళీ దొరకదు. అందుకే లైవ్ ఫోటోలకు అంత ప్రాధాన్యత ..ప్రత్యేకత ఉన్నాయి. కథలు కాలగర్భంలో కలిసి పోయినా… చరిత్ర ను మన ముందుంచేది  ఫోటో మాత్రమే.

పై ఫోటోవెనుక కూడా కనిపించని విషాదం దాగి ఉంది. అది 1945.. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పటి కాలం. జపాన్ లోని హిరోషిమా-నాగసాకి పై వేసిన బాంబుల ధాటికి ఆ నగరాలు ఇప్పటికీ కోలుకోలేకుండా పోయాయి. శిథిల భవనాలు ఓ చేదు చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిపోయాయి.

ఆ సమయంలో అమెరికా పెన్సిల్వేనియాకు చెందిన ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ ను యూఎస్ మిలిటరీ జపాన్ కి పంపాయి. అక్కడ ఆయన తీసిన ఫోటోలు… చిరకాలం ప్రపంచం మొత్తం మర్చిపోలేని ఫోటో జర్నలిస్ట్ గా గుర్తింపు పొందేలా చేశాయి.

ఇక అసలు కథలోకి వెళితే ……….

పదేళ్ల వయసున్న ఓ బాలుడు… తన వీపు భాగంలో ఒక బిడ్డను కట్టుకుని మోస్తున్న ఫోటో ఇది. జపాన్లో ఆ రోజుల్లో.. పిల్లలు వారికంటే చిన్నవారిని వీపుకి కట్టుకుని.. లేదా ముందు భాగంలో సంచీలాగా తగిలించుకుని తిరిగే దృశ్యాలు సర్వసాధారణం.

ఇపుడు అన్నిదేశాల్లో ఇలాంటి దృశ్యాలు విరివిగానే కనిపిస్తున్నాయి. అదే రీతిలోఓ పిల్లవాడు  కూడా కాస్తా భిన్నంగా ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ కంట పడ్డాడు. అతను వచ్చిన ప్రదేశం ఓ శ్మశానం. అతని ముఖం ఆందోళనకరంగా ఉంది. ఆవేదన ప్రస్ఫుటిస్తోంది. కాళ్లకు చెప్పుల్లేవ్.

తన వీపుకి నిద్రపోతున్నట్లుగా ఓ శిశువు తల సంచీలోంచి వేలాడుతూ కనిపిస్తోంది.అప్పటికే ఆ మరుభూమిలో ఓవైపు మారణహోమంలో అసువులు బాసినవారి దేహాలను దహనం చేస్తున్నారు. క్యూలైన్లలో చాలామంది నిల్చుని ఉన్నారు. వారిలో ఆ బాలుడొకడు.

కానీ ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ కు మాత్రం ఏదో అనుమానం కొడుతోంది. వెంటనే  కెమెరాతో  ఆ బాలుడి ఫోటో తీసాడు. ఇంతలో కాటికాపరులు వచ్చారు. ఒక వైపు బాంబుల మోతలు…మరోవైపు చనిపోయినవారి బంధువుల హాహాకారాలు. చీకటి కూడా దట్టంగా అలుముకుంటోంది. ఆ కాటి కాపరులు  బాలుడి వీపుకున్న సంచీ విప్పారు. అందులో విగతజీవిగా ఉన్న శిశువును తీసి..కట్టెలపై పెట్టి నిప్పంటించారు.

ఆ దృశ్యం చూడగానే శ్మశాన స్థలిలో ఎన్నో ఫోటోలను క్లిక్ చేసిన ఫోటో జర్నలిస్ట్ కళ్ళు చెమర్చాయి. ఆ యుద్ధంలో నా అన్నవాళ్లనందరినీ కోల్పోయి…కడకు తన సోదరుడి మృతదేహం కూడా కళ్లముందే దహనమైపోతుంటే… కదలకుండా నిటారుగా నిశ్ఛేష్ఠంగా నిలబడ్డాడు ఆ బాలుడు.

అతగాడి కళ్ళలో ఆ చితి మంటల తాలూకూ జ్వాలలు ప్రతిఫలించాయి. ఆ దృశ్యం చూడలేక తల తిప్పుకున్నాడు.. ఆ ఫోటో జర్నలిస్ట్. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాడు.అయినప్పటికీ తన వృత్తి ధర్మం నిర్వర్తించాడు.ఆయన తీసిన ఫోటోనే మీరు చూసింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!