కథనం ………….. Subbu Rv ………………..
అతనో ….చిత్రకారుడు, చిత్రాకళోపాధ్యాయుడు, చిత్రకళా ఉపాసకుడు,చిత్రకళారాధకుడు, చిత్రగ్రాహకుడు,,చూడగలిగే కన్నులకు లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. పల్లె దారుల్లో, పచ్చని పైరుల్లో, కొండలోయల్లో, కూకూ పాటల్లో, పారే సెలయేరుల్లో, మంచు తెరల చాటుల్లో చేతులు చాచి ఆహ్వానిస్తూ నీ కోసం స్వాగతం పలికే ప్రకృతి లోకం ఒకటుంది.
ఎప్పుడూ కాంక్రీట్ గోడల్లో బందీ దేనికి అలా ఆకాశంలో ఎగిరే మేఘంలా గాలివాటంతోటి కదిలితే నువ్వు పొందలేని సంతోషం, సంతృప్తి ఎంతో నీ సొంతం. ఇంతలా ప్రకృతి నుండి స్వేచ్ఛగా ఎగిరే పక్షులనుండి స్ఫూర్తి పొందిన ఓ ప్రయాసకుడు, ప్రేమికుడు, ప్రయాణికుడు జి.శ్రీనివాస్ అలియాస్ “స్ఫూర్తి” శ్రీనివాస్, ఆర్టిస్ట్, ఆర్ట్ మాష్టర్, ఫోటోగ్రాఫర్, రైటర్, గ్రాఫిక్ డిజైనర్, డిజిటల్ క్రియేటర్,ఈవెంట్ మేనేజర్, ట్రావెలర్, నేచర్ లవర్, పిచ్చుకల ప్రేమికుడు
పేరులో శ్రీనివాస్ కి ముందు ఇన్నున్నాయి అంటే ఇదేదో ఆలోచించాల్సిందే. ఒక్కో మాటకు ఒక్కో కథనం తన జీవితంతో ముడిపడి ఉంది. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఏ పేరున పిలిచినా పలుకుతానంటూ సాగే శ్రీనివాస్ జీవితం ఓ వైవిధ్యం. వీడు తేడా రా బాబూ.. కిక్కు కోసం రిస్కు చేస్తాడు, మంచోడే కానీ మొండోడు, సక్కనోడు గానీ తిక్కలోడు, వీడు మాములోడు కాదంటూ మిత్రుల్లో వచ్చే మాటల సరదాతో తనంటే ప్రాణమిచ్చే వ్యక్తులను సంపాదించుకున్న వ్యక్తి కథనమే ఈ స్ఫూర్తికథనం.
రెండు అంశాలకు అతను జీవితం ముడిపడి ఉంది. ఒకటి చిత్రకళ రెండు పిచ్చుక. పొత్తిళ్ల పుణ్యం ఓ తల్లి అయితే యశోదమ్మ చాటు కన్నయ్యలా పెరిగింది మాత్రం భారతమ్మ ఒడిలో. బొమ్మలంటే గమ్ముగుండనక పిల్లాడు గోల చేస్తుంటే బొమ్మలేసి రోడ్డుమీద అర్ధరూపాయిలెక్క అడుక్కుంటావా అన్న తండ్రి మాటను దర్జాగా దాచి గంటల తరబడి బొమ్మలేయించి మురిసిన భారతమ్మ, వీడు గొప్పగా బొమ్మలేస్తాడు చూస్తుండు అని వేలు పట్టుకుని తీసుకొచ్చిన అన్న నర్రా శంకర్ ఈ ఇద్దరే తన ఆర్ట్ జీవితానికి ఓనమాలు.
