ఆ “అడవి ” కథ తెలుసా ??

Sharing is Caring...

Dangerous Forest …………………………………..

దూరం నుంచి చూస్తే పచ్చటి చెట్ల తో ఆ అడవి అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే మటుకు భయం పుట్టేలా అక్కడ చెట్లకు శవాలు వేలాడుతూ కనిపిస్తుంటాయి. జంతువులు పీక్కు తినగా మిగిలిన కళేబరాలను చూడగానే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అక్కడ చెట్లకున్న ఉరి తాళ్లు గాలికి ఊగుతూ ఉంటాయి. 

కొంచెం ధైర్యం గల వాళ్లయితే ఫర్వాలేదు కానీ భయస్తులైతే పారిపోయి వెనక్కి వచ్చేస్తారు. అడుగు కూడా ముందుకు వేయలేరు. ఆ అడవి వాతావరణం ఆలా ఉంటుంది మరి. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారికి ఆ అడవి ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఎంతో మంది అక్కడ కొచ్చి చెట్లకు ఉరేసుకుని చని పోతుంటారు. 

ఈ అడవి జపాన్ దేశ రాజధాని టోక్యో కి దగ్గర్లో ఉన్న ఆవుకి గహార ప్రాంతంలో ఉంది. దీన్నే సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ప్రతి ఏటా ఈ అడవిలో ఎంతో మంది సూయిసైడ్ చేసుకుంటారు. ఆత్మహత్యలకు ఇది ప్రసిద్ధి గాంచిన అడవి. ఈ అడవి మొత్తం 35 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది.

పైకి చూసేందుకు ఎంతో అందం గా ..ఆకర్షణీయంగా ఉండే అడవిలోకి వెళితే ఒళ్ళు జలదరించడం ఖాయం. ఈ అడవిలో ఆత్మహత్యలు 1950 నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ చెట్లకు ఉరేసుకుని చనిపోతే పునర్జన్మ ఉండదనే నమ్మకం తో జీవితంలో నిరాశకు గురైనవారు .. వివిధ కారణాల వల్ల తనువు చాలించాలని భావించేవారు ఇక్కడ కొచ్చి చనిపోతుంటారు. వినడానికి ఈ మాటలు వింతగా ఉన్నప్పటికీ అదే నిజమని జపాన్ వాసులు  చెబుతుంటారు.

అయితే ఇది మూఢ నమ్మకమని అటవీ అధికారులు అంటున్నారు. ఈ మూఢ నమ్మకం వ్యాప్తి చెందకుండా … ఇటీవల కాలంలో ఎంతమంది చనిపోతున్నారో తెలియజేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ అడవిలోకి తరచుగా వాలంటీర్లు .. పోలీసులు వెళ్లి మృతదేహాల కోసం గాలిస్తుంటారు. దొరికిన మృత దేహాలను తీసుకొచ్చి కుటుంబం వివరాలు తెలిస్తే .. వారికి అప్పగిస్తారు. లేదంటే పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఆత్మహత్యలను నివారించడానికి పోలీసులు , ఎన్జీవోలు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ ప్రవేశ ప్రాంతంలోనే ” మీ ప్రాణాలు తీసుకునే ముందు మీ పిల్లల గురించి .. కుటుంబం గురించి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకోకండి.”అని రాసిన బోర్డులు పెట్టారు. అయినా ఆత్మహత్యలు తగ్గడం లేదు.ఇదిలాఉంటే చూడటానికి వెళ్లిన వాళ్ళు అడవిలో చిక్కుకు పోయి కూడా మరణిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు.

దట్టంగా ఉండే ఈ అడవిలోకి వెళితే బయటికి రావడం కూడా కష్టమే. అన్ని చెట్లు ఒకేలా కనిపిస్తాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. దిక్సూచి కూడా సరిగ్గా పనిచేయదని అంటారు. దిశలను తప్పుగా చూపిస్తాయట. అందుకే అడవిలోకి వెళ్లి ప్రాణాలతో బయటికి రావడం కష్టమేనని అక్కడి పోలీసులు అంటున్నారు. ఇక్కడి భూగర్భంలో అయస్కాంత లక్షణాలున్న ఇనుప ఖనిజాల కారణం గా అక్కడ సెల్ సిగ్నల్స్ .. దిక్సూచీలు పని చేయవు  అంటారు.

అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చే దారి తెలీక .. ఆకలి దప్పులతో .. మరోవైపు భయంతో చనిపోవడం వరకూ ఒకే … ఆత్మహత్యలకు కారణం ఏమిటి ? చెట్లకు ఉరి ఎందుకు వేసుకుంటున్నారనే అంశంపై పోలీసుల దగ్గర కూడా జవాబులేదు. 2003లో రికార్డు స్థాయిలో 105 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారట.

2018 వరకు ఈ అడవి గురించి నాగరిక సమాజానికి పెద్దగా తెలియదు. ఒక బాధితుడి మృత దేహాన్ని యూట్యూబర్ చిత్రీకరించి నెట్లో పెట్టారు. దాంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అడవి లోపలి భాగంలో ఒకప్పుడు లావా పొంగి ప్రవహించిందని కూడా అంటారు.

ఈ అడవిలోకి కొంత దూరం వరకు వెళ్లి వెనక్కి రావచ్చు. టూరిస్టులు వెళ్లి వస్తుంటారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2015 లో జపాన్‌లో ఆత్మహత్య రేటు 100,000 మందికి 15.4 గా ఉంది. ఈ సంఖ్య 2016 లో తగ్గింది, జపాన్ యొక్క ఆత్మహత్య రేటు ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగానే ఉంది.ఈ అంశంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. 

—————— KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!