friendly apporach ………………………………
కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య నిబద్ధత గల రాజకీయవేత్త. ఆయన మాట ఇస్తే తప్పే రకం కాదు. తొందరగా ఎవరికి మాట కూడా ఇవ్వరు. అలాగే ఏదైనా చేస్తానని చెబితే అది చేసి తీరే వారు.ఈ విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. కొంత మందికి వారు కోరిన పనులు చేసి పెట్ట లేదని కోపం కూడా ఉండొచ్చు. కొంతమందికి తనకు చెడ్డ పేరు రాకుండా తన పరిధిలో చేసిన పనులు కూడా లేకపోలేదు.
జర్నలిస్టులతో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. అన్నిజిల్లాల రిపోర్టర్లతో ఆయనకు పరిచయాలున్నాయి. కొత్త వాళ్ళు కనబడితే పరిచయం చేసుకునే వారు. 1999 నుంచి 2004 వరకు రోశయ్య గాంధీభవన్లో రోజూ ప్రెస్ మీట్లు పెట్టేవారు. మధ్యాహ్నం 12.30 కల్లా ప్రెస్ మీట్ మొదలయ్యేది. అధికారంలో కొచ్చాక అపుడపుడు సెక్రటేరియట్ లోనే విలేకర్లతో మాట్లాడేవారు.అప్పట్లో నేను రెగ్యులర్ గా గాంధీ భవన్ బీట్ చూసేవాడిని. అటు నుంచి సెక్రటేరియట్ కి వెళ్ళేవాడిని . అలా ఎన్నోసార్లు ఆయనను కలిసాను .. అడిగినప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు.
ఆయన ఆర్ధిక మంత్రిగా ఉండగా రెండు సార్లు ఆయనను ప్లాన్ ఇండియా ఎన్జీవో నిర్వహించిన కార్యక్రమాలకు తీసుకువెళ్లాను. ఒకటి ఇందిరాగాంధీ ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. ప్లాన్ ఇండియా పిల్లలతో కలిసి పనిచేసే సంస్థ. చిన్నపిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేసే ఇంటర్నేషనల్ సంస్థ. ముందుగా వెళ్లి అపాయింట్మెంట్ అడిగితే ఒకే అన్నారు. ఖచ్చితంగా వస్తానని హామీ ఇచ్చారు. అలాగే వచ్చారు.
రెండో సారి అదే సంస్థ వాళ్ళు నెక్లెస్ రోడ్ లో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి కూడా వెళ్లి పిలిచాను. ఆయన కార్లోనే కూర్చొని సభా స్థలానికి తీసుకెళ్ళాను. దారి మధ్యలోనే ఆయన “నేను అరగంట మాత్రమే ఉంటాను. మధ్యాహ్నం 1.30 దాటితే ఉండ”నని స్పష్టంగా చెప్పారు. ముందురోజే సంస్థ గురించి అడిగారు. కారులో వెళ్ళేటపుడు ప్లాన్ కార్యక్రమాలు వివరించాను.ఒకటి రెండు సందేహాలు వ్యక్తం చేశారు. క్లారిటీ ఇచ్చాను.
ఆయన ఏకసంథాగ్రాహి .. ఏవిషయమైనా సులభంగా గ్రహిస్తారు .. గుర్తుంచుకుంటారు. ఆయన జ్ఞాపక శక్తి కూడా అమోఘం. సభలో అద్భుతంగా మాట్లాడారు. ముందే చెప్పినట్టు టైమ్ చూసుకుని వేదిక దిగారు. సీఎం అయినపుడు ఒకసారి మాత్రమే కలిసాను. తర్వాత కాలంలో వయసు పెరిగిన రీత్యా జ్ఞాపక శక్తి కొంచెం తగ్గింది. అమీర్ పేట్ లో రోశయ్య గారింటికి రెండు గల్లీల ఇవతల మేముండే వాళ్ళం. రెండు మూడు సార్లు నేను సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ వెళ్లి కలిసాం. అంతే.. మళ్ళీ కలవలేదు.
——-KNMURTHY