An unstoppable leader………………………………….
ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్ గ్వెమా ఎంబసోగో (Teodoro Obiang Nguema Mbasogo) నాలుగు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ రికార్డుల కెక్కారు. ఒక విధంగా ఇది ప్రపంచ రికార్డు అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నాలుగు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా సేవలందిస్తున్న నేతగా ఒబియంగ్ కొత్త చరిత్ర సృష్టించారు.
ఇటీవల జరిగిన ఎలక్షన్ లో 80 ఏళ్ల ఒబియంగ్ 95 శాతం ఓట్లు అంటే దాదాపు 4,05,910 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఒబియంగ్ మరో ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగుతారని ఎలక్టోరల్ కమిషన్ ప్రకటించింది. బలమైన పాలకుడిగా పేరు సంపాదించుకున్న ఒబియంగ్ మరోమారు విజయం సాధించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలిస్తున్న అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.
1.5 మిలియన్ల జనాభా కలిగిన ఈ మధ్య ఆఫ్రికా దేశంలో చమురు పుష్కలంగా లభిస్తుంది. అధికార డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా (PDGE), సంకీర్ణ కూటమి కలిసి సెనేట్లో 55 స్థానాలు, దిగువ సభ చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ లో 100 స్థానాలు గెలుచుకుంది. దీంతో PDGE తిరుగులేని రాజకీయ పార్టీ గా సత్తా చాటుకుంది.
ఒబియంగ్ 1979 లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత పలు మిలటరీ తిరుగుబాట్ల నుంచి ప్రభుత్వాన్ని రక్షించుకున్నారు. ఈక్వటోరియల్ గినియాలో మీడియాను ప్రభుత్వం నియంత్రిస్తుందన్న ఆరోపణలున్నాయి.
అలాగే, నిరసనలను అణచివేస్తుందని, రాజకీయ ప్రత్యర్థులను తరచూ అరెస్ట్ చేసి హింసలకు గురిచేస్తుందని వార్తా కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం మరణశిక్షను రద్దు చేసి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది.
సైనిక పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాక ఒబియాంగ్ తన మేనమామ ఫ్రాన్సిస్కో మాసియాస్ న్గ్యుమా సారధ్యంలో పలు పదవులను చేపట్టాడు. 1979 లో జరిగిన సైనిక తిరుగుబాటులో మామ మసియాస్‌ను తొలగించాడు. సుప్రీం మిలిటరీ కౌన్సిల్ జుంటా అధ్యక్షుడిగా, ఛైర్మన్‌గా దేశాన్ని నియంత్రించాడు.
1982లో దేశం నామమాత్రపు పౌర పాలనలోకి వచ్చిన తర్వాత ఒబియాంగ్ 1987లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా (PDGE)ని స్థాపించాడు, ఇది 1992 వరకు దేశంలోని ఏకైక చట్టపరమైన పార్టీగా ఉంది.
తర్వాత కాలంలో ఇతర పార్టీలను గుర్తించారు. అయినప్పటికీ PDGE దే పైచేయి. ఒబియాంగ్ కుటుంబ సభ్యులు కీలక ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. ఒబియాంగ్ కుమారుడు ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు.