నాటక రంగంలో ఆయన ఓ సంచలనం !

Sharing is Caring...

Uppalapati venkata Rathnam …………………………………….

హరనాథరావు …. తెలుగు నాటక రంగంలో ఓ సంచలనం. ఓ ఉత్తుంగ తరంగం. అందరూ అంగీకరించే మాట అది. అతగాడు పుట్టింది గుంటూరు లో అయినా పెరిగింది .. చదివింది మా ప్రకాశం జిల్లా లోనే. హరి నా బాల్య మిత్రుడు.

నాటక రంగాన ఓ ప్రభంజనం సృష్టించిన ఖ్యాతి ఆయనది. 80 దశకంలో హరనాథరావు నాటకం ప్రదర్శిస్తున్నారంటే ఒక సంచలనం .. సంరంభం. ప్రయిజులన్నీ హరి లాక్కెళ్తారేమో అని పోటీ దారులు గుబులు పడేవారు. ఏ నాటకం పరిషత్ లో ప్రదర్శించినా అలాగే జరిగేది.

తెలుగు నాటక రంగంలో అక్షరాన్ని అగ్నికీల గా మార్చి పదునైన సంభాషణలతో ప్రేక్షకులను కదలకుండా కట్టి పడేసేవాడు. నాటకం మొదలైనప్పటినుంచి ముగిసే దాకా ప్రేక్షకులు అత్యంత శ్రద్ధతో నాటాకాన్ని చూసేవారు. హరి రాసిన నాటకాలు అలాంటివి మరి.

జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగరమథనం, జనారణ్యం యక్షగానం,బూచి, అంతం కాదిది ఆరంభం, లేడిపంజా, నైవేద్యం, జననీ జయహే,రెడ్ లైట్ ఏరియా వంటి నాటకాలు  హరి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినవే. 

వీటంన్నింటి కంటే హరనాథరావు ముందు రాసిన నాటిక రక్తబలి. ఒంగోలు శర్మ కాలేజీలో ఈ నాటికను మేము ప్రదర్శించాం. అప్పట్లో ఈ నాటికకే మొదటి బహుమతి కూడా వచ్చింది. ఈ నాటికలో నేనే హీరో ని. ఆమాట ఇప్పటికి నేను గర్వంగా చెప్పుకుంటాను.

ఒంగోలు పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ లో ఈ నాటిక రిహార్సల్స్ వేసే వాళ్ళం. అప్పటికే లబ్ధప్రతిష్ఠులు నవ్య కళాసమితి మొక్కపాటి కృష్ణమోహన్, తైలం లక్ష్మీనారాయణ గారు , సుబ్బయ్య, రచయిత కామేశ్వరరావు రిహార్సల్స్ చూడడానికి వస్తుండే వాళ్లు.

తైలం లక్ష్మీనారాయణ గారు డైలాగు డెలివరీ, మూమెంట్స్ , వేదిక మీద ఎలా నిలబడాలో మాకు వివరించేవారు. అప్పట్లో హరి నేను కలిసి వాహిని వారి పెద్ద మనుష్యులు సినిమా  చూసాం. మేము రెగ్యులర్ గా సెకండ్ షో లకు వెళ్తుండే వాళ్ళం.

రక్త బలి లో  కరణం పాత్రను  పెద్ద మనుష్యులు సినిమాలో కరణం పాత్రకు ధీటుగా చేసాడు మా నర్సింహయ్య. ఆర్ నాగేశ్వరరావు లాంటి విలన్ పాత్రను హరనాథరావే వేసాడు. అద్భుతంగా పోషించాడు. 

మిత్రులు  చెంగలశెట్టి శ్రీనివాసులు స్టేజి ని డెకరేట్ చేసేవాడు. ఇపుడు అయన మంచి చిత్రకారుడు. మ్యూజిక్ అందించిన ఐ వీ సుబ్బారావు  బ్యాంకులో ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాడు. ఎస్ ఐ పాత్ర చేసిన ఎన్వీఎస్ ప్రసాద్ రైల్వే లో ఆడిటర్ గా  చేసి రిటైర్ అయ్యాడు.

రక్త బలి నాటిక తర్వాత హరి కలం ఉదృతంగా సాగింది. ఒక రోజు సంతపేట లోని వెంకటేశ్వర థియేటర్ లో సెకండ్ షో చూసి వస్తున్నాం. ఆసమయం లో హరి  మాట్లాడుతూ ” ఒక గుడిలో దేవుడిని జనాలు సంకెళ్లు వేసి లాగుతున్న సన్నివేశం ” గురించి చెప్పాడు. చాలా సేపు దాని గురించే మాట్లాడుకున్నాం.

అదే కొన్ని రోజుల తర్వాత “జగన్నాథ రథచక్రాలు” గా నాటకం రూపుదిద్దుకుని సంచలనం సృష్టించింది. సమాజంలో కనిపించే వివిధ అంశాలను .. వాటి వెనుక దాగిన సత్యాలను హరి బాగా క్యాచ్ చేసేవాడు. అందుకే అతగాడి నుంచి మంచి నాటకాలు వచ్చాయి. హరితో చిన్నప్పటినుంచి తిరిగాను కాబట్టి .. అతని ఆలోచనా ధోరణి ఎలాంటిదో తెలుసు కాబట్టి  ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నా.    

 


 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!