Great Writer…………………………………………….
గొప్ప రచయిత .. సంఘ సంస్కర్త ఆయన పేరు ఉన్నవ లక్ష్మీనారాయణ.వందేళ్లు నిండిన నవల ‘మాలపల్లి’ ని రాసింది ఆయనే. రాయవేలూరు జైలులో ఉన్న సమయంలోనే ఆయన మాలపల్లి నవల రాశారు. సామాజిక స్పృహ గల ఒక గొప్ప రచయిత గా ఆరోజుల్లోనే గుర్తింపు పొందారు.
స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొని ఎన్నో సార్లు జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదల అయిన పిదప శారదా నికేతన్ పేరిట ఒక సంస్థను స్థాపించి వేలాది మంది స్త్రీ, బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించారు.
గాంధేయవాది అయిన లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా వేమూరు పాడు అనే చిన్న గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన పుట్టారు. శ్రీరాములు, శేషమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు.
సొంత గ్రామంలోనే ప్రాధమిక విద్య పూర్తిచేశారు.గుంటూరులో మెట్రిక్ చదివారు. రాజమండ్రిలో టీచర్ గా ట్రైనింగ్ కోర్సు చేశారు. కొంతకాలం తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి బారిష్టర్ డిగ్రీ చేసి వచ్చారు.ఇండియాకు వచ్చి కొన్నాళ్ళు గుంటూరు లో … మరి కొన్నాళ్ళు మద్రాస్ హైకోర్టు లో న్యాయవాదిగా చేశారు.
ఆ సమయంలోనే గాంధీజీ పిలుపు మేరకు, వృత్తిని వదిలేసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1892లోనే లక్ష్మీబాయమ్మ ను వివాహం చేసుకున్నారు. తర్వాత వితంతు శరణాలయాన్ని స్థాపించారు. వీరేశలింగం పంతులు గారి సారధ్యంలో తొలి వితంతు వివాహం జరిపించారు. గుంటూరు జిల్లా పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి ఉన్నవ నాయకత్వం వహించారు.
మరెన్నో ఉద్యమాలలో ఉన్నవ కీలక పాత్ర పోషించారు. బోల్షెవిక్ విప్లవం స్ఫూర్తి తో ఉన్నవ రచయిత గా మారారు. సాంఘీక, ఆర్థిక అసమానతల్ని తొలగింపే ఆశయంగా పనిచేసారు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని ఉన్నవ కోరిక. స్వేచ్ఛగా తన మనసులోని భావాలను ఆయన వెల్లడించారు. అంటరానితనం.. సంఘ దురాచారాలను ఎత్తి చూపుతూ మాలపల్లి నవల రాశారు.
ఈ నవల నాటి తెలుగువారి జీవన విధానానికి అద్దం పట్టింది. నాటి దురాచారాలు, వర్ణ, వర్గ వ్యత్యాసాలను కళ్ళకు కట్టినట్టు ఉన్నవ చిత్రీకరించారు. ఆ నవల ఆయన ను సాహిత్య వైతాళికులు గా గుర్తింపు పొందేలా చేసింది. ఉన్నవ 1958 సెప్టెంబరు 25న తుది శ్వాస విడిచారు.