నూనూగు మీసాల వయసులోనే ఆర్ట్ టీచర్ ఉద్యోగం సాధించి సబ్జెక్ట్ టీచర్ల కన్నా మేమేమి తక్కువకాదని నిరూపించి ఆర్ట్ టీచర్ల స్థాయిని పెంచి…కళ ఓ వారసత్వ సంపద ఎవరుబడితే వారు ఆర్టిస్ట్ కాలేరు, పల్లెటూరు నుండి వచ్చి ఈ పిచ్చిబట్టలతో నువ్వేం ఆర్టిస్ట్ అవుతావని అవమానించి.. ఆర్ట్ అంటే ఇకవారే అన్నట్లుగా చెప్పుకుంటున్న వారి చేత వాహ్వా అనిపించుకునే స్థాయిలో నిలబడి ఆశ్చర్యపరచిన ప్రతిభావంతుడు. ఈ ఆర్ట్ శ్రీనివాసుడు .
ఆర్ట్ వారసత్వ సంపదా..? ఇంకెవరూ ఆర్ట్ వేయకూడదా..? నేర్వకూడదా..? మధ్యతరగతి జీవితాన్ని వేలెత్తి చూపుతూ.. వేసుకున్న బట్టలను హేళన చేస్తూ.. ఆర్ట్ కి వంక పెడతారా అనే ఆలోచనలు రగిలాయి అవమానాలు రాజుకున్నాయి. తనలాగే ఆర్ట్ లో భంగపడ్డ కొందరి మిత్రులతో కలసి 1994 సంవత్సరంలో “సిరి” ఆర్ట్ అకాడెమీ పేరుతో ఆర్టిస్ట్స్ ఆర్ మేడ్ – నాట్ బోర్న్ అనే ట్యాగ్ లైన్ తో తోటి ఆర్టిస్టులంతా తమ నైపుణ్యాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఒక్కటై నడిచి ప్రయోజకులై మెరిశారు.
ఇదిలా ఉంటే ఓ ప్రణయం చిగురించింది. శ్రీనివాస్ జీవితం లో కి స్నేహా తన హస్తాన్ని అందించింది.కుంచెకు రంగు తోడైనట్టు భర్త అడుగుజాడల్లో మరింత ముందుకి నడిచి..ఆయన విజయాలకి తోడై నడిచారు భార్య స్నేహ శ్రీనివాస్.ఎంచుకున్న రంగం కోసం ఇంటినీ, ప్రేమించిన అమ్మాయి కోసం అన్నింటినీ అలవోకగా వదిలి జంటగా ఒంటరి ప్రయాణం మొదలెట్టారు.
ఆర్ట్ అందరికీ చేరాలనే ముఖ్య ఉద్దేశ్యంతో “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ని 2005 ఏప్రిల్ 15 స్థాపించారు. కళ వారసత్వ సంపద కాదూ, నేర్చుకోవాలన్న తపన., సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే ఆసక్తి ఉన్నవారెవరైనా కళాకారులుగా రాణించవచ్చునని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో “కళకి పునరుజ్జీవనం (Renaissance in the field of Art)” అనే క్యాప్షన్ తో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ను స్థాపించారు.
ఇద్దరు విద్యార్థులతో మొదలయ్యి వేల మంది విద్యార్థులకు ఆర్ట్ ని ఒక టూల్ గా వాడుతూ చిన్నారులకు శిక్షణనిస్తూ వారిలో Imagination, Observation, Creative స్కిల్స్ మెరుగు పరుస్తూ… జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుమతులు, యువ చిత్రకారులకు ఉపాధి, వివిధ స్థాయిలో చిత్రలేఖన పోటీలు, విద్యార్థులచే చిత్రకళా ప్రదర్శనలు, ఆర్ట్ వర్కుషాప్లు / సెమినార్లు, సామాజిక అంశాలపై ఈవెంట్లు, సీనియర్/యువ/చిన్నారి చిత్రకారులకు అవార్డులు సత్కారాలు ఇలా వందల్లో ఆర్ట్ ఈవెంట్స్, వేలల్లో విద్యార్థులను ఆర్ట్ టీచర్లుగా, గ్రాఫిక్ డిజైనర్లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా,ఆర్కిటెక్టులుగా, ఆర్టిస్టులుగా తయారు చేసి విజయవాడ చిత్రకళా చరిత్రలో ఒక రంగుల విప్లవాన్ని సృష్టించారు.