గర్భ రక్షాంబిగై ఆలయం … ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయం తమిళనాడు లోని తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకా ‘తిరుకరుగవుర్’ లో ఉంది. కుంభకోణం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం రాజరాజచోళుని కాలంలో నిర్మితమైంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేనిప్పటివరకు చూసిన గుడులలో శిల్పరీత్యా కాకుండా నాకెంతో నచ్చిన గుడి ఇది.
ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఆడవాళ్ళకోసమే వెలసిన దేవత. పేరులోనే వున్నట్లు గర్భ ధారణ మొదలు ప్రసవం వరకు ఈ తల్లి చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం. గర్భిణీ స్త్రీ,ఆమె కడుపులోని బిడ్డకు అపాయం,జబ్బులు రాకుండా కాపాడుతుందని అంటారు. బిడ్డలు లేనివారికి సంతానప్రాప్తి కలుగజేస్తుందని, గర్భ స్రావం కాపాడుతుందని,సుఖప్రసవం అయ్యేటట్లు దీవిస్తుందని, గర్భ కోశ వ్యాధులు రాకుండా ఆడవారిని కాపాడుతుందని భక్తులు చెబుతుంటారు.
వేరే దేవాలయాలలో చూడని విధంగా ఈ గుడిలో ఎక్కడ చూసినా గర్బిణి స్రీలు,మొక్కులు తీర్చుకోవటానికి, రోజుల బిడ్డలతో వచ్చిన పచ్చి బాలింతలు,బిడ్డలకోసం మొక్కుకుంటున్న దంపతులు కనిపించారు.మేము వెళ్ళినపుడు రద్దీగా వున్నా”పెద్దల మనిషికి”అందరూ దారిస్తూ కనిపించారు.
గర్బిణి స్రీని పెద్దలమనిషి అనటం హోసూర్ ,తమిళనాడు లోని ఇంకా కొన్నిప్రాంతాలలో విన్నాను.అంతేగాకుండా బస్ లో నిండు మనిషి ఎక్కగానే సీట్ లేకపోతే కూర్చున్న వారు వెంటనే లేచి కూర్చోమని చెప్పటం చూసాను. చనిపోయిన పెద్దలే మరలా పుడతారనే నమ్మకంతో వాళ్ళను గర్భం లో మోస్తుంది కాబట్టి గర్భిణీ స్రీని పెద్దలమనిషి అంటారు.
ఇక్కడి స్థల పురాణం ప్రకారం ”నిద్రువన్,వేదికై”దంపతులు మల్లె పూలవనంలో నివసిస్తూ ,అక్కడే తపసు చేసుకుంటున్న గౌతమ,గార్గేయ మునులకు సేవలు చేస్తువుంటారు.వీరికి ఎన్నాళ్ళకు బిడ్డలు కలగనందున ఈ మునులను ప్రార్దించగా వారు పార్వతీ దేవిని పూజించమంటారు.దంపతులిద్దరి పూజకు మెచ్చి అమ్మవారు ఒక బిడ్డను వరంగా ప్రసాదిస్తుంది.’
వేదికై’ కడుపుతోవుండగా ఒక ముని శాపానికి గురయి గర్భ స్రావం జరుగుతుంది.వేదికై పార్వతీదేవికి మొరపెట్టుకోగా అమ్మవారు ప్రత్యక్షమై ఆ పిండాన్ని ఒక కుండలో పెట్టి కాపాడుతుంది. నెలలు నిండిన తర్వాత పుట్టిన ఆ బాలుడే ‘నైద్రువన్ ‘.వేదికై పూజలకు మెచ్చి ఆమెకోరిక ప్రకారం అమ్మవారు ‘గర్భ రక్షాంబిక’ పేరుతో ఇక్కడే వెలసిందని పురాణం.
తల్లిపాలు లేక’ ‘నైద్రువన్”అల్లాడుతుంటే అమ్మవారు ”కామధేనువును”ఇక్కడకు పంపిందని, దాని పాలతో ఏర్పడిన కొనేరుని ”క్షీరకుండము” అని పిలుస్తారు. ఇది గుడికి ఎదురుగా వుంది. అమ్మవారి విగ్రహం ఏడడుగుల ఎత్తులో కంచిపట్టు చీరేలో సర్వాలంకారాలతో జేజేయమానంగా మెరిసిపోతూ వుంది. అమ్మ వారిని రోజుకొక కొత్త కంచి పట్టు చీరేతో అలంకరిస్తారట.అమ్మ అభయహస్తమిస్తూ చూసిన వారి మనసుకు ప్రశాంతతనిస్తూ వుంది.
ఇక్కడ స్వామి స్వయంభూశివలింగం. శివుడు మల్లెపూలవనంలో పుట్టమట్టిలోవెలిసినందున ‘ముల్లై వననాధర్’ అని పిలుస్తారు. ముల్లైవనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని అర్ధం. ఇక్కడ శివలింగానికి అబిషేకం చేయరు..ఈ దేవుడు చర్మరోగాల నుండి కాపాడుతాడని, భక్తుల నమ్మకం.
ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు శివలింగం మీద చంద్ర కిరణాలు నేరుగా పడతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ గుడిలో ఎక్కువగా వెండి,బంగారు,వుయ్యాలలు,మొలతాళ్లు కంచి పట్టుచీరలను మొక్కులుగా చెల్లించుకుంటున్నారు.మేము వెళ్ళిన సమయంలోనే ఉత్సవ మూర్తులను వూరేగిస్తూ వున్నారు.
నిండైన విగ్రహం.సుందరమైన అమ్మవారిని మీకు వీలున్నపుడు చూసి రండి.తప్పక చూడాల్సిన గుడి ఇది..ఆడవారి గర్భాన్ని కాడాటానికే ప్రత్యేకంగా వెలసిన అమ్మ వారు,కనుక ఈ గుడిలో ఆడవారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. ఈ క్షేత్రదర్శనానికి స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.
—————— పూదోట శౌరీలు..బోధన్.
చాలా మంచి ఆర్టికల్స్ రాస్తున్నారు తర్జని లో… ఇంత మంచి విషయాలం మాకు తెలియపరుస్తున్న ప్రతి రచయితకు పేరుపేరునా ధన్యవాదాలు